మక్తల్‌లో రూ.25 కోట్లతో అత్యాధునిక స్టేడియం: మంత్రి వాకిటి శ్రీహరి

by Jakkula.Mamatha |   (  Updated:2026-06-30 07:18:21  IST  )

నియోజకవర్గ కేంద్రంలో రూ.25 కోట్లతో నూతనంగా నిర్మించబోయే క్రీడా స్టేడియం స్థలాన్ని మంగళవారం ఉదయం మంత్రి వాకిటి శ్రీహరి అధికారులతో కలిసి పరిశీలించారు.

మక్తల్‌లో రూ.25 కోట్లతో అత్యాధునిక స్టేడియం: మంత్రి వాకిటి శ్రీహరి
X

దిశ, మక్తల్: నియోజకవర్గ కేంద్రంలో రూ.25 కోట్లతో నూతనంగా నిర్మించబోయే క్రీడా స్టేడియం స్థలాన్ని మంగళవారం ఉదయం మంత్రి వాకిటి శ్రీహరి అధికారులతో కలిసి పరిశీలించారు. అనంతరం స్టేడియం నమూనా, వసతులపై సమీక్ష నిర్వహించారు. ఇండోర్, అవుట్‌డోర్ స్టేడియంల నిర్మాణానికి సంబంధించి చేయాల్సిన పలు మార్పుచేర్పులను జిల్లా స్పోర్ట్స్ అధికారి వెంకటేష్, ఇంజినీర్ ఉపేందర్‌లతో కలిసి మంత్రి చర్చించారు. ఇటీవల మక్తల్‌లో రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలను విజయవంతంగా నిర్వహించామని ఈ సందర్భంగా మంత్రి గుర్తుచేశారు. మంత్రి మాట్లాడుతూ.. అంతర్జాతీయ ప్రమాణాలతో, ఇండోర్ క్రీడలు ఆడుకునేందుకు వీలుగా అన్ని వసతులతో ఈ స్టేడియాన్ని నిర్మించాలి. మహిళా, పురుష క్రీడాకారులకు విడివిడిగా ఆధునిక డ్రెస్సింగ్ రూమ్‌లు, వెయిటింగ్ హాల్స్, విశ్రాంతి గదులు మరియు టాయిలెట్లు ఏర్పాటు చేయాలి అన్నారు.

ప్రస్తుత ప్రభుత్వ ఇంటర్మీడియట్ కాలేజీ భవనం శిథిలావస్థకు చేరిందని, పైకప్పు పెచ్చులు ఊడిపడి విద్యార్థులకు గాయాలవుతున్నాయనే విషయం మంత్రి దృష్టికి రావడంతో తక్షణమే స్పందించారు. విద్యార్థుల భద్రత దృష్ట్యా, తక్షణమే తరగతులను వేరే ప్రైవేట్ భవనాల్లోకి మార్చి విద్యాబోధన కొనసాగించాలని అధికారులను ఆదేశించారు. మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డుల్లో జరుగుతున్న సీసీ రోడ్లు, డ్రైనేజీ పనుల్లో నాణ్యత లోపాలు ఉంటే సహించేది లేదని మంత్రి హెచ్చరించారు. నిబంధనలు పాటించని కాంట్రాక్టర్లపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు, వారి లైసెన్సులను బ్లాక్ లిస్ట్‌లో పెడతామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మక్తల్ పట్టణ, మండల అధ్యక్షులు రవి కుమార్, గణేష్, స్థానిక కాంగ్రెస్ నాయకులు కట్ట సురేష్, హన్మంతు, జిల్లా స్పోర్ట్స్ అధికారి వెంకటేష్, ఇంజినీర్ ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.

Next Story