పసుపుదళం ఆత్మీయవేడుక - మహానాడు

by Muthe.Rajitha |

తెలుగుదేశం మహానాడు పసుపుదళం పండుగ.. మే 27,28 తేదీల్లో ఆన్లైన్ లో జరుగుతున్న TDP మహానాడు నవశకానికి, యువ నాయకత్వానికి నాంది కాబోతుంది.

పసుపుదళం ఆత్మీయవేడుక - మహానాడు
X

తెలుగుదేశం మహానాడు పసుపుదళం పండుగ... ఒక చరిత్ర.. గొప్పవేడుక...మే 27,28 తేదీల్లో ఆన్ లైన్ లో జరుగుతున్న తెలుగుదేశం పార్టీ మహానాడు నవశకానికి, యువ నాయకత్వానికి నాంది కాబోతుంది. ప్రజలకోసం, ప్రజలతోనే సిద్దాంతంతో 1845 క్రస్టర్లు ద్వారాఆధునిక సాంకేతికతతో తెలుగుదేశం పార్టీని మరింత ప్రజలకు చేరువ చేసేందుకు యువ నాయకుడు టీడీపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు నారా లోకేష్ ఆలోచనలకు కార్యరూపమే హైబ్రిడ్ మహానాడు.

ప్రజా ప్రయోజనాలే లక్ష్యంగా భావించే తెలుగుదేశం పార్టీ ఇంధన పొదుపు సూత్రాన్ని పాటిస్తూ మహానాడు కార్యక్రమాన్ని ఆన్‌లైన్‌లో నిర్వహించడం స్ఫూర్తిదాయకం. తెలుగుదేశం పార్టీ చరిత్రాత్మక వైభవాన్ని స్మరించుకుంటూ, పార్టీ భవిష్యత్తును మరింత దృఢంగా నిర్మించుకునేందుకు మహానాడు వేదిక కీలకం కానుంది. టీడీపీ కుటుంబ సభ్యుల ఆత్మీయ కలయికైన మహానాడు అభివృద్ధి సంకల్పాలకు నాంది కానుందనడంలో సందేహం లేదు.

లక్షలాదిమంది కలుసుకునే ఆత్మీయ వేదిక

మహానాడు అంటే కేవలం సమావేశం కాదు… అది భావోద్వేగాల కలయిక, చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం, ప్రజల శ్రేయస్సుకే పెద్దపీట వేయడం, ఆశయాల ఆవిష్కరణ, పార్టీ పట్ల ప్రేమాభిమానాల ప్రతిబింబం. నాయకుడిని దగ్గరగా చూసే అవకాశం, తోటి కార్యకర్తలతో ఆత్మీయంగా కలిసే క్షణాలు, పార్టీ చరిత్రను గుర్తుచేసుకునే స్ఫూర్తిదాయకమైన వేళలు అందులో దాగి ఉంటాయి. అయితే దేశ పరిస్థితులు, రాష్ట్ర పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ప్రజల ఆరోగ్యం, భద్రతలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలనే ఉద్దేశంతో దేశ ప్రధాని నరేంద్రమోదీ ఇచ్చిన పిలుపును గౌరవిస్తూ, ప్రజల సంక్షేమమే ఎప్పుడూ ముందుంటుందని నమ్మే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు వర్చువల్ మహానాడు నిర్ణయం ఎంతో భారమైన హృదయంతో పసుపు సైనికులు అంగీకరించక తప్పడం లేదు. వ్యక్తిగత ఆనందాలకంటే ప్రజల ప్రాణాలే ముఖ్యమని భావించే నాయకత్వం మా తెలుగుదేశం పార్టీ సొంతం. మహానాడు ప్రత్యక్షంగా జరగకపోయినా… ప్రతి పసుపు సైనికుడి గుండెల్లో అదే ఉత్సాహం, అదే నిబద్ధత, అదే అభిమానంతో మహానాడు స్ఫూర్తి చిరస్థాయిగా నిలిచిపోతుంది.

మూడు తరాల నాయకత్వం

నాడు తెలుగు ప్రజల గౌరవంకోసం ఎన్టీఆర్.. నేడు తెలుగు ప్రజల అభివృద్ధి మా హక్కు – ప్రజల కోసం పనిచేయడమే మా లక్ష్యం అంటూ చంద్రబాబు నాయుడు... రేపటి తెలుగు రాష్ట్రాల నవశకంకోసం యువతలో దూకుడు తీసుకొచ్చిన ప్రస్తుత యువనాయకుడు నారా లోకేష్‌తో తెలుగు దేశం కీర్తి పతాకం ప్రపంచ వ్యాప్తంగా రెపరెపలాడుతున్న నేపధ్యంలో జరుగుతున్న మహానాడు కోసం తెలుగుదేశం కార్యకర్తలు ఆత్రంగా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత ఇప్పటి వరకు జరిగిన 33 మహానాడులు ఒక ఎత్తు అయితే యువనాయకుడు, యువతకు మార్గదర్శి తెలుగుదేశం పార్టీ కార్యనిర్వహక అధ్యక్షుడు నారా లోకేష్ నేతృత్వంలో జరగబోతున్న మహానాడు మరో ఎత్తు అనే చెప్పాలి. 1983 మే లోఎన్టీఆర్ సారధ్యంలో జరిగిన తొలి మహానాడు "ఎవర్ గ్రీన్"గా నిలవగా నారా లోకేష్ నాయకత్వంలో జరగనున్న 34వ మహానాడు మరో నూతన అధ్యయానికి నాంది కాబోతున్నది. తొలి మహానాడుతోనే తెలుగుదేశం పార్టీ జాతీయ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకుంది. అయితే తెలుగుదేశం పార్టీ తొలి మహానాడు విశేషాలను ఇప్పటికీ ప్రత్యేకంగా చెప్పుకుంటారు. కొత్తతరం వారు ఆ మహానాడు ఎలా జరిగిందో తెలుసుకుని ఆశ్చర్యపోతుంటారు.

"మహానాడు"గా నామకరణం చేసిన ఎన్టీఆర్ !

టీడీపీని స్థాపించిన తొమ్మిది నెలల్లోనే ఎన్టీఆర్ అధికారం చేపట్టారు. ఆ తర్వాత పార్టీ సభను నిర్వహించాలని నిర్ణయించారు. దానికి ఎన్టీఆర్ మహానాడు అని పేరు పెట్టారు. కానీ ఆ పేరు అప్పటి టీడీపీ నేతలకు చాలా విచిత్రంగా అనిపించింది. మహానాడు అంటే సమావేశమా? వేడుకా? బహిరంగ సభా అని చాలా మంది నేతలకు అర్థం కాలేదు. కానీ ఎన్టీఆర్‌ను నేరుగా అడిగే ధైర్యం ఎవరికీ లేదు. అయితే ఏర్పాట్లు ప్రారంభమైన తర్వాత పసుపు పండుగ అని ప్రతివారికి అర్థమైంది. మహానాడు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగు సినిమా నటుడు నందమూరి తారక రామారావు జన్మదినం సందర్భంగా మే 28న తెలుగుదేశం పార్టీ చేసుకునే ఉత్సవం. మహానాడు అనేది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, అభిమానులకు సంబంధించి ప్రతీ సంవత్సరం జరిగే పార్టీ కార్యక్రమం.

మహానాడు పేరెందుకు వచ్చిందంటే?

అస‌లు మ‌హానాడు ఎందుకు వ‌చ్చింద‌నేది చూస్తే.. చాలా చిత్ర‌మైన వాతావ‌ర‌ణం క‌నిపిస్తుంది. అప్ప‌ట్లో అంటే.. 1985ల‌లో రెడ్డి సామాజిక వ‌ర్గం రాజ‌కీయంగా పుంజుకునే ప్ర‌య‌త్నం చేసింది. అప్ప‌టికే కాంగ్రెస్‌కు ద‌న్నుగా ఉన్న రెడ్డి సామాజిక వ‌ర్గంలో చీలిక‌లు ఏర్ప‌డి.. కొత్త పార్టీలు పుట్టుకువ‌చ్చాయి. అలాకాదు.. అంద‌రూ స‌మైక్యంగా ఉండాలంటూ.. రెడ్డి నాయ‌కులు.. క‌ర్నూలులో భారీ స‌భ నిర్వ‌హించా రు. ఇది రెండు రోజుల పాటు జ‌రిగింది. అంటే.. ఒక ర‌కంగా.. ఇది రెడ్డి సామాజిక వ‌ర్గాన్ని కాంగ్రెస్ త‌న‌వైపు తిప్పుకొనేందుకు జ‌రిగిన స‌భ‌గా అప్ప‌ట్లో ప్ర‌చారం జ‌రిగింది. ఈ విష‌యం తెలిసిన ఎన్టీఆర్‌.. దీనికి పోటీగా.. అన్ని సామాజిక వ‌ర్గాల‌కు ప్రాధాన్యం ఇవ్వాల‌నే ఉద్దేశంతో మ‌నం కూడా ఒక స‌భ‌ను ఏర్పాటు చేద్దాం.. అని పార్టీ ముఖ్య‌నాయ‌కుల‌కు సూచించారు. ఈ క్ర‌మంలోనే అన్న‌గారి పుట్టిన రోజు మే 28న ఈ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించాల‌ని భావించారు.

అంద‌రినీ క‌లుపుకొని పోయే రోజు

అలా.. మ‌హానాడు మొద‌లైంది. అయితే.. మ‌హా అనే పేరు రావ‌డం వెనుక కూడా అనేక త‌ర్జ‌న భ‌ర్జ‌న‌లు వ‌చ్చాయి. దీనికి మ‌హా అనే ప‌దం ఎందుకు వాడార‌నేది కూడా ఆస‌క్తి దాయ‌క‌మే. మ‌హా అంటే.. మొత్తం స‌మీక‌ర‌ణ అనే అర్థం ఉంది. అదేవిధంగా గంభీరంగా ఉన్న ప‌దం కూడా. దీంతో అంద‌రినీ క‌లుపుకొని పోయే ఏకైక పార్టీ ఇదేన‌ని చెప్పాల‌న్న ఏకైక ల‌క్ష్యంతో మ‌హా ప‌దాన్ని ఎంచుకున్నారు. ఇక‌, నాడు అనే ప‌దం కేవ‌లం కొందరు ఇచ్చిన సూచ‌న మేర‌కు తీసుకున్నారు. ఇలా మ‌హానాడు(అంద‌రినీ క‌లుపుకొని పోయే రోజు) అనే అర్థంలో ఈ కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించారు. ఇక ఎన్టీఆర్ రాజకీయరంగ ప్రవేశం ఒక ప్రభంజనం. ఆయన నోట ప్రతిధ్వనించిన ఆత్మగౌరవ నినాదం ఒక బ్రహ్మాస్త్రం. “నేను తెలుగువాడిని, నాది తెలుగుదేశం పార్టీ” అంటూ ఎన్టీఆర్ స్థాపించిన పార్టీ తెలుగు వారికి స్వర్ణయుగపు వైభవాన్ని ఇచ్చింది. దేశ రాజకీయాలలో సమూల మార్పులు తెచ్చింది. ప్రజల్లో రాజకీయ చైతన్యాన్ని తెచ్చింది. బడుగులకు అధికారాన్ని ఇచ్చింది. స్త్రీలకు సాధికారతను ఇచ్చింది. దేశంలో జనసంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టింది.

ఎన్టీఆర్ రూపంలో పేదలకు పట్టెడన్నం, కట్టుకోడానికి బట్ట, తలదాచుకోడానికి పక్కా ఇల్లు అందిస్తే... నారాచంద్రబాబు నాయుడు రూపంలో సామాన్యుడి కలలకు రెక్కలు తొడిగి ఆకాశాన్ని అందుకునే అవకాశాలను అందించింది తెలుగుదేశం. ప్రజలకు ఏం కావాలో సమకూర్చుతూనే... మరోపక్క ప్రజలకు అక్కరలేని ఫ్యాక్షనిజం, మత ఘర్షణలు, రౌడీయిజం, నక్సలిజం వంటి వాటిపై ఉక్కుపాదం మోపి అణిచేసారు చంద్రబాబునాయుడు. అసాధారణ రాజకీయ ధురంధరుడు - ఆయనే టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు. ఆయన సారధ్యంలో జరుగుతున్న 26వ మహానాడు పెను సంచలనాలకు నాంది కానుంది.

అన్నేళ్లూ ఒకెత్తు - గడచిన ఐదేళ్లూ ఒకెత్తు

పదిహేనేళ్ళు ముఖ్యమంత్రిగా, మరో పదిహేనేళ్లు ప్రతిపక్షనేతగా పనిచేయడం రాష్ట్ర చరిత్రలో ఇప్పటికీ రికార్డే! ఆయన సాధించిన విజయాల్ని తరచి చూస్తే వాటి వెనుక ఎన్నో త్యాగాలు, అవిశ్రాంత కృషి, క్రమశిక్షణ కనిపిస్తాయి. సుదీర్ఘ రాజకీయ జీవితంలో చంద్రబాబు అనేక ఆటుపోట్లు ఎదుర్కొన్నారు. కిందపడిన ప్రతిసారీ అంతే ఉత్సాహంతో పోరాటం ప్రారంభించి మళ్లీ గెలిచి చూపించారు. ఆయనరాజకీయ ప్రస్థానంలో మొదటి నాలుగు దశాబ్దాలు ఒకెత్తు గడచిన ఐదేళ్లూ ఒకెత్తు. గతంలో ఎందరో కాకలు తీరిన నాయకులతో కలసి పనిచేశారు. మహామహా యోధుల్ని ఢీకొట్టారు. రాజకీయ పోరాటాలు, గెలుపోటములు ఆయనకు కొత్తకాదు.

అవమానాల నుంచి అగ్నిపునీతుడిగా...

ఏమాత్రం రాజకీయ పరిపక్వత లేని జగన్‌ వంటి నాయకుడి ఐదేళ్ల పాలనలో... చంద్రబాబు గతంలో ఎన్నడూ లేనన్ని అవమానాలు, కక్షసాధింపులు ఎదుర్కొన్నారు. చంద్రబాబు వయసు, రాజకీయ అనుభవానికి కనీస గౌరవం ఇవ్వకుండా వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు వెకిలి మాటలు, వ్యక్తిగత దూషణలతో చెలరేగిపోతుంటే నిరోధించాల్సిన జగన్‌ వెకిలి నవ్వులతో ప్రోత్సహించినా ఆయన సహించారు. చివరకు అసెంబ్లీలో తన భార్య వ్యక్తిత్వాన్నే కించపరిచేలా వ్యాఖ్యలు చేసేసరికి సహించలేక మళ్లీ ముఖ్యమంత్రిగానే సభలో అడుగుపెడతానని శపథం చేసి బయటకు వచ్చేశారు. ఆయనపై జగన్‌ ప్రభుత్వం అక్రమ కేసులు బనాయించి 52 రోజులు జైల్లో పెట్టినా మౌనంగా భరించారు. ఇన్ని అవమానాలు, దాడులు ఎదురైనా చెక్కుచెదరని స్థైర్యంతో పోరాడి ఈ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ మూకల్ని మట్టికరిపించారు. పార్టీ చరిత్రలోనే అనన్య సామాన్యమైన విజయాన్ని నమోదుచేసి మరో 40 ఏళ్లకు సరిపడా పార్టీకి అవసరమైన జవసత్వాల్ని అందజేశారు.

విశ్రాంతి ఎరుగని పార్టీ

టీడీపీ మహానాడు అంటే.. ఆ పార్టీ నేతలు, కార్యకర్తలకు ఓ ప్రత్యేకమైన అనుభూతి మిగులుతుంది. అధికారంలో ఉన్నా లేకపోయినా... మహానాడును టీడీపీ సంబరంగా నిర్వహిస్తూ ఉంటుంది. ప్రతిపక్షంలో ఉన్నా అధికారంలో ఉన్నా ప్రజల పక్షమైన తెలుగుదేశం పార్టీకి విశ్రాంతి అనేది లేదు. సమసమాజం నిర్మించబడి, పేదరికం లేని ఆనందకరమైన జీవితం ప్రతి తెలుగువాడికి అందించే వరకు జీవనదిలా, నిత్య చైతన్య ప్రవాహంలా చరిత్రను తనలో ఇముడ్చుకుంటూ ముందుకు పోతుంది తెలుగుదేశం. పసుపు అంటే ప్రజలకు శుభాన్ని ఇచ్చేది. పసుపు దళం అంటే ప్రజలకు భరోసా ఇచ్చేది. తెలుగుదేశం అంటే అప్రతిహత శక్తి ప్రసారిణి.

వాసంశెట్టి సుభాష్

కార్మికశాఖ మంత్రి

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం

Next Story