కేతన్ అగర్వాల్ హత్య కేసులో ట్విస్ట్.. సియా గోయెల్ సోదరుడికి ఊహించని షాక్

by Prasad Jukanti |   (  Updated:2026-06-30 08:47:09  IST  )

కేతన్ అగర్వాల్ హత్య కేసు నిందితురాలు సియా గోయల్ సోదరుడిపై న్యాయవాది అశుతోశ్ శ్రీవాస్తవ రూ. 10 కోట్ల పరువు నష్టం దావా వేశారు.

కేతన్ అగర్వాల్ హత్య కేసులో ట్విస్ట్.. సియా గోయెల్ సోదరుడికి ఊహించని షాక్
X

దిశ, డైనమిక్ బ్యూరో: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పుణే యువ వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ హత్య కేసులో కొత్త వివాదం చర్చనీయాంశంగా మారింది. కాబోయే భర్త కేతన్ అగర్వాల్‍ను లోహ్‍గఢ్ కోట కొండపై నుంచి తోసి హత్య చేసిన సియా గోయల్ తరఫున వాదించబోయే లాయర్ ఎవరు అనే విషయంలో ఇద్దరు న్యాయవాదుల మధ్య లీగల్ వార్ మొదలైంది. ఈ క్రమంలో సియా గోయల్ సోదరుడిపై న్యాయవాది అశుతోశ్ శ్రీవాస్తవ రూ. 10 కోట్లకు పరువు నష్టం దావా వేయడం హాట్ టాపిక్ అయింది. ఈ మేరకు సియా గోయల్ సోదరుడు సాహిల్ గోయల్‌కు న్యాయవాది శ్రీవాస్తవ నోటీసులు పంపించారు.

అసలు వివాదం ఏమిటి?

పూణేకు చెందిన అడ్వకేట్ అశుతోష్ శ్రీవాస్తవ.. కేతన్ అగర్వాల్ హత్య కేసులో సియా గోయల్ తనను తన లాయర్‌గా నియమించుకుందని, అందుకు సంబంధించిన 'వకాలత్ నామా' పై కూడా ఆమె సంతకం చేసిందని స్పష్టం చేశారు. అయితే దీనిని సియా సోదరుడు సాహిల్ గోయల్ తీవ్రంగా ఖండించారు. తమ కుటుంబం సియా తరఫున వాదించడానికి అడ్వకేట్ విపుల్ దుసింగ్‌ను సంప్రదించిందని, లాయర్ అశుతోశ్ శ్రీవాస్తవ మోసపూరితంగా సియాతో సంతకాలు చేయించుకున్నారని సాహిల్ మీడియా ముందు ఆరోపించారు. ఈ క్రమంలో కోర్టులో సియా గోయల్ స్వయంగా స్పందిస్తూ.. అశుతోశ్ శ్రీవాస్తవ నా లాయర్ కాదని విపుల్ దుసింగ్ మాత్రమే నా తరఫున లాయర్ అంటూ న్యాయమూర్తికి తెలియజేసింది.

తీవ్రంగా స్పందించిన శ్రీవాస్తవ:

తనపై వచ్చిన ఆరోపణలను లాయర్ అశుతోశ్ శ్రీవాస్తవ తీవ్రంగా పరిగణించారు. సియా సోదరుడు సాహిల్ గోయల్‌కు 10 పేజీల లీగల్ నోటీసు పంపారు. సాహిల్ చేసిన వ్యాఖ్యలు తప్పుడువని, తన వృత్తిపరమైన ప్రతిష్టకు, సమాజంలో ఉన్న గౌరవానికి తీవ్ర భంగం కలిగించాయని నోటీసులో పేర్కొన్నారు. సియా గోయల్ మేజర్ అని ఆమె తన సొంత ఇష్టపూర్వకంగానే నా పేరు మీద వకాలత్‌నామాపై సంతకం చేసిందని పేర్కొన్నారు. కానీ సాహిల్ గోయల్ చేసిన వ్యాఖ్యల వల్ల నాకు వృత్తిపరంగా, మానసికంగా తీవ్ర నష్టం వాటిల్లిందని అశుతోశ్ శ్రీవాస్తవ పేర్కొన్నారు. అలాగే సోషల్ మీడియా, యూట్యూబ్, వాట్సాప్ గ్రూపుల నుంచి ఆ తప్పుడు వీడియోలను 48 గంటల్లోగా తొలగించి, బహిరంగ క్షమాపణ చెప్పాలని.. అలాగే 7 రోజుల్లోగా రూ. 10 కోట్ల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. కేతన్ హత్య కేసులో ఇప్పటికే పీకల్లోతు కష్టాల్లో ఉన్న సియా గోయల్ కుటుంబ సభ్యులకు తాజా పరిణామం బిగ్ షాక్‍గా మారింది.

Next Story