జీడీపీ లెక్కలు.. పేదరికాన్ని దాచిపెట్టలేవు!

by Ravi |   (  Updated:2026-02-03 06:41:56  IST  )

భారతదేశం 2007లో జీడీపీ రీత్యా ఒక ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ. 2014 నాటికి రెండు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చెంది నేడు నాలుగు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ప్రపంచంలోనే నాలుగవ స్థానంలో ఉంది.

జీడీపీ లెక్కలు.. పేదరికాన్ని దాచిపెట్టలేవు!
X

భారతదేశం 2007లో జీడీపీ రీత్యా ఒక ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ. 2014 నాటికి రెండు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చెంది నేడు నాలుగు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ప్రపంచంలోనే నాలుగవ స్థానంలో ఉంది. 1961లో కేవలం 90 డాలర్లుగా ఉన్న మన తలసరి ఆదాయం 2007 నాటికి 910 డాలర్లకు చేరుకుంది. ప్రస్తుతం మూడు వేల డాలర్ల వద్ద ఉంది.

ఒక దేశం మొత్తం ఆదాయాన్ని ఆ దేశ జనాభాతో భాగించగా వచ్చే సగటునే తలసరి ఆదాయం అంటారు. అమెరికాలో తలసరి ఆదాయం సుమారు 90,000 డాలర్లు జర్మనీలో 80,000 డాలర్లు చైనాలో 14 వేల డాలర్లు ఉండగా భారతదేశంలో ప్రస్తుతం మూడువేల డాలర్ల వద్ద ఉంది. ఇది 190 దేశాలలో 136 స్థానంలో ఉంది. ఆయు ప్రమాణం రీత్య 125వ స్థానంలో ఉంది. ఆదాయ అసమానతల రీత్యా 146వ దేశంగా ఉంది. పౌష్టిక ఆహార రీత్యా 113 దేశాలలో 68వ దేశం మనది.

ప్రైవేటీకరణ కారణంగా..

నూతన ఆర్థిక విధానాలు చేపట్టిన తర్వాత ప్రపంచీకరణ పుణ్యమా అని, పేదలకూ సంపన్నులకూ మధ్య పూడ్చలేనంత వ్యత్యాసం ఏర్పడింది. ఆర్థిక సంస్కరణల వల్ల సృష్టించబడే సంపద అట్టడుగున ఉన్న పేదల వరకూ చేరుతుందనీ, దానిని ‘ట్రికిల్‌ డౌన్‌ ఎఫెక్ట్‌’ అంటారనీ అప్పట్లో కొందరు ఆర్థికవేత్తలు, పాలకులు పేర్కొన్నారు. అయితే, సంస్కరణల పేరుతో సాగిన ప్రైవేటీకరణ కారణంగా సృష్టించబడిన సంపదలో సింహభాగం పై స్థాయి ఉన్నత ఆదాయ వర్గాల వారికి చేరింది. పెరిగిన జీడీపీలో నామమాత్రపు భాగం మాత్రమే కింది వర్గాలకు చేరుకుంది.

రాచరికంలో కంటే ఎక్కువగా అసమానతలు..

దేశ తలసరి ఆదాయం ప్రస్తుతం 3000 డాలర్లు ఉండగా ఉన్నత ఆదాయ వర్గాల పై భాగంలో ఉన్న పది శాతం ధనికుల తలసరి ఆదాయం 14 వేల మిలియన్ డాలర్లుగా ఉంది ఫలితంగా, ఆర్థిక అసమానతలు అంతకుముందెన్నడూ లేనంతగా దేశంలో పెరిగిపోయి, నేడు దేశంలో 10 శాతం ప్రజల వద్ద 77 శాతం దేశ సంపద పోగు పడింది. కింది స్థాయిలో ఉన్న 50 శాతం మంది ప్రజల వద్ద నామమాత్రంగా 4.1శాతం సంపద మాత్రమే ఉంది. ఆక్స్‌ఫామ్‌ నివేదిక ప్రకారం 2022–23 ఆర్థిక సంవత్సరంలో 22.3శాతం జాతీయాదాయాన్ని 1 శాతం మంది ఎగరేసుకుపోయారు. ఇది ఒకప్పటి రాచరిక వ్యవస్థలో అసమానతల కంటే ఎక్కువ.

3 దశాబ్దాల్లో 350 మంది బిలియనీర్లు..

ప్రముఖ అమెరికన్‌ పత్రిక ‘ఫోర్బ్స్ ’ కథనం ప్రకారం, 1991లో భారతదేశంలో ఒకే ఒక్క బిలియనీర్‌ ఉన్నాడు. 3 దశాబ్దాల కాలంలో అమలైన సంస్కరణల ఫలితంగా, బిలియనీర్‌ల సంఖ్య నేడు దేశంలో 350కు చేరుకున్నారు.. ఈ 350 మంది నయా కుబేరుల సంపద జాతీయాదాయం పెరుగుదలలో 25 శాతంగా ఉంది! ఆర్థిక సంస్కరణల ప్రయోజనాల్ని కొందరు పారిశ్రామికవేత్తలు పొందుతున్న తీరు, అందుకు కొందరు పాలకులు సహకరిస్తున్న విధానం, వారికి లబ్ధి చేకూరేలా తీసుకుంటున్న పాలసీల కారణంగా సంపన్నులు మరింత సంపన్నులు అవుతున్నారు. ముఖ్యంగా, కార్పొరేట్లకు పన్ను విధానాలను అవలంబించడం వల్ల జాతీయాదాయానికి భారీగా నష్టమవుతున్నది. ఫలితంగా ఆర్థిక అసమానతలు భారీగా పెరిగాయి.

పదేళ్లలో 26 వేలమంది సంపన్నుల వలస..

అయినప్పటికీ 2014 నుంచి 2024 వరకు 23,000 మంది సంపన్నులు మన దేశం నుండి వలస పోయారు. ఒక 2025 సంవత్సరంలోనే 3500 మంది వేరే దేశాలలో పెట్టుబడులు పెట్టేందుకు అక్కడ వీరికి రాయితీలు సదుపాయాలు ఎక్కువగా ఉంటాయని ఇక్కడ సంపాదించుకున్న ధనాన్నంతా తీసుకుని వేరే దేశాలకు వెళ్లిపోయారు. ఫలితంగా, సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల అమలుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్పులు చేయాల్సిన దుర్గతి పట్టింది. స్థూల జాతీయ ఉత్పత్తిలో ప్రభుత్వ అప్పుల శాతం 80 శాతానికి పైబడింది. సహజ వనరుల్ని కొద్దిమందికి ధారాదత్తం చేయకుండా ఉంటే, ప్రభుత్వాల ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. అప్పుడు ప్రజలు ఉచితాలతో బతికే అవసరం ఉండదు.

జీడీపీ లెక్కలతో మురిసిపోతే అంతేగతి..!

భారత్‌ ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా రూపుదిద్దుకుంటున్నదని వేసుకొంటున్న లెక్కలు నిజమే కావచ్చు. ఆర్థిక వ్యవస్థలోని అసమానతల్ని తగ్గించకుండా, కేవలం జీడీపీ లెక్కలతో మురిసిపోతే ప్రయోజనం ఏమిటి? ఆకలి చావుల సూచికల్లో ప్రపంచ దేశాలలో మన దేశం 123 దేశాలలో 102వ స్థానంలో ఉంది. సబ్‌ సహారా దేశాల కంటే దిగజారిన స్థాయిలో ఉండటం నిజం కాదా? 2024లో ఐక్యరాజ్య సమితి రూపొందించిన నివేదిక ప్రకారం ప్రపంచ జనాభా 700 కోట్లు అందులో పేదలు 110 కోట్లు ఇందులో యువత యాభై శాతం భారతదేశంలో 23.4 కోట్లమంది ఈ బహుముఖ పేదరికంలో ఉన్నారని ఆ నివేదిక తెలియజేసింది.

3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ.. పెద్ద భ్రమ

ఆర్థిక అసమానతలు లేకుండా ప్రపంచంలోని ఏ దేశమూ ఉండదన్న మాట నిజమే. అగ్రరాజ్యాలుగా చెప్పుకుంటున్న అమెరికా, ఫ్రాన్స్‌, జపాన్‌, జర్మనీ వంటి దేశాల్లో కూడా ఆర్థిక అసమానతలు ఉన్నాయి. కానీ, ఆ దేశాల్లో సామాన్య ప్రజలకు అందుబాటులో మెరుగైన ప్రభుత్వ విద్య, వైద్యం ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో అందరూ పనిచేయడానికి ఉపాధి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. మన దేశ ఆర్థిక వ్యవస్థలో అంతర్గతంగా ఇమిడి ఉన్న పలు బలహీనతలను సవరించకుండా, పెరుగుతున్న స్థూల జాతీయాభివృద్ధి ఫలాలు అందరికీ చెందేలా చర్యలు తీసుకోకుండా, భారత్‌ మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తోందని చాటుకోవడం ఆత్మవంచనే అవుతుంది. ఇది ప్రజా శ్రేయస్సు మాత్రం కాదు.

ఉచితాల ఆర్థిక వ్యవస్థ..

ఒక మాటలో చెప్పాలంటే మనది ఉచితాల ఆర్థిక వ్యవస్థ. అప్పుల ఊబిలో ఉన్న ఆర్థిక వ్యవస్థ. విపరీతమైన ఆర్థిక అసమానతలు ఉండటమే దేశంలో ప్రధానమైన సమస్య. దీనిని నివారించకుండా ప్రజా శ్రేయస్సును పెంపొందించలేం. ఇది పాలకుల వైఫల్యమే.

-డాక్టర్ ఎ. నాగరాజ నాయుడు,

రిటైర్డ్ ప్రిన్సిపాల్,

9866322172

'మేడ్ ఇన్ ఇండియా' ఉత్పత్తులకు ఇక మహర్దశ.. ఆర్థిక మంత్రి ఆసక్తికరమైన ట్వీట్

Next Story