- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విద్యుత్ శాఖలో అవినీతి ఆరోపణలు.. వినియోగదారుల ఆవేదన
కీసర సబ్ డివిజన్ విద్యుత్ శాఖలో అవినీతి, అక్రమాలు చోటుచేసుకుంటున్నాయంటూ వినియోగదారులు, స్థానిక ప్రజల నుంచి ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.

దిశ, మేడ్చల్ బ్యూరో/కాప్రా : కీసర సబ్ డివిజన్ విద్యుత్ శాఖలో అవినీతి, అక్రమాలు చోటుచేసుకుంటున్నాయంటూ వినియోగదారులు, స్థానిక ప్రజల నుంచి ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. సాధారణ ప్రజల పనులకు అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండగా, ముడుపులు చెల్లించిన వారికి మాత్రం తక్షణమే సేవలు అందిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. వినియోగదారుల ఆరోపణల ప్రకారం.. కొత్త విద్యుత్ కనెక్షన్లు, మీటర్లలో పేరు మార్పులు, ఇతర సేవల కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తోందని, అధికారులకు అదనపు మొత్తాలు చెల్లించినప్పుడే పనులు వేగంగా పూర్తవుతున్నాయని పేర్కొంటున్నారు. అడిగినంత డబ్బు చెల్లించకపోతే వివిధ కారణాలు చూపుతూ కార్యాలయాల చుట్టూ తిప్పుతున్నారని రైతులు, వినియోగదారులు ఆరోపిస్తున్నారు.
రియల్ ఎస్టేట్ వెంచర్లకు ప్రాధాన్యత?..
కీసర సబ్ డివిజన్ పరిధిలో రియల్ ఎస్టేట్ వెంచర్లకు నిబంధనలకు విరుద్ధంగా విద్యుత్ సదుపాయాలు కల్పించారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్ల ఏర్పాటులో అవకతవకలు జరిగాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యవహారంలో ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపించిందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ప్రజా సమస్యలపై నిర్లక్ష్యం?..
కీసర సబ్ డివిజన్ పరిధిలోని పలు కాలనీల్లో లో వోల్టేజ్ సమస్యలు, ప్రమాదకరంగా ఇండ్ల పైనుంచి వెళ్తున్న విద్యుత్ తీగలు, గాలివానల సమయంలో విద్యుత్ సరఫరా అంతరాయం వంటి సమస్యలు నెలకొన్నప్పటికీ అధికారులు స్పందించడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. అహ్మద్‌గూడ (బండ్లగూడ) ప్రాంతంలో నివాసాల పైనుంచి విద్యుత్ తీగలు వెళ్లడంతో ప్రమాదకర పరిస్థితులు ఏర్పడుతున్నాయని, సమస్య పరిష్కారానికి పలుమార్లు అధికారులను ఆశ్రయించినప్పటికీ సరైన చర్యలు తీసుకోలేదని మాజీ కౌన్సిలర్ వెంకటేష్ ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్ లైన్ల మార్పునకు అదనపు వ్యయం భరించాలని అధికారులు సూచిస్తున్నారని తెలిపారు.
డీఈకి నోటీసులు జారీ చేసినట్లు సమాచారం..
‘కీసర విద్యుత్ శాఖలో భారీ కుంభకోణం’ అనే శీర్షికతో మంగళవారం ప్రచురితమైన ‘దిశ’ కథనంపై విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు స్పందించినట్లు సమాచారం. కీసర సబ్ డివిజన్ పరిధిలో అవినీతి, అక్రమాలపై వస్తున్న ఆరోపణలకు సంబంధించి పూర్తి వివరాలు సమర్పించాలని కీసర డివిజనల్ ఇంజినీర్ (డీఈ)కు నోటీసులు జారీ చేసినట్లు తెలిసింది. అయితే, ఈ ఆరోపణలపై సంబంధిత విద్యుత్ శాఖ అధికారుల స్పందన అందాల్సి ఉంది.






