- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు
ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి ఆలయానికి ఆదివారం భక్తులు పోటెత్తారు.

దిశ, కొమురవెల్లి : ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి ఆలయానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. శనివారం నుంచే ఆలయానికి చేరుకున్న భక్తులు ప్రైవేటు, దేవాలయ సత్రాలలో రాత్రి బస చేసి, ఆదివారం వేకువజామున లేచి కోనేరులో స్నానాలు ఆచరించి స్వామివారిని దర్శించుకున్నారు. స్వామివారి దర్శనానికి సుమారు మూడు గంటల సమయం పట్టింది. ఈ సందర్భంగా భక్తులు పట్నాలు, బోనాలు, అర్చనలు, అభిషేకాలు, కళ్యాణం, తిరుగుడు కోడె, తలనీలాలు తదితర మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం కొండపై ఉన్న రేణుక ఎల్లమ్మను దర్శించుకున్నారు. మండుటెండలను సైతం లెక్కచేయకుండా పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకోవడానికి తరలివచ్చారు.
వేసవి సెలవులు ముగుస్తున్న నేపథ్యంలో ఆలయానికి భక్తుల రద్దీ పెరిగినట్లు ఆలయ వర్గాలు తెలిపాయి. అయితే ఆలయ ప్రాంగణంలో చలువ పందిళ్లు, తాగునీటి కులాయిలు తగినంతగా లేకపోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. క్యూ లైన్లలో కనీస వసతులైన తాగునీరు, ఫ్యాన్లు, మరుగుదొడ్లు లేకపోవడంపై కొందరు భక్తులు అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు.
మల్లన్న ఆలయ ఈవోగా కట్ట సుధాకర్ రెడ్డి
కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి ఆలయ కార్యనిర్వాహణాధికారిగా ఈవోగా కట్ట సుధాకర్ రెడ్డి ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఇక్కడ ఈవోగా పనిచేసిన కృష్ణ ప్రసాద్ బదిలీపై వరంగల్ దేవాదాయ శాఖ ఉప కమిషనర్‌గా వెళ్లారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం కట్ట సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ, తాను బాసర, నాచారం లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం, కీసర దేవాలయాల్లో పని చేసినట్లు తెలిపారు. భక్తులకు మరింత మెరుగైన వసతులు కల్పించేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధానార్చకులు మహాదేవుని మల్లికార్జున్, ఆలయ పర్యవేక్షకులు నీలా శేఖర్, ఆలయ సిబ్బంది శ్రీనివాస్ రెడ్డి, భాస్కర్ రావు, మధుకర్ తదితరులు పాల్గొన్నారు.






