- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దర్భంగా విమానాశ్రయంలో తప్పిన ముప్పు.. ల్యాండింగ్ వేళ స్పైస్‌జెట్ విమానం టైరు బరస్ట్!
బీహార్‌లోని దర్భంగా విమానాశ్రయంలో సోమవారం ఓ భారీ విమాన ప్రమాదం తృటిలో తప్పింది. ముంబయి నుంచి వచ్చిన స్పైస్‌జెట్ విమానం రన్‌వేపై ల్యాండ్ అవుతున్న సమయంలో ఒక్కసారిగా టైరు పేలిపోయింది.

దిశ, డైనమిక్ బ్యూరో: బీహార్‌లోని దర్భంగా విమానాశ్రయంలో సోమవారం ఓ భారీ విమాన ప్రమాదం తృటిలో తప్పింది. ముంబయి నుంచి వచ్చిన స్పైస్‌జెట్ విమానం రన్‌వేపై ల్యాండ్ అవుతున్న సమయంలో ఒక్కసారిగా టైరు పేలిపోయింది. పైలట్ చాకచక్యంగా వ్యవహరించి విమానాన్ని సురక్షితంగా నిలిపివేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఘటన జరిగిన సమయంలో విమానంలో ఉన్న 150 మంది ప్రయాణికులు, సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారు. ఇందుకు సంబంధించిన ఘటన మంగళవారం వెలుగులోకి వచ్చింది.
ప్రయాణికుల్లో తీవ్ర ఆందోళన..
జాతీయ మీడియా సమాచారం ప్రకారం.. సోమవారం ఉదయం పది గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. రన్‌వేపై టచ్‌డౌన్ అయిన వెంటనే టైరు పేలడంతో చక్రం కొంతదూరం రన్‌వేపై ఈడ్చుకుపోయింది. దీంతో విమానంలో తీవ్రమైన కుదుపులు రావడంతో ప్రయాణికులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. ఎయిర్‌పోర్ట్ భద్రతా సిబ్బంది, గ్రౌండ్ స్టాఫ్ తక్షణమే స్పందించి ప్రయాణికులను సురక్షితంగా కిందకు దించేశారు.
స్తంభించిన విమాన సర్వీసులు..
ఈ ఘటన కారణంగా దర్భంగా ఎయిర్‌పోర్టులో విమాన రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. దెబ్బతిన్న స్పైస్‌జెట్ విమానం సాయంత్రం 6:30 గంటల వరకు పార్కింగ్ స్థలం (ఏప్రాన్) లోనే ఉండిపోవడంతో స్థల కొరత ఏర్పడింది. దీనివల్ల ఢిల్లీ నుంచి రావాల్సిన ఇండిగో విమానాన్ని అధికారులు పాట్నాకు మళ్లించారు. ఆ తర్వాత పరిస్థితి సాధారణ స్థితికి రావడంతో ఆ విమానం తిరిగి దర్భంగా చేరుకుని ఢిల్లీకి ప్రయాణమైంది.
ఆకాశ ఎయిర్‌లో సాంకేతిక లోపం
అదే సమయంలో ముంబయి నుంచి వచ్చిన ‘ఆకాశ ఎయిర్’ విమానంలోనూ సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో రెండు విమానాలు ఏప్రాన్‌ను ఆక్రమించడంతో విమానాశ్రయ కార్యకలాపాలు మరింత నెమ్మదించాయి. సాంకేతిక నిపుణులు ప్రస్తుతం రెండు విమానాలను పరిశీలిస్తున్నారు. పూర్తి ఫిట్‌నెస్ సర్టిఫికేట్ వచ్చాకే వీటికి అనుమతి ఇవ్వనున్నారు. ఈ ప్రభావం మంగళవారం సర్వీసులపై కూడా పడే అవకాశం ఉన్నందున, ప్రయాణికులు తమ విమాన సమయాలను ముందే సరిచూసుకోవాలని అధికారులు సూచించారు.






