రాగల మూడు రోజుల్లో.. తెలంగాణ వర్షాలపై లేటెస్ట్ అప్డేట్

by Naga Rani Yarlagadda |   (  Updated:2026-06-07 16:20:02  IST  )

ఎండ తీవ్రతతో అల్లాడుతున్న రాష్ట్ర ప్రజలకు వాతావరణ శాఖ తీపి కబురు అందించింది. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న నైరుతి రుతుపవనాలు ఈ నెల 10వ తేదీన, లేదా అంతకన్నా ముందే తెలంగాణను తాకే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది.

రాగల మూడు రోజుల్లో.. తెలంగాణ వర్షాలపై లేటెస్ట్ అప్డేట్
X
  • ఈ నెల 10న తెలంగాణను తాకనున్న రుతుపవనాలు
  • వికారాబాద్ జిల్లా తాండూరులో 4 సెంటీమీటర్ల వర్షం

దిశ, తెలంగాణ బ్యూరో: ఎండ తీవ్రతతో అల్లాడుతున్న రాష్ట్ర ప్రజలకు వాతావరణ శాఖ తీపి కబురు అందించింది. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న నైరుతి రుతుపవనాలు ఈ నెల 10వ తేదీన, లేదా అంతకన్నా ముందే తెలంగాణను తాకే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుతం ఇవి అనుకూల వాతావరణ పరిస్థితుల మధ్య వేగంగా ముందుకు సాగుతున్నాయని, మరో మూడు రోజుల్లో రాష్ట్రంలోకి ప్రవేశించనున్నాయి. సాధారణంగా జూన్ ఒకటి లేదా మొదటి వారంలో రుతుపవనాలు వస్తాయి. ఇప్పటికే రుతుపవనాలు కేరళను తాకాయి. ఈ ఏడాది ఎల్ నినో తో ఆలస్యం అవుతాయని, ఈ ఏడాది తక్కువ వర్షపాతం నమోదవుతుందని వాతావరణ శాఖ తెలిపింది.

మూడు రోజుల పాటు వర్షాలు

రుతుపవనాల రాకకు ముందే రాష్ట్రవ్యాప్తంగా వాతావరణం చల్లబడనుంది. ద్రోణి ప్రభావంతో రాబోయే మూడు రోజుల పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. గాలివేగం గంటకు 40 నుండి 50 కి.మీ వేగంతో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని తెలిపింది. మంగళవారం కుమరం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మేడ్చల్ మల్కాజ్ గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణ పేట, జోగులాంబ గద్వాల్ జిల్లాలలో అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

గడిచిన 24 గంటలలో వికారాబాద్ జిల్లా తాండూరులో 4 సెం.మీ, హైదరాబాద్ జిల్లా గోల్కొండలో 3 సెం.మీ, యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరి గుట్టలో 3 సెం.మీ, వికారాబాద్ జిల్లా తాండూరులో 2 సెం.మీ, పరిగిలో 2 సెం.మీ, మహబూబ్ నగర్ జిల్లా నవాబ్ పేట్ లో 2 సెం.మీ. జోగులాంబ గద్వాల జిల్లా ఆలంపూర్ లో 2 సెం.మీ చొప్పున వర్షాపాతం నమోదైంది.

Next Story