జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లోనూ పార్టీ జెండాను ఎగరవేస్తాం : టీపీసీసీ చీఫ్​ మహేష్ కుమార్ గౌడ్

by Muthe.Rajitha |

రానున్న జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ జెండా ఎగరవేస్తామని టీపీసీసీ చీఫ్​ మహేష్ కుమార్ గౌడ్ ధీమా వ్యక్తరం చేశారు.

జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లోనూ పార్టీ జెండాను ఎగరవేస్తాం : టీపీసీసీ చీఫ్​ మహేష్ కుమార్ గౌడ్
X

దిశ, తెలంగాణ బ్యూరో : గాంధీభవన్ లో జలమండలి ఎన్నికలలో విజయం సాధించిన మొగుళ్ల రాజిరెడ్డి అభినందన సభ ఆదివారం ఐఎన్టీయూసీ ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ సింగరేణి, జలమండలి వంటి సంస్థలను గుప్పిట్లో పెట్టుకుని బీఆర్ఎస్ నాయకులు కార్మికులను ఇబ్బందులకు గురిచేశారని, జలమండలిని హరీష్ రావు తన గుప్పిట్లో పెట్టుకున్న పరిస్థితి ఉండేదని మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. జలమండలి ఎన్నికల్లో ఐఎన్‌టీయూసీ కాంగ్రెస్ జెండా ఎగరేశామని, రానున్న జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ జెండా ఎగరవేస్తామని ధీమా వ్యక్తరం చేశారు.

కార్మికులు, ఉద్యోగుల మద్దతు కాంగ్రెస్ ప్రభుత్వానికే ఉందని ఈ ఫలితాలు స్పష్టం చేస్తున్నాయని, ఐఎన్‌టీయూసీ విజయంతో ఉద్యోగుల అండ కాంగ్రెస్‌కు ఉందనే విషయం మరోసారి రుజువైందని మహేష్ కుమార్ గౌడ్ చెప్పారు. బీఆర్ఎస్ పాలనలో ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తే ప్రభుత్వం స్పందించలేదని, సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో మూడు రోజుల్లోనే ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరిపి సమ్మెను విరమింపజేశారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో కార్మికులు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించి తమ నాయకులను గెలిపించారని, కార్మికుల కష్టసుఖాల్లో అండగా నిలవాలని మొగుళ్ల రాజిరెడ్డి బృందానికి సూచిస్తున్నట్లుగా ఆయన స్పష్టం చేశారు.

ఐఎన్‌టీయూసీ ఎన్నికల విజయానికి సంజీవ రెడ్డి కృషి ఎంతో ఉందని గుర్తిస్తున్నామని, కార్మికుల సమస్య ఏదైనా సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని మహేష్ కుమార్ గౌడ్ హామీ ఇచ్చారు. ఈ విజయం కార్మికుల ఆత్మగౌరవానికి, కాంగ్రెస్‌పై ఉన్న విశ్వాసానికి నిదర్శనమన్నారు. రానున్న రోజుల్లో కార్మిక సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం మరింత చిత్తశుద్ధితో పనిచేస్తుందని ఆయన తెలిపారు. అంతకుముందు భారీ ర్యాలీగా కాంగ్రెస్ శ్రేణులతో కలిసి మొగుళ్ల రాజిరెడ్డి గాంధీ భవన్ కి చేరుకున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు.

Next Story