- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జీతాలేమో ప్రభుత్వాలవి కావాలి.. చదువులేమో ప్రైవేట్‌వి కావాలా..?
రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలోని పలువురు ప్రభుత్వ ఉపాధ్యాయుల తీరుపై ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి మంద అనిల్ కుమార్ తీవ్ర విమర్శలు చేశారు.

దిశ, ఇల్లంతకుంట : రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలోని పలువురు ప్రభుత్వ ఉపాధ్యాయుల తీరుపై ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి మంద అనిల్ కుమార్ తీవ్ర విమర్శలు చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల చేరికలు తగ్గిపోవడానికి కొందరు ఉపాధ్యాయుల వ్యవహారశైలే ప్రధాన కారణమని ఆయన ఆరోపించారు. "జీతాలేమో ప్రభుత్వాలవి కావాలి.. చదువులేమో ప్రైవేట్‌వి కావాలా..?" అంటూ ప్రశ్నించిన ఆయన, ప్రభుత్వం నుంచి లక్షల్లో జీతాలు తీసుకుంటూ తమ పిల్లలను మాత్రం కార్పొరేట్, ప్రైవేట్ పాఠశాలల్లో చేర్పించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ప్రభుత్వ పాఠశాలలపై ఉపాధ్యాయులకే నమ్మకం లేకపోతే సామాన్య ప్రజలకు ఎలా నమ్మకం కలుగుతుందని అన్నారు. ఒకప్పుడు ప్రభుత్వ పాఠశాలలు విద్యకు ఆలవాలంగా నిలిచాయని, ఉపాధ్యాయులు సమాజానికి ఆదర్శంగా ఉండేవారని, ప్రస్తుతం ఆ పరిస్థితి కనిపించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇష్టానుసారంగా పాఠశాలకు రావడం, యూనియన్ సమావేశాలు, ఇతర సమావేశాల పేరుతో తరచూ పాఠశాలలకు దూరంగా ఉండడం, బడి సమయంలో మండల కేంద్రాలకు వెళ్లడం, రాజకీయ నాయకులతో తిరగడం వంటి చర్యల వల్ల విద్యార్థుల చదువుపై తీవ్ర ప్రభావం పడుతోందని ఆరోపించారు.
తరగతి గదుల్లో సెల్‌ఫోన్ వినియోగించవద్దని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినప్పటికీ, కొందరు ఉపాధ్యాయులు క్లాస్‌రూమ్‌లోనే సెల్‌ఫోన్లు ఉపయోగిస్తూ, ఫోన్ కాల్స్ వచ్చినప్పుడు బయటకు వెళ్లి మాట్లాడుతున్నారని అన్నారు. విద్యార్థులకు క్రమశిక్షణ నేర్పాల్సిన ఉపాధ్యాయులే నిబంధనలు ఉల్లంఘించడం బాధాకరమన్నారు. అంతేకాకుండా కొందరు చిట్టీల వ్యాపారం, రియల్ ఎస్టేట్ వంటి వ్యక్తిగత వ్యాపారాలపై దృష్టి సారించడంతో పాటు, తమ కుటుంబ సభ్యులను సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీలుగా గెలిపించుకునేందుకు రాజకీయాల్లో చురుకుగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. లక్షల మంది పోటీదారులతో పరీక్షలు రాసి ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి లక్షల్లో జీతాలు పొందుతున్న ఉపాధ్యాయులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో కాకుండా ప్రైవేట్ పాఠశాలల్లో చేర్పించడం ప్రజలకు తప్పుడు సంకేతాలు పంపుతోందన్నారు. మరోవైపు ప్రభుత్వ ఉద్యోగం రాక తక్కువ వేతనాలతో ప్రైవేట్ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల వద్దకు వెళ్లి "మా పిల్లాడు ఎలా చదువుతున్నాడు?" అని అడగడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. ప్రైవేట్ పాఠశాలల్లో వందల సంఖ్యలో అడ్మిషన్లు నమోదవుతుండగా, ప్రభుత్వ పాఠశాలల్లో పదుల సంఖ్యలో కూడా చేరికలు లేకపోవడానికి గల కారణాలపై ప్రభుత్వం, విద్యాశాఖ ప్రత్యేక దృష్టి సారించి విచారణ చేపట్టాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి మంద అనిల్ కుమార్ డిమాండ్ చేశారు.






