- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కాంగ్రెస్ నేతల వీరంగం.. రాజకీయ కక్షలే కారణమా?
భీమదేవరపల్లి మండలంలో కాంగ్రెస్ నాయకుల మధ్య నెలకొన్న విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి.

దిశ, భీమదేవరపల్లి : భీమదేవరపల్లి మండలంలో కాంగ్రెస్ నాయకుల మధ్య నెలకొన్న విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. రంగయ్యపల్లి గ్రామానికి చెందిన భూమి దాత, కాంగ్రెస్ నాయకుడు లక్కిరెడ్డి తిరుపతి రెడ్డి నివాసంపై కాంగ్రెస్ మండల మహిళా అధ్యక్షురాలు స్వరూప, ఆమె అనుచరులు దాడికి పాల్పడ్డారని ఆరోపణలు వెల్లువెత్తాయి. గేట్లు ధ్వంసం చేసి, ఇంటి ఆవరణలో ఆస్తులను పాడుచేశారని బాధితులు పేర్కొన్నారు. ఈ ఘటన వెనుక మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రోత్సాహం ఉందని వారు ఆరోపించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఘటనపై స్పందించిన తిరుపతి రెడ్డి, తనపై రాజకీయ కక్షసాధింపులో భాగంగానే దాడులు, కేసులు నమోదవుతున్నాయని ఆరోపించారు. రంగయ్యపల్లి గ్రామంలో మహిళల కోసం బతుకమ్మ కుంట ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో గతంలో తాను సొంత భూమిని దానం చేశానని గుర్తు చేశారు.
అప్పట్లో తన సేవలను ప్రశంసించిన నాయకత్వమే ఇప్పుడు ప్రజల్లో పెరుగుతున్న ఆదరణను చూసి అడ్డంకులు సృష్టిస్తోందని విమర్శించారు. బతుకమ్మ కుంట కోసం ఇచ్చిన భూమిని గ్రామ పంచాయతీ పేరిట రిజిస్ట్రేషన్ చేయించే ప్రక్రియలో తాను ఐదు నెలలుగా అధికారులను సంప్రదిస్తున్నప్పటికీ కావాలనే వివాదాలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. తన రాజకీయ ఎదుగుదలను అడ్డుకునేందుకే తప్పుడు కేసులు బనాయిస్తున్నారని, స్థానిక నాయకత్వాన్ని అణచివేసే కుట్ర జరుగుతోందని మండిపడ్డారు. హుస్నాబాద్ నియోజకవర్గంలో స్థానిక నాయకులకు ప్రాధాన్యం తగ్గిపోతోందని, అధికార బలంతో రాజకీయ ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకుంటున్నారని తిరుపతి రెడ్డి ఆరోపించారు. దాడి ఘటనపై నిష్పాక్షిక విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, తన కుటుంబానికి రక్షణ కల్పించాలని పోలీసు ఉన్నతాధికారులను కోరారు. ఈ ఘటనతో భీమదేవరపల్లి రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కగా, కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు మరోసారి బహిర్గతమైనట్లు రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.






