- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టుకు 'మెయిన్‌హర్ట్' బ్రేక్
మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టు డీపీఆర్ ఇవ్వడంలో మెయిన్‌హర్ట్ ఏజెన్సీ తీవ్ర ఆలస్యం చేస్తోంది. జూన్ 4తో గడువు ముగుస్తున్నా పనులు పూర్తికాలేదు.

దిశ, తెలంగాణ బ్యూరో: సీఎం రేవంత్ రెడ్డి మానస పుత్రిక మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టు డీపీఆర్ తయారు చేసే పనులు నత్తనడకన సాగుతున్నాయి. డీపీఆర్ రూపకల్పనకు నియమించిన కాంట్రాక్టు ఏజెన్సీ మెయిన్‌హర్ట్ మొండికేసింది. అధికారులకు అందుబాటులో లేకుండా పనులు చేయడానికి ముందుకు రావడం లేదనే విమర్శలు లేకపోలేదు. అయితే మూసీ పునరుజ్జీన ప్రాజెక్టుకు డీపీఆర్ తయారు చేయడానికి మెయిన్‌హర్ట్ ఏజెన్సీతో మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎంఆర్డీసీఎల్) 4 డిసెంబర్ 2024న ఒప్పందం చేసుకున్న విషయం తెలిసిందే. డీపీఆర్ తయారు చేయడానికి 18 నెలలపాటు సమయం పడుతుందని ఒప్పందంలో రాసుకున్నారు.
అయితే జూన్ 4వ తేదీతో 18 నెలలు పూర్తి కానుంది. కానీ మూసీ ప్రాజెక్టుకు సంబంధించిన 55 కిలోమీటర్లకు డీపీఆర్ ఇంత వరకు పూర్తికాలేదని అధికారులు చెబుతున్నారు. దీంతో సీఎం రేవంత్ రెడ్డికి సమాధానం చెప్పలేక, మెయిన్‌హర్ట్ ఏజెన్సీతో సకాలంలో పనులు చేయించలేక అధికారులు సతమతమవుతున్నట్లు తెలిసింది. ఈ విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తే.. ‘మీరేం చేస్తున్నారు’ అనే ప్రశ్న వచ్చే అవకాశముందని, ఏజెన్సీని గట్టిగా అడిగితే బిల్లులు రాలేదనే సమాధానం చెబుతున్నట్టు సమాచారం. అయితే పనులు పూర్తికాకుండానే బిల్లులెలా ఇస్తామని అధికారులు ఆపేసినట్టు తెలిసింది.
హడావుడిగా 21.కి.మీ డీపీఆర్
మూసీ పునరుజ్జీవనం ప్రాజెక్టు డీపీఆర్ రూపకల్పనలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న మెయిన్‌హర్ట్ ఏజెన్సీ మొదటి 21 కి.మీ డీపీఆర్‌ను సైతం అధికారుల ఒత్తిడి మేరకు హడావుడిగానే అందజేసిందనే విమర్శలూ లేకపోలేదు. ప్రజాప్రతినిధులు, నిపుణులు, పౌర సంఘాలు, పార్టీ ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి ఏర్పాటు చేసిన ‘మూసీ ఇన్వైటీస్’ కోసం ఏజెన్సీ వెంటపడితే తప్ప డీపీఆర్ ఇవ్వలేదని తెలిసింది. మూసీ పునరుజ్జీవనం ప్రాజెక్టులో మొదటి దశలో చేపట్టనున్న 21 కిలోమీటర్ల ప్రాజెక్టుకు భూసేకరణ ఖర్చు కాకుండానే రూ.6,500 కోట్ల నుంచి రూ.7వేల కోట్ల వరకు ఖర్చు అవుతుందని ప్రభుత్వం అంచనా వేసింది.
ఉస్మాన్ సాగర్ నుంచి గాంధీ సరోవర్ వరకు 11.8కి.మీ, హిమాయత్ సాగర్ నుంచి గాంధీ సరోవర్ వరకు 9.2 కి.మీ మార్గాలను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే హిమాయత్ సాగర్ నుంచి గాంధీ సరోవర్ వరకు అభివృద్ధి భూసేకరణ, హిమాయత్ సాగర్ బండ్ బలోపేతం, ఎకో ప్రాజెక్టు పనులను చేపట్టనున్నారు. ఉస్మాన్ సాగర్ నుంచి గాంధీ సరోవర్ వరకు విస్తరణ, రక్షణశాఖకు సంబంధించిన భూములను సేకరించే కార్యక్రమాలపై ప్రభుత్వం ఫోకస్ పెట్టాలని నిర్ణయించింది.
మూసీ హద్దుల గుర్తింపు
హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్కల్-మల్కాజ్‌గిరి జిల్లాలోని 14 మండలాల పరిధిలో గండిపేట్ నుంచి గౌరెల్లి వరకు 55 కిలోమీటర్ల మార్గంలో మూసీ ప్రవహిస్తోంది. ఈ 55 కిలోమీటర్ల మార్గంలో నదికి సంబంధించిన హద్దులు గుర్తించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగానే మొదటి దశ 21 కి.మీ మార్గంలో ఇప్పటికే నాలుగు కిలోమీటర్ల మేర హద్దులను గుర్తించినట్టు అధికారులు చెబుతున్నారు. మూసీ బౌండ్రీ నుంచి ఇరువైపుల 50 మీటర్ల బఫర్ ఏరియాను గుర్తించనున్నారు. ఈ ప్రాంతాల్లో నది జీవావరణ, అర్బన్ ల్యాండ్ స్కేపింగ్ పనులు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. మూసీ నది శుద్ధీకరణ తో పాటు, ఇరువైపులా పర్యాటక కేంద్రాలు, ఉద్యానవనాలు, అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన మౌలిక సదుపాయాలను కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రణళికలు రూపొందించింది.






