వికసిత భారత్‌కు పాఠశాల విద్యే కీలకం.. ఏపీ సర్కార్‌పై కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రశంసలు

by Ramesh Naini |

జాతీయ విద్యా విధానం లక్ష్యాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమర్థవంతంగా అమలు చేస్తోందని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రశంసించారు.

వికసిత భారత్‌కు పాఠశాల విద్యే కీలకం.. ఏపీ సర్కార్‌పై కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రశంసలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: జాతీయ విద్యా విధానం (NEP) లక్ష్యాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమర్థవంతంగా అమలు చేస్తోందని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రశంసించారు. రాష్ట్రంలో ప్రైవేటు పాఠశాలల నుంచి విద్యార్థులు తిరిగి ప్రభుత్వ బడుల వైపు రావడం హర్షణీయమని, ఇందుకు విశేష కృషి చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, యువ మంత్రి నారా లోకేశ్‌లను ఆయన అభినందించారు. మంగళవారం విజయనగరం జిల్లా భోగాపురంలోని ‘పీఎం శ్రీ’ (PM SHRI) ఏపీ మోడల్ స్కూల్‌ను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌తో కలిసి కేంద్ర మంత్రి సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులు, ఉపాధ్యాయులతో వారు ముచ్చటించారు. అనంతరం కేంద్ర మంత్రి మీడియాతో మాట్లాడుతూ పలు కీలక విషయాలు వెల్లడించారు.

ఆదర్శంగా పీఎం శ్రీ స్కూళ్లు

విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథాన్ని, బహుముఖ వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించేందుకు ప్రధాని మోడీ దార్శనికతతో రూపుదిద్దుకున్న ‘పీఎం శ్రీ’ పాఠశాలలు అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తాయని మంత్రి తెలిపారు. దేశవ్యాప్తంగా ఇప్పటికే 15,000 పాఠశాలలు పనిచేస్తున్నాయని వెల్లడించారు. అభ్యాస ప్రక్రియలో సాంకేతికతను విస్తృతంగా వినియోగించాలని జాతీయ విద్యా విధానం సూచిస్తోందని, భోగాపురం పాఠశాల తరగతి గదుల్లో అది ఆచరణాత్మకంగా అమలు కావడం సంతోషకరమన్నారు. 2047 నాటికి భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా (వికసిత భారత్) ఆవిర్భవించాలంటే, పాఠశాల విద్యకే అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టం చేశారు. దీనిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు సమాజంలోనూ ఏకాభిప్రాయం ఉందన్నారు. జాతీయ విద్యా విధానం విద్యార్థులపై సానుకూల ప్రభావం చూపుతోందని, పాఠశాల, ఉన్నత విద్యా రంగాల్లో ఆంధ్రప్రదేశ్ అద్భుతమైన పనితీరు కనబరుస్తోందని కేంద్రమంత్రి కితాబిచ్చారు. ఇక్కడి స్ఫూర్తితో భవిష్యత్తులో మరిన్ని వినూత్న కార్యక్రమాలకు ప్రణాళికలు రచిస్తామని ఆయన పేర్కొన్నారు.

Next Story