నాలాల్లో తవ్వేకొద్దీ వస్తున్న పూడిక.. కేబుల్ వైర్ల నుంచి ప్లాస్టిక్ వ్యర్థాల వరకు!

by Jakkula.Mamatha |

చెత్తంతా ఎక్క‌డ ఉంది అంటే మురుగు, వ‌ర‌ద కాలువ‌ల్లో ఉంది అనేట్టు ప‌రిస్థితి మారిందని హైడ్రా అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

నాలాల్లో తవ్వేకొద్దీ వస్తున్న పూడిక.. కేబుల్ వైర్ల నుంచి ప్లాస్టిక్ వ్యర్థాల వరకు!
X

దిశ, శేరిలింగంపల్లి: చెత్తంతా ఎక్క‌డ ఉంది అంటే మురుగు, వ‌ర‌ద కాలువ‌ల్లో ఉంది అనేట్టు ప‌రిస్థితి మారిందని హైడ్రా అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా కాలువల్లో పేరుకుపోయిన పూడికలు చూసి ఆ శాఖ అధికారులే ఆశ్చర్యపోతున్నారు. (ప్రజల బాధ్యత రాహిత్య) సివిక్ సెన్స్ పైన చర్చ జరగాలని కోరుకుంటున్నారు. ఏ కాలువ‌ను క‌దిలించినా లారీల కొద్దీ చెత్త బ‌య‌ట‌కు ప‌డుతోంది. కేబుల్ వైర్లు, చెత్త క‌వ‌ర్లు, ప‌రుపులు, దిండులు, దుప్ప‌ట్లు, సోఫాలు, కుర్చీలు.. ఇలా ఇంట్లో ప‌నికి రాని వ‌స్తువంతా మురుగు కాలువ‌ల్లోకి చేరుతోంది. వ‌ర‌ద నీరు సాఫీగా వెళ్ల‌డానికి వీలుగా నిర్మించిన బాక్స్ డ్రైన్లు చెత్త‌తో, ప్లాస్టిక్ వ్య‌ర్థాల‌తో నిండిపోతున్నాయి. దీంతో ఎక్క‌డిక‌క్క‌డ వ‌ర్షం నీరు కాల‌నీల‌ను, ర‌హ‌దారుల‌ను ముంచెత్తుతోంది. నాలాల్లో మురుగు కాలువ‌ల్లో చెత్త ప‌డ‌కుండా ఎవ‌రికి వారు జాగ్ర‌త్త‌లు తీసుకోవాల్సిన‌ వ‌స‌రాన్ని ఇక్క‌డ వ‌ర‌ద కాలువ‌ల్లో తొల‌గిస్తున్న చెత్త చెబుతోంది. వ‌ర్షం ప‌డేట‌ప్పుడు వ‌ర‌ద నీరు ముంచెత్త‌కుండా జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్న హైడ్రా.. వ‌ర్షం లేన‌ప్పుడు ముంపుకు గ‌ల కార‌ణాల‌పై హైడ్రా దృష్టి పెట్టింది.

మియాపూర్ నుంచి పటాన్చెరు వరకు..

మియాపూర్ నుంచి ప‌టాన్ చెరు వెళ్తున్న మార్గంలో ఎడ‌మ‌వైపు ఉన్న బాక్సు డ్రైన్‌లో కేబుల్ వైర్లు తెట్టు బ‌య‌ట‌ప‌డింది. అక్క‌డ వ‌ర‌ద ఏమాత్రం పోని ప‌రిస్థితి ఉంది. కేబుల్ వైర్ల‌తో కూడిన చెత్త కాలువ‌ల్లో క‌నిపించింది. జేసీబీల‌తో బ‌య‌ట‌కు గుంజితే సెటిల్ అయిన కేబుల్ వైర్ల‌తో కూడిన చెత్త బ‌య‌ట ప‌డింది. 5 సెంటీమీట‌ర్లు వర్షపాతం కంటే ఎక్కువ నమోదైతే చందాన‌గ‌ర్‌, లింగంప‌ల్లి ఆర్‌యూబీ ర‌హ‌దారి వ‌ర‌ద నీటితో నిండిపోతుంది. న‌క్క వాగుకు సాఫీగా సాగాల్సిన వ‌ర‌ద రోడ్లపైకి చేరడానికి పూడికతో నిండిపోవడమే కారణం. రూ. కోట్లు ఖ‌ర్చు చేసి ఎస్ ఎన్ డీపీ ప్రాజెక్టు కింద బాక్స్ డ్రైన్ నిర్మించారు. అక్క‌డ భూమి కాస్త స‌మాంత‌రంగా ఉండ‌డంతో చెత్తంతా ఆర్‌యూబీ కింద ఉన్న కాలువ‌లో పేరుకుపోయి వ‌ర‌ద నీరు వెళ్ల‌ని ప‌రిస్థితిని హైడ్రా అధికారులు గుర్తించారు. ఇటీవ‌ల ఇనుప గ్రిల్స్‌ను తీసి చెత్త‌ను హైడ్రా క్లియ‌ర్ చేసింది. రెండు ట్ర‌క్కుల ప్లాస్టిక్ వ్య‌ర్థాలు ఒకే ద‌గ్గ‌ర వ‌చ్చాయి.

కాలువల్లో పూడికతీతకు కోట్లు వెచ్చిస్తున్న..

మియాపూర్, శేరిలింగంపల్లి, మాదాపూర్ సర్కిల్ కార్యాలయాల పరిధిలో ఉన్న వివిధ కాలనీలలో కాలువల్లో పేరుకుపోతున్న చెత్తాచెదారాన్ని తొలగించేందుకు ప్రతి ఏటా ఒక్కో సర్కిల్ కు సుమారు కోటి రూపాయలు వెచ్చిస్తున్నారు. ఇందుకోసం ఏజెన్సీలను నియమించారు. ప్లాస్టిక్ వ్యర్ధాలు, మట్టితో కూరుకుపోయే కాలువలు శుభ్రం చేసి మురికి నీరు సాఫీగా పోయే ఏర్పాట్లు చేయాల్సిన బాధ్యత ఈ కాంట్రాక్టర్లకు అప్పగించారు. కాలనీవాసులు చేసే ఫిర్యాదు, ఇంజనీరింగ్ అధికారులు గుర్తించిన పూడికలు తొలగించే బాధ్యత సంబంధిత కాంట్రాక్టర్లకు అప్పగించారు. వ్యర్థాలను తొలగించే కాలువ దూరాన్ని బట్టి, వ్యర్థాల బరువును బట్టి ఇంజనీరింగ్ అధికారులు బిల్లులు చెల్లిస్తారు. కాలువల నుంచి సేకరించిన చెత్త డంపింగ్ యార్డ్ కు తరలించాల్సి ఉంటుంది.

ప్రతి ఏటా కోట్ల రూపాయలు నిధులు వినియోగిస్తున్నట్లు లెక్కల్లో చెబుతున్న వాస్తవ పరిస్థితులు అందుకు విరుద్ధంగా ఉన్నాయి. తాజాగా హైడ్రా చేపట్టిన కాలువల క్లియరెన్స్ లో తొలగిస్తున్న వ్యర్థాలే నిదర్శనం. మాదాపూర్ హైటెక్స్ వెళ్లే దారిలో, రాయదుర్గం మల్కం చెరువు వద్ద, మియాపూర్, చందానగర్ లో జాతీయ రహదారికి అనుకొని ఉన్న డ్రైన్ బాక్సులు పూడికతో నిండిపోయి రోడ్లపైకి వర్షం నీరు చేరి చెరువులను తలపిస్తున్నాయి. ఎగువన ఉన్న మంజీర రోడ్డు కాలనీల నుంచి మదీనాగూడ ఈర్ల చెరువు వరకు డ్రైన్ బాక్సులు నిర్మించేందుకు రెండేళ్ల క్రితం రూ 7.41 కోట్లు నిధులు మంజూరు చేశారు. డ్రైన్ బాక్స్ నిర్మాణం పనులు మధ్యలోనే వదిలిపెట్టారు. చెరువు కు అనుసంధానం చేయలేదు. రోడ్లు, కాలనీలు ముంపుకు గురవుతున్న చెరువుల్లో మాత్రం చుక్క నీరు చేరడం లేదు.

Next Story