- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
LPG కొరత.. 2 రోజుల్లో రూ. 20 కోట్ల నష్టం
LPG కొరతతో హైదరాబాద్ లోని రెస్టారెంట్స్ భారీ నష్టాలు చవిచూస్తునాయి.

దిశ, వెబ్ డెస్క్ : మిడిల్ ఈస్ట్ దేశాల్లో యుద్ధ జ్వాలలు (Operation Epic Fury) హైదరాబాద్ నగర ఆర్థిక వ్యవస్థను, ముఖ్యంగా హోటల్, రెస్టారెంట్ రంగాన్ని కోలుకోలేని దెబ్బ తీస్తున్నాయి. గల్ఫ్ దేశాల నుండి ఇంధన దిగుమతులు నిలిచిపోవడంతో ఏర్పడిన వాణిజ్య ఎల్‌పీజీ (Commercial LPG) కొరత కారణంగా, గత రెండు రోజుల్లోనే హైదరాబాద్‌లో సుమారు రూ.20 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు అంచనాలు వెలువడుతున్నాయి. ఈ సంక్షోభం కేవలం ఆర్థిక నష్టానికే పరిమితం కాకుండా, నగరంలోని వేలాది మంది ఉపాధిని, ప్రజల ఆహారపు అలవాట్లను కూడా అతలాకుతలం చేస్తోంది.
కుప్పకూలుతున్న హోటల్ రంగం
హైదరాబాద్‌లో దాదాపు 74,000 పైగా హోటళ్లు, రెస్టారెంట్లు ఉన్నాయి. వీటి వార్షిక టర్నోవర్ సుమారు రూ.5 లక్షల కోట్లు ఉంటుందని అంచనా. అయితే ప్రస్తుతం మార్కెట్‌లో కమర్షియల్ సిలిండర్ల సరఫరా 75% వరకు పడిపోయింది. సాధారణంగా 100 సిలిండర్లు అవసరమయ్యే చోట కేవలం 20 నుండి 25 మాత్రమే అందుబాటులోకి వస్తున్నాయి. ఈ కొరత కారణంగా నగరంలోని చిన్న, మధ్యతరహా హోటళ్లు ఇప్పటికే మూతపడుతున్నాయి. మెనూలో గ్యాస్ ఎక్కువగా వినియోగించే దోశ, పూరీ, వడ వంటి పదార్థాలను చాలా చోట్ల నిలిపివేశారు.
రూ.1,300 కోట్ల నష్టం
హైదరాబాద్‌లో రెండు రోజుల్లో రూ.20 కోట్ల నష్టం వాటిల్లి ఉండవచ్చని నిపుణులు చెబుతున్నారు. నేషనల్ రెస్టారెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(NRAI) నివేదికల ప్రకారం.. దేశవ్యాప్తంగా ఈ ఇంధన సంక్షోభం వల్ల రెస్టారెంట్ పరిశ్రమకు రోజుకు రూ.1,200 నుండి రూ.1,300 కోట్ల మేర నష్టం వాటిల్లుతోంది. ముంబైలో ఇప్పటికే 20% హోటళ్లు మూతపడగా, బెంగళూరు, పూణే వంటి నగరాల్లో కూడా రాబోయే 2-3 రోజుల్లో 50-60% హోటళ్లు బంద్ అయ్యే ప్రమాదం ఉంది.
హలీంకు కష్టాలు!
గ్యాస్ కొరతను అధిగమించేందుకు పెద్ద రెస్టారెంట్లు ఇండక్షన్ కుకింగ్, మైక్రోవేవ్ ఓవెన్ల వైపు మళ్లుతున్నప్పటికీ, చిన్నపాటి హోటళ్లకు రోడ్డు పక్కన ఉండే టిఫిన్ సెంటర్లకు ఇది ఆర్థికంగా భారం అవుతోంది. ప్రస్తుతం రంజాన్ మాసం కావడంతో, హైదరాబాద్‌కు ప్రత్యేకమైన హలీమ్ తయారీ, ఇతర పండుగ వంటకాలపై కూడా ఈ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. గ్యాస్ కొరత వల్ల హలీమ్ అవుట్‌లెట్ల నిర్వహణ కష్టతరంగా మారుతోంది.
ఆకాశాన్ని తాకనున్న ధరలు!
కేంద్ర ప్రభుత్వం Essential Commodities Act కింద గృహ అవసరాల ఎల్‌పీజీ (Domestic LPG)కి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించింది. దీనివల్ల కమర్షియల్ రంగం పూర్తిగా విస్మరించబడింది. ఇరాన్-అమెరికా యుద్ధం ముగిసి, సరఫరా మార్గాలు పునరుద్ధరించబడే వరకు వాణిజ్య సిలిండర్ల ధరలు పెరగడమే కాకుండా, కొరత కూడా కొనసాగే అవకాశం ఉంది. అటు సీఎన్‌జీ (CNG) కొరతతో ఆటోలు, ఇటు ఎల్‌పీజీ కొరతతో హోటళ్లు ఇబ్బంది పడుతుండటంతో హైదరాబాద్ నగర జీవనం స్తంభించిపోతోంది. మరోవైపు గ్యాస్ కొరత వల్ల ఆహార పదార్థాల ధరలు పెరిగే అవకాశం ఉంది. ప్రభుత్వం రిఫైనరీల ఉత్పత్తిని పెంచుతున్నప్పటికీ, అది ప్రస్తుత డిమాండ్‌ను అందుకోవడానికి సరిపోవడం లేదు.






