అందోలు రోడ్లకు మహర్దశ.. మంత్రి చొరవతో రూ.100 కోట్ల మంజూరు

by Batti.Sumithra |

అందోలు నియోజకవర్గ గ్రామీణ ప్రాంతాల రోడ్లకు మహర్దశ పట్టనుంది.

అందోలు రోడ్లకు మహర్దశ.. మంత్రి చొరవతో రూ.100 కోట్ల మంజూరు
X

దిశ, అందోల్‌ : అందోలు నియోజకవర్గ గ్రామీణ ప్రాంతాల రోడ్లకు మహర్దశ పట్టనుంది. గ్రామీణ ప్రాంతాల్లో రవాణా సౌకర్యాన్ని మెరుగుపరిచేందుకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సీ. దామోదర్‌ రాజనర్సింహ ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు. ఎన్నో ఏండ్లుగా మరమ్మత్తులకు, కొత్త రోడ్లకు నోచుకోని ప్రాంతాల పై ప్రత్యేక దృష్టి పెట్టారు. నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల్లో 28 కిలోమీటర్ల రోడ్లతో పాటు హై లెవల్‌ వంతెన నిర్మాణం చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.100 కోట్ల నిధులను మంజూరు చేసింది. నియోజకవర్గంలోని ప్రధాన రహదారులు అభివృద్ధి చెంది ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించబడటంతో పాటు గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి తోడ్పాటునందనున్నాయి.

అందోల్‌ మండలంలోని సంగుపేట నుంచి పుల్కల్‌ మండలం పోచారం వరకు 18 కిలోమీటర్ల రహదారి నిర్మాణానికి రూ.40 కోట్లు, మునిపల్లి మండలంలోని క్యాసారం నుంచి మునిపల్లి, గార్లపల్లి, అల్లాపూర్‌ వరకు 10 కిలోమీటర్ల మేర రహదారి నిర్మాణానికి రూ.30 కోట్లను మంజూరు చేసింది. అంతేకాకుండా పాపన్నపేట మండలంలోని నార్సింగ్‌ నుంచి పెద్ద శంకరంపేట వరకు హై లెవల్‌ వంతెన నిర్మాణానికి రూ.30 కోట్లు మంజూరు చేసింది. దీంతో మొత్తం రూ.100 కోట్ల నిధులు మంజూరయ్యాయి. ఈ పనులను చేపట్టేందుకు టెండర్ల నిర్వహణకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. త్వరలోనే టెండర్‌ ప్రక్రియను పూర్తి చేసి పనులను వేగవంతంగా చేపట్టేందుకు కసరత్తు ప్రారంభించారు. ఇదిలావుండగా, అందోలు నియోజకవర్గ వ్యాప్తంగా రోడ్ల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం రూ.100 కోట్లను మంజూరు చేయడంపై వాహనదారులు, ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పనులు నాణ్యతగా జరిగేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని వారు కోరుతున్నారు.

Next Story