లోలెవల్ వంతెనలు.. తీరని కష్టాలు

by Ratna Kumari |

లోలెవల్ వంతెనలతో జుక్కల్ నియోజకవర్గంలోని పలు గ్రామాల ప్రజలు ఏళ్ల తరబడి నరకయాతన అనుభవిస్తున్నారు.

లోలెవల్ వంతెనలు.. తీరని కష్టాలు
X

దిశ, మద్నూర్ : లోలెవల్ వంతెనలతో జుక్కల్ నియోజకవర్గంలోని పలు గ్రామాల ప్రజలు ఏళ్ల తరబడి నరకయాతన అనుభవిస్తున్నారు. జుక్కల్ - పేద్ద పెద్ద ఏడ్గి, తాడ్గుర్ ప్రధాన రహదారిపై ఉమ్మడి మద్నూర్ మండలంలోని అంతాపూర్, గోజేగావు, కుర్లా, ఎంబుర, ఇలేగావు,టాక్లి, సిర్పూర్, బిచ్కుంద మండలంలోని మిషన్ కల్లాలి, గుండె కల్లూర్, నిజంసాగర్ మండలం నాగమడుగు అచ్చంపేట గ్రామాల వద్ద ఉన్న లోలెవల్ వంతెనలు వానాకాలం వచ్చిందంటే చాలు ప్రజలకు శాపంగా మారుతున్నాయి. ఒక్క భారీ వర్షం కురిస్తే చాలు ఈ వంతెనలు నీట మునిగి రాకపోకలు పూర్తిగా స్తంభిస్తున్నాయి. అత్యవసర సమయాల్లో ఆసుపత్రులకు వెళ్లాలన్నా, నిత్యావసర సరుకులు తెచ్చుకోవాలన్నా ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. అంబులెన్స్‌లు సైతం గ్రామాల్లోకి రాలేని దుస్థితి నెలకొంటోంది.

గతేడాది చేదు అనుభవం..

గత సంవత్సరం కురిసిన భారీ వర్షాలతో డోంగ్లి మండలంలోని చిన్న టాక్లి, పెద్ద టాక్లి, సిర్పూర్, మాదన్ హిప్పర్గా, ఇలేగావ్ గ్రామాలు పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. వాగులు ఉప్పొంగి లోలెవల్ వంతెనలు మునిగిపోవడంతో ఆయా గ్రామాల ప్రజలను అధికారులు పునరావాస కేంద్రాలకు తరలించాల్సి వచ్చింది. రోజుల తరబడి బయటి ప్రపంచంతో సంబంధాలు తెగిపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పంటలు నీట మునిగి రైతులు నష్టపోయారు.

ఈ ఏడాది భయం భయంగా..

వానాకాలం సమీపిస్తుండటంతో ఈ ప్రాంత ప్రజలు మళ్లీ భయం భయంగా బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. గతేడాది పడ్డ కష్టాలు మళ్లీ పడాల్సి వస్తుందేమోనని భయంగా ఉంది. ఈసారి ఏ విధంగా ఉంటుందోనని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏళ్లుగా ఈ సమస్యను పరిష్కరించాలని ప్రజలు విన్నవిస్తున్నా ఫలితం లేకుండా పోయింది. లోలెవల్ వంతెనల స్థానంలో హైలెవల్ వంతెనలు నిర్మించాలని ప్రజలు కోరుతున్నారు. లేకుంటే ప్రతి వానాకాలం తమ బతుకులు అగమ్యగోచరమేనని వాపోతున్నారు.

Next Story