రాష్ట్ర వ్యాప్తంగా భక్తి శ్రద్ధలతో మహా శివరాత్రి

by Muthe.Rajitha |

శివనామస్మరణతో మార్మోగిన శైవక్షేత్రాలు

రాష్ట్ర వ్యాప్తంగా భక్తి శ్రద్ధలతో మహా శివరాత్రి
X

దిశ, తెలంగాణ బ్యూరో: మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆదివారం తెలంగాణలోని ప్రముఖ శైవ క్షేత్రాలు భక్తులతో కిక్కిరిపోయాయి. తెలంగాణలో ప్రసిద్ది గాంచిన శైవ క్షేత్రాలైన వేములవాడ రాజరాజేశ్వర, కాళేశ్వరం ముక్తీశ్వర స్వామి ఆలయం, మెదక్ ఏడుపాయల క్షేత్రం, కొమురవెల్లి మల్లన్న, కీసర గుట్ట రామలింగేశ్వర ఆలయాలు ఆధ్యాత్మిక శోభతో విరాసిల్లాయి. లక్షలాది మంది భత్తులు తరలివచ్చిన నేపధ్యంలో ప్రభుత్వ యంత్రాంగం ఈ ఆలయాల్లో విస్త్రుత ఏర్పాట్లు చేసింది. ఆదివారం తెల్లవారుజాము నుంచే భక్తులు భక్తిశ్రద్ధలతో శివాలయాలకు పోటెత్తారు. ఓం నమః శివాయ అనే పంచాక్షరీ మంత్రంతో ఆలయ ప్రాంగణాలు మార్మోగాయి. పుణ్యనదుల్లో పవిత్ర స్నానాలు ఆచరించిన భక్తులు, పరమశివుడిని దర్శించుకుని అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు.

శైవక్షేత్రాల్లో భక్తుల రద్దీ:

రాష్ట్రంలోని ప్రముఖ శైవక్షేత్రాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. వేములవాడ రాజన్న క్షేత్రం భక్తుల జనసంద్రమైంది. స్వామివారికి కోడె మొక్కులు చెల్లించుకునేందుకు భక్తులు బారులు తీరారు. త్రివేణీ సంగమ తీరంలో ఉన్న కాళేశ్వర క్షేత్రంలో మహా శివరాత్రి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. తెలంగాణతో పాటు పొరుగు రాష్ట్రాల నుండి లక్షలాది భక్తులు తరలివస్తుంటారు. ఇక్కడ గోదావరిలో తెప్పోత్సవం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అలాగే కొమురవెల్లి మల్లన్న, అయినవోలు మల్లన్న ఆలయాలు, చరిత్ర ప్రసిద్ది గాంచిన రుద్రేశ్వరస్వామి వేయి స్తంభాల దేవాలయంలో మహాశివరాత్రి కళ్యాణ బ్రహ్మెత్సవాలు ఆగమానుసారంగా ప్రారంభమయ్యాయి.

దేవాదాయ శాఖ ప్రత్యేక ఏర్పాట్లు:

భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దేవాదాయ శాఖ మంత్రి, ఉన్నతాధికారులు ముందస్తుగా భారీ ఏర్పాట్లు చేశారు. సామాన్య భక్తులకు త్వరితగతిన దర్శనం కల్పించేలా ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేశారు. క్యూలైన్లలో వేచి ఉండే భక్తులకు తాగునీరు, పాలు, మజ్జిగ పంపిణీ చేశారు. ఆర్టీసీ ఆధ్వర్యంలో శివాలయాలకు వేలాది ప్రత్యేక బస్సులను నడుపుతున్నారు. భక్తులకు తోపులాటలు జరగకుండా పోలీస్ శాఖ భారీ బందోబస్తును ఏర్పాటు చేసింది. సీసీ కెమెరాల ద్వారా పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.

ఉపవాసాలు - జాగరణలు

శివరాత్రి సందర్భంగా భక్తులు రోజంతా ఉపవాసం ఉండి, రాత్రి వేళల్లో లింగోద్భవ కాల పూజల్లో పాల్గొననున్నారు. ఆలయాల్లో సాంస్కృతిక కార్యక్రమాలు, భజనలు, శివలీలల ప్రదర్శనలతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. అంతటా భక్తి పారవశ్యం వెల్లివిరుస్తోంది.

Next Story