- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బుల్లెట్ రైలు మార్కింగ్‌లతో రైతుల్లో గుబులు
గత వారం పది రోజులుగా మర్రిగూడ, నాంపల్లి మండలాల్లో పొలాలు, రహదారుల వెంబడి కనిపిస్తున్న ఎర్ర, తెలుపు రంగుల గుర్తులు రైతులను తీవ్ర ఆందోళనకు గురిచేశాయి.

దిశ, మర్రిగూడ: గత వారం పది రోజులుగా మర్రిగూడ, నాంపల్లి మండలాల్లో పొలాలు, రహదారుల వెంబడి కనిపిస్తున్న ఎర్ర, తెలుపు రంగుల గుర్తులు రైతులను తీవ్ర ఆందోళనకు గురిచేశాయి. తమ వ్యవసాయ భూములు భూసేకరణకు గురవుతాయేమోననే భయంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రామాల్లో ఎక్కడ చూసినా ఇదే చర్చ సాగుతోంది. గ్రామాలలో ప్రధాన కూడళ్లలో, హోటల్లో, నలుగురు కూడిన దగ్గర గుర్తుల చర్చే జరుగుతుంది. మొదట ఈ గుర్తులు ఎందుకు వేశారో, ఎవరు వేశారో తెలియక ప్రజల్లో అయోమయం నెలకొంది. "కొత్త జాతీయ రహదారి కోసమా?", "భూసేకరణ ప్రారంభమైందా?", "రైల్వే మార్గమా?" అంటూ రకరకాల ఊహాగానాలు వినిపించాయి. దీంతో రైతులు తమ భూముల భవిష్యత్తుపై ఆందోళన చెందారు. అయితే అధికార వర్గాల సమాచారం ప్రకారం, హైదరాబాద్–చెన్నై, హైదరాబాద్–బెంగళూరు హైస్పీడ్ బుల్లెట్ రైలు ప్రాజెక్టుకు సంబంధించిన ప్రాథమిక సర్వేలో భాగంగానే ఈ మార్కింగ్‌లు చేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మండలంలోని రాజాపేట తండా, వట్టిపల్లి శివారు , దామెర భీమనపల్లి సోలార్ దగ్గర నుండి రామరాజు చిట్టెంపాడు ప్రాంతాల్లో సర్వే బృందాలు గుర్తులు వేసినట్లు సమాచారం.అయితే ఈ ప్రాజెక్టు తుది మార్గం ఏది? ఎన్ని గ్రామాల మీదుగా వెళ్లనుంది? భూసేకరణ ఉంటుందా? ఉంటే రైతులకు ఎలాంటి పరిహారం అందుతుంది? అనే అంశాలపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన లేకపోవడంతో రైతుల్లో అనేక సందేహాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం, సంబంధిత అధికారులు పూర్తి వివరాలు వెల్లడించి రైతుల సందేహాలను నివృత్తి చేయాలని స్థానికులు కోరుతున్నారు. పారదర్శక సమాచారం అందిస్తేనే గ్రామాల్లో నెలకొన్న ఆందోళనకు పూర్తిస్థాయిలో తెరపడే అవకాశం ఉందని రైతులు అభిప్రాయపడుతున్నారు.






