సిగాచి దుర్ఘటనకు ఏడాది.. రేవంత్ ప్రభుత్వంపై హరీశ్ రావు నిప్పులు

by Prasad Jukanti |

సిగాచి ప్రమాదం ఘటనతో యావత్ దేశం ఉలిక్కిపడింది. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మనసు మాత్రం కరగలేదని హరీశ్ రావు విమర్శించారు.

సిగాచి దుర్ఘటనకు ఏడాది.. రేవంత్ ప్రభుత్వంపై హరీశ్ రావు నిప్పులు
X

దిశ, తెలంగాణ బ్యూరో/డైనమిక్ బ్యూరో: తెలంగాణ పారిశ్రామిక చరిత్రలో 30 జూన్ 2025 ఒక చీకటి రోజు అని మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) అన్నారు. కూటి కోసం, కూలి కోసం వలస వచ్చి సంగారెడ్డి జిల్లా పాశమైలారంలోని సిగాచి పరిశ్రమలో పనిచేస్తున్న 54 మంది పేద కార్మికులు సజీవదహనమైన ఘటనకు (Sigachi Industries Blast) ఏడాది పూర్తయిన సందర్భంగా ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. రేవంత్ రెడ్డి (Revanth Reddy) ప్రభుత్వ నియంత్రణ, పర్యవేక్షణ వైఫల్యం అని, సిగాచి కంపెనీ నిర్లక్ష్యం కారణంగా ప్రాణాలు కోల్పోయిన అమాయక కార్మికులకు నివాళి అర్పించారు. ఈ హృదయవిదారక ఘటనతో యావత్ దేశం ఉలిక్కిపడింది కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మనసు మాత్రం కరగలేదని విమర్శించారు. దుర్ఘటన జరిగిన రోజు హైదరాబాద్‍లోని తన జూబ్లీహిల్స్ ప్యాలెస్‍లోనే ఉన్నా.. 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న సిగాచి పరిశ్రమ వద్దకు మాత్రం రాలేదని బాధిత కుటుంబాల కన్నీళ్లు తుడవలేదన్నారు.

కోటి ఇస్తామని కేవలం లక్షే ఇచ్చారు:

విమర్శలు రావడంతో తెల్లారి ఘటన వద్దకు వచ్చిన రేవంత్ రెడ్డి మృతదేహాల సాక్షిగా ప్రతి కుటుంబానికి రూ.1 కోటి పరిహారం ఇస్తామని ఘనంగా ప్రకటించారు. కోటి ఇస్తామని గొప్పలు చెప్పిన రేవంత్ రెడ్డి, ప్రభుత్వం తరపున ఇచ్చింది మాత్రం కేవలం లక్షరూపాలయలు మాత్రమేనన్నారు. ఇంతకంటే సిగ్గుమాలిన చర్యల ఏమైనా ఉంటదా? తలదించుకోవాలన్నారు. కంపెనీ ఇచ్చిన డబ్బులు బాధిత కుటుంబాలకు ముట్టజెప్పి, కోటి పరిహారం నుంచి తప్పించుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు. కార్మికులు చనిపోవడం వల్ల చట్టబద్ధంగా వారికి రావాల్సిన పీఎఫ్, ఈఎస్ఐ, లైఫ్ ఇన్సూరెన్స్ డబ్బులను కూడా కలుపుకుని పరిహారంలో చూపడం శోచనీయం అన్నారు. అవేదో కంపెనీ జేబులోంచి ఇస్తున్న పరిహారం కాదు, కార్మికులు కష్టార్జితం నుంచి హక్కుగా వచ్చిన డబ్బు అని చెప్పారు.

డెత్ సర్టిఫికెట్ల కోసం ఆఫీసుల చుట్టూ తిప్పుకున్నారు:

కార్మికుల కష్టార్జితాన్ని కూడా తీసుకువచ్చి కంపెనీ ఇచ్చే పరిహారంలో కలిపి చూపించడం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, యాజమాన్య అమానవీయతకు, దిగజారుడుతనానికి పరాకాష్ట అన్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయిన కార్మికుల వైద్య ఖర్చులను కూడా ఈ అరకొర పరిహారంలోనే కోత విధించారు. క్షతగాత్రులకు సరైన వైద్య సహాయం అందక, జీతాలు రాక అనేక ఇబ్బందులు పడుతున్నారు. బాధిత కుటుంబాలకు ఇస్తానన్న ఉద్యోగాలు ఇప్పటికీ దిక్కులేదు. కార్మిక శాఖ బాధ్యత రాహిత్యానికి అమాయక వలస బతుకులు వేదన చెందుతున్నాయి. ప్రమాదంలో కాలి బూడిదై ఆచూకీ దొరకని 8 మంది కార్మికుల కుటుంబాలను డెత్ సర్టిఫికెట్ల కోసం నెలల తరబడి ఆఫీసుల చుట్టూ తిప్పించుకున్న దుర్మార్గ ప్రభుత్వం ఇదన్నారు.

ప్రభుత్వానికి, కంపెనీ యాజమాన్యానికి లోపాయికారీ ఒప్పందం:

ఇది కేవలం ఒక ప్రమాదం కాదు, యాజమాన్యం నిర్లక్ష్యంతో జరిగిన సామూహిక హత్య అని ఫ్యాక్టరీలో భద్రతా ప్రమాణాలు గాలికొదిలేశారని విచారణలో ఆధారాలతో సహా స్పష్టంగా తేలిందన్నారు. 818 హెచ్‌పీ సామర్థ్యానికి మాత్రమే అనుమతి తీసుకుని, అక్రమంగా 1777 హెచ్‌పీకి యంత్రాలను పెంచేశారని సేఫ్టీ గార్డ్స్ లేవు, ఫైర్ ఎన్ఓసీ లేదు, డస్ట్ కంట్రోల్ సిస్టమ్ పనిచేయలేదన్నారు. ఇంత నిర్లక్ష్యం బయటపడినా, ప్రభుత్వం యాజమాన్యంపై చర్యలు తీసుకోవడంలో పూర్తిగా విఫలమైందని ధ్వజమెత్తారు. బాధితుల పక్షాన హైకోర్టులో కేసు వేసి, న్యాయస్థానం మొట్టికాయలు వేస్తే తప్ప పోలీసులు కదలలేదన్నారు. తూతూ మంత్రంగా ఎండీని అరెస్టు చేయడం, వెంటనే ఆయన బెయిల్ మీద బయటకు వచ్చేలా పరోక్షంగా సహకరించడం చూస్తుంటే.. ప్రభుత్వానికి, కంపెనీ యాజమాన్యానికి మధ్య ఉన్న లోపాయికారీ ఒప్పందాలు ఏమిటో అర్థం అవుతూనే ఉందన్నారు.

మాట తప్పడం మీకు ఎలాగూ అలవాటే:

ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా వందల కోట్ల టర్నోవర్ ఉన్న సిగాచి కంపెనీ డైరెక్టర్ల ఆస్తులను రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద అటాచ్ చేసి వాటిని అమ్మి అయినా బాధిత కుటుంబాలకు ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ మేరకు భేషరతుగా కోటి రూపాయల పరిహారాన్ని తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారూ.. బతికున్న ప్రజలను మోసం చేయడం, మాట తప్పడం మీకు ఎలాగూ అలవాటే. కానీ కనీసం ఆ ప్రాణాలు కోల్పోయిన పేద కార్మికులను, దిక్కుతోచని స్థితిలో ఉన్న వారి కుటుంబాలను మోసం చేయవద్దన్నారు. రుణమాఫీ చేస్తానని దేవుళ్ల మీద ఒట్లు పెట్టి మాట తప్పారు. ఆరు గ్యారెంటీలు, 420 హామీలు అమలు చేస్తానని ప్రజలకు మాట ఇచ్చి తప్పారు. బాధిత కుటుంబాలకు కోటి రూపాయలు ఇస్తానని మృతదేహాల సాక్షిగా ఇచ్చిన మాటను కూడా తప్పారు. మాట మీద నిలబడే అలవాటు లేదా రేవంత్ రెడ్డి నోరు తెరిస్తే అబద్దాలేనా? ప్రజలు ఏమనుకుంటారో అనే కనీస ఆలోచన లేదా? అని మండిడ్డారు. మీరు ఆనాడు మృతదేహాల సాక్షిగా ఇచ్చిన మాట ప్రకారం, పీఎఫ్, ఈఎస్ఐ డబ్బులతో సంబంధం లేకుండా ప్రతి బాధిత కుటుంబానికి కోటి రూపాయల పరిహారం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. మృతదేహాల సాక్షిగా ఇచ్చిన మాటను నిలబెట్టుకోండి. లేకపోతే ఈ బాధిత కుటుంబాల కన్నీళ్లు, ఆవేదన ఈ ప్రభుత్వాన్ని తప్పకుండా వెంటాడుతాయి.

Next Story