ఏపీకి రెండు ఆడ పులులు వచ్చేస్తున్నాయ్! మహారాష్ట్ర సీఎం ఫ‌డ్నవీస్‌తో పవన్ కల్యాణ్ భేటీ

by Ramesh Naini |

మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫ‌డ్నవీస్‌తో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మంగళవారం మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు.

ఏపీకి రెండు ఆడ పులులు వచ్చేస్తున్నాయ్! మహారాష్ట్ర సీఎం ఫ‌డ్నవీస్‌తో పవన్ కల్యాణ్ భేటీ
X

దిశ, డైనమిక్ బ్యూరో: మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫ‌డ్నవీస్‌తో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మంగళవారం మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. ముంబైలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో ప్రధానంగా తూర్పు కనుమల్లో పులుల సంరక్షణ, ఇరు రాష్ట్రాల పరస్పర ప్రయోజనాలపై ఫలవంతమైన చర్చలు జరిగాయి.

ఏపీకి రెండు ఆడ పులులు

ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు కనుమల్లో ఆడ పులుల సంఖ్య తగ్గిపోవడంతో అంతరసంతానోత్పత్తి (Inbreeding) వంటి జన్యుపరమైన సమస్యలు తలెత్తుతున్నాయి. వీటిని అధిగమించేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం ఏపీకి రెండు ఆడ పులులను ఇచ్చేందుకు అంగీకరించింది. పులుల పునరుద్ధరణకు పెద్దమనసుతో సహకరిస్తున్న మహారాష్ట్ర ప్రభుత్వానికి, సీఎం ఫడ్నవీస్‌కు పవన్ కల్యాణ్ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ నిర్ణయం వల్ల జన్యు వైవిధ్యం పెరిగి, తూర్పు కనుమల్లో స్వయం సమృద్ధి కలిగిన పులుల ఆవాస వ్యవస్థ ఏర్పడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. వన్యప్రాణి సంరక్షణలో నిరంతరం మార్గదర్శకత్వం వహిస్తున్న కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్‌కు ఈ సందర్భంగా పవన్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. శాస్త్రీయ విధానాలతో జీవ వైవిధ్య పరిరక్షణకు ఇరు రాష్ట్రాలు కట్టుబడి ఉన్నాయని, భవిష్యత్తులోనూ కేంద్రం, మహారాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి మరింత సమన్వయంతో ముందుకు వెళ్తామని పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

Next Story