సముద్ర గర్భంలో AI భవిష్యత్తు..! అండర్‌వాటర్ డేటా సెంటర్లపై నిపుణుల ఫోకస్

by Javid Pasha |   (  Updated:2026-06-30 09:03:01  IST  )

గాలి శక్తి, సముద్రపు నీటిని ఉపయోగించి పనిచేసే ఈ వ్యవస్థను సాంకేతిక నిపుణులు గ్రీన్ ఎనర్జీకి చక్కటి పరిష్కారంగా భావిస్తున్నారు.

సముద్ర గర్భంలో AI భవిష్యత్తు..! అండర్‌వాటర్ డేటా సెంటర్లపై నిపుణుల ఫోకస్
X

దిశ, ఫీచర్స్ : ప్రస్తుతం ఏఐ ఆధారిత సాంకేతికతకు రోజు రోజుకూ డిమాండ్ పెరుగుతోంది. దీంతో ఇంటర్నెట్ వినియోగం కూడా భారీగా పెరిగింది. అయితే మారుతున్న వాతావరణ పరిస్థితుల్లో డేటా సెంటర్ల నిర్వహణ కష్టంగా మారుతోంది. విద్యుత్ ఖర్చులు పెరగడంతో పాటు సర్వర్లు వేడెక్కడం, కూలింగ్ సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏఐ & క్లౌడ్ డిమాండ్‌ను తీర్చే గ్రీన్ ఎనర్జీ సొల్యూషన్లపై పరిశోధనలు జరుగుతున్నాయి. అలాంటి ఆవిష్కరణల్లో అండర్‌వాటర్ డేటా సెంటర్ సాంకేతికత ఒకటి.

గాలి శక్తి, సముద్రపు నీటిని ఉపయోగించి పనిచేసే ఈ వ్యవస్థను సాంకేతిక నిపుణులు గ్రీన్ ఎనర్జీకి చక్కటి పరిష్కారంగా భావిస్తున్నారు. చైనా ఈ రంగంలో ముందంజలో ఉంది. సముద్రపు అడుగున సీల్డ్ స్టీల్ కేబిన్లలో సర్వర్లను ఉంచి, సముద్రపు చల్లని నీటిని సహజ కూలింగ్‌గా వినియోగించే వ్యవస్థను అభివృద్ధి చేసింది. హైనాన్‌లో 2023లో మొదటి వాణిజ్య యూనిట్లు ప్రారంభం అయ్యాయి. షాంఘై లింగాంగ్ ప్రాంతంలో 24 మెగావాట్ల సామర్థ్యంతో కూడిన విండ్-పవర్డ్ అండర్‌వాటర్ డేటా సెంటర్ 2026లో పనిచేయడం మొదలైంది. ఈ కేబిన్లు గట్టి స్టీల్ నిర్మాణంతో మూసివేసి, 10-35 మీటర్ల లోతులో ఉంచుతారు.

ఎలా పనిచేస్తాయి?

సాధారణ డేటా సెంటర్ల మాదిరిగానే ఇక్కడ కూడా సర్వర్లు, స్టోరేజ్ ఉంటాయి. కానీ ఇవి భూమి మీద కాకుండా సముద్రపు అడుగున మూసిన కంటైనర్లలో వీటిని నిర్మిస్తారు. సముద్రపు నీరు సహజంగా వేడిని తీసివేస్తుంది. లోపల ధూళి-రహితం, ఆక్సిజన్ లేని నైట్రోజన్ వాతావరణం ఉండటం వల్ల హార్డ్‌వేర్ ఫెయిల్యూర్ రేట్లు బాగా తగ్గుతాయి. సర్వర్ల నుంచి వచ్చే వేడిని సముద్రపు నీటి ద్వారా హీట్ ఎక్స్ఛేంజ్ చేసి తొలగిస్తారు.

ప్రయోజనాలు

*కూలింగ్ ఎనర్జీ వినియోగం 40-90% వరకు తగ్గుతుంది.

*తాజా నీటి వినియోగం పూర్తిగా ఎలిమినేట్ అవుతుంది.

*హార్డ్‌వేర్ జీవితకాలం పెరుగుతుంది.

*ఖర్చులు సగం కంటే తక్కువగా ఉంటాయి (ముఖ్యంగా షాంఘై ప్రాజెక్టు).

*ఏఐ, క్లౌడ్ కంప్యూటింగ్ సేవలకు గ్రీన్ ఎనర్జీ సొల్యూషన్‌గా పనిచేస్తాయి.

సవాళ్లు/నష్టాలు

ఈ సాంకేతికతకు కొన్ని సవాళ్లు కూడా ఉన్నాయి. మెయింటెనెన్స్ కష్టం. యూనిట్లను భారీ యంత్రాలతో పైకి లేవనెత్తాలి. దీర్ఘకాలంలో స్థానిక సముద్ర జీవులపై ఉష్ణప్రభావం (thermal pollution) ఏర్పడే అవకాశం ఉంది. ప్రారంభ ఇన్‌స్టాలేషన్ ఖర్చు కూడా ఎక్కువ. అయినప్పటికీ ఈ టెక్నాలజీ AI యుగంలో ఎనర్జీ సమస్యలకు ఆశాజనక పరిష్కారంగా మారుతోది. మైక్రోసాఫ్ట్ కూడా గతంలో Project Natick ద్వారా పైలట్ ప్రయత్నాలు చేసినా, చైనా ఇప్పుడు వాణిజ్య స్థాయిలో విజయం సాధించింది. భవిష్యత్తులో ఇది డేటా సెంటర్ల రూపకల్పనను మార్చేసే సాంకేతికతగా అభివృద్ధి చెందుతుందని నిపుణులు భావిస్తున్నారు.

Next Story