ఓరుగల్లు పై కమలం గురి.. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలే టార్గెట్!

by Jakkula.Mamatha |

బీజేపీ ఉమ్మడి జిల్లా సమావేశం విజయవంతమైంది.

ఓరుగల్లు పై కమలం గురి.. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలే టార్గెట్!
X

దిశ, వరంగల్ బ్యూరో: బీజేపీ ఉమ్మడి జిల్లా సమావేశం విజయవంతమైంది. నేతలంతా తరలిరావడంతో పాటు బూత్ అధ్యక్షుల సమావేశంలో జాతీయ అధ్యక్షులు హాజరై దిశానిర్దేశం చేశారు. వరంగల్ మున్సిపల్ ఎన్నికలతో పాటు వచ్చే రెండేళ్లలో మరింత బలోపేతమై అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో కీలక స్థానాలు గెలుచుకునేందుకు క్యాడర్ కు దిశానిర్దేశం చేశారు. బూత్ స్థాయి నుంచే ఇంటింటికీ తిరగడంతో పాటు కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల వద్దకు తీసుకెళ్లి మద్దతును కూడగట్టాలని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ పిలుపునిచ్చారు. ప్రతీ కార్యకర్త కృషి చేస్తే సాధ్యం కానిది లేదన్నారు. వరంగల్ కు చరిత్ర ఉందని, పార్టీ పెట్టిన తర్వాత గెలిచిన రెండు సీట్లలో ఒకటి ఇక్కడి నుంచే గెలుపొందామని ఆయన క్యాడర్ కు వివరించారు. నలబై ఏళ్లలో పార్టీ ఎంతో పెరిగిందని యువత తలుచుకుంటే సాధ్యం కానిది లేదన్నారు. యువతతో పాటు మహిళలు, నేతలంతా సమష్టిగా కలిసి కృషి చేసి వరంగల్ కు పూర్వ వైభవం తీసుకు రావాలని పిలుపునిచ్చారు. వచ్చే గ్రేటర్ వరంగల్ మున్సిపల్ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికల పై దృష్టి పెట్టి పనిచేయాలన్నారు. కార్యకర్తలు, నేతలు సమన్వయంతో పని చేస్తే విజయం సాధిస్తామన్నారు.

భారీగా తరలివచ్చిన శ్రేణులు..

నితిన్ నబీన్ సభకు భారీగా శ్రేణులు తరలిరావడంతో బీజేపీ నేతల్లో జోష్ పెరిగింది. ఉమ్మడి జిల్లా నుంచి నేతలంతా హాజరుకావడం, సమన్వయంతో కార్యక్రమం నిర్వహించడంతో విజయవంతమైంది. జాతీయ అధ్యక్షుడితో పాటు కేంద్ర మంత్రులు, కీలక నేతలు జిల్లాకు రావడంతో ముందస్తుగానే ఏర్పాట్లను చేశారు. హరిత హోటల్ లో గిరిజన నేతల సమావేశానికి రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి నేతలు తరలివచ్చారు. గిరిజన నేతలతో ఆయన సపరేట్ గా భేటీ కావడం, వారికి కేంద్రం అమలు చేస్తున్న పథకాలను వివరించడంతో వారిలో నమ్మకం పెరిగింది. తదనంతరం బూత్ స్థాయి సమావేశంలో పాల్గొని వారికి దిశానిర్దేశం చేశారు. త్వరలోనే రాష్ట్రానికి ప్రధాని మోదీ రావడంతో పాటు పలు పథకాలను, ప్రాజెక్టులను ప్రారంభిస్తారని ప్రకటించారు. కేంద్రం అమలు చేస్తున్న పథకాలను వివరించడంతో నేతల్లో జోష్ కనిపించింది. వరంగల్ నగరం టార్గెట్ గా ముందుకు పోయేందుకు నేతలు సిద్ధమవుతున్నారు.

Next Story