'మేడ్ ఇన్ ఇండియా' ఉత్పత్తులకు ఇక మహర్దశ.. ఆర్థిక మంత్రి ఆసక్తికరమైన ట్వీట్

by Malleboina Mahesh |   (  Updated:2026-02-03 06:39:03  IST  )

భారత్ పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సుంకాలు తగ్గిస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయంపై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. 'మేడ్ ఇన్ ఇండియా' ఉత్పత్తులకు ఇక మహర్దశ అంటూ ఆసక్తికరమైన పోస్ట్ పెట్టారు.

మేడ్ ఇన్ ఇండియా ఉత్పత్తులకు ఇక మహర్దశ.. ఆర్థిక మంత్రి ఆసక్తికరమైన ట్వీట్
X

దిశ, వెబ్ డెస్క్: భారత్ పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సుంకాలు తగ్గిస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయంపై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. 'మేడ్ ఇన్ ఇండియా' ఉత్పత్తులకు ఇక మహర్దశ అంటూ ఆసక్తికరమైన పోస్ట్ పెట్టారు. అందులో " భారతదేశ తయారీ రంగానికి, ఎగుమతిదారులకు ఇది ఒక చారిత్రాత్మకమైన రోజు అని తెలిపారు. "మేడ్ ఇన్ ఇండియా" (Made In India) ఉత్పత్తులపై అమెరికా విధిస్తున్న దిగుమతి సుంకాలను 18 శాతానికి తగ్గిస్తూ తీసుకున్న నిర్ణయం పై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ హర్షం వ్యక్తం చేశారు. సోమవారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, భారత ప్రధాని నరేంద్ర మోదీ మధ్య జరిగిన విజయవంతమైన చర్చల ఫలితంగా ఈ కీలక పరిణామం చోటుచేసుకుంది.

ఆర్థిక మంత్రి ప్రశంసలు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, భారత ప్రధాని నరేంద్ర మోడీ మధ్య జరిగిన చర్చలు సఫలం కావడం, సుంకాలు తగ్గిస్తున్నట్లు అమెరికా ప్రకటించిన పరిణామంపై ఆర్థిక మంత్రి స్పందిస్తూ.. ఇది భారతీయ ఉత్పత్తులకు ప్రపంచ మార్కెట్‌లో గొప్ప అవకాశాలను కల్పిస్తుందని పేర్కొన్నారు. ప్రధాని మోడీ, ప్రెసిడెంట్ ట్రంప్‌ల సమర్థవంతమైన నాయకత్వం వల్లే ఈ అసాధ్యమైన ఒప్పందం సాధ్యమైందని ఆమె కొనియాడారు. ఈ నిర్ణయం ద్వారా ప్రపంచంలోని రెండు అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాల ప్రజలకు ఆర్థికంగా ఎంతో మేలు జరుగుతుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.

భారత ఎగుమతులకు ప్రయోజనాలు

ప్రస్తుతం అమెరికా విధిస్తున్న సుంకాలు 25 శాతం నుంచి 18 శాతానికి తగ్గడం వల్ల భారతదేశం నుంచి ఎగుమతి అయ్యే వస్త్రాలు, ఇంజనీరింగ్ వస్తువులు, ఐటీ పరికరాలు, ఇతర కీలక ఉత్పత్తుల ధరలు అమెరికా మార్కెట్‌లో తగ్గుతాయి. దీనివల్ల పొరుగు దేశాలైన చైనా (34%), బంగ్లాదేశ్ (20%), పాకిస్థాన్ (19%) లతో పోలిస్తే భారతీయ వస్తువులకు మార్కెట్‌లో అధిక పోటీతత్వం లభిస్తుంది.

ద్వైపాక్షిక సంబంధాల్లో మైలురాయి

కేవలం వాణిజ్య పరంగానే కాకుండా, వ్యూహాత్మకంగా కూడా ఈ ఒప్పందం అత్యంత ప్రాముఖ్యత సంతరించుకుంది. రష్యా నుండి చమురు కొనుగోళ్ల నిలిపివేత, అమెరికా నుంచి ఇంధన దిగుమతుల పెంపు వంటి అంశాలతో ముడిపడి ఉన్న ఈ డీల్, భవిష్యత్తులో భారత్-అమెరికా బంధాన్ని మరింత బలోపేతం చేస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ సుంకాల తగ్గింపు తక్షణమే అమల్లోకి రానుండటంతో భారతీయ వాణిజ్య వర్గాల్లో పండుగ వాతావరణం నెలకొంది.

జీడీపీ లెక్కలు.. పేదరికాన్ని దాచిపెట్టలేవు!

Next Story