ఉన్నత విద్యామండలి ముట్టడికి ఏబీవీపీ యత్నం.. ఉద్రిక్తంగా మారిన వాతావరణం

by Malleboina Mahesh |   (  Updated:2026-06-30 07:10:13  IST  )

ఫీజ్ రియింబర్స్‌మెంట్ విడుదల చేయాలని హైదరాబాద్‌లో ఉన్నత విద్యామండలి ముట్టడికి ఏబీవీపీ యత్నం.. పోలీసులతో భారీ తోపులాట, పలువురు అరెస్ట్!

ఉన్నత విద్యామండలి ముట్టడికి ఏబీవీపీ యత్నం.. ఉద్రిక్తంగా మారిన వాతావరణం
X

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టిన పీజు రీయింబర్స్ మెంట్ ను వెంటనే రిలీజ్ చేయాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ నిరసన కార్యక్రమం చేపట్టింది. దీంతో తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి (TGCHE) కార్యాలయం వద్ద మంగళవారం మధ్యాహ్నం తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రాష్ట్ర ప్రభుత్వం సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉంచిన ఫీజ్ రియింబర్స్‌మెంట్ (Fees Reimbursement) బకాయిలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ అఖిల భారత విద్యార్థి పరిషత్ (ABVP) ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున విద్యార్థులు నిరసనకు దిగారు. దీంతో విద్యార్థుల నినాదాలతో ఆ ప్రాంతం అట్టుడికిపోయింది.

కార్యాలయంలోకి దూసుకెళ్లేందుకు యత్నం..

రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి తరలివచ్చిన వందలాది మంది విద్యార్థులు, ఏబీవీపీ నాయకులు ఉన్నత విద్యామండలి కార్యాలయాన్ని ముట్టడించారు. విద్యార్థుల భవిష్యత్తుతో ప్రభుత్వం ఆడుకుంటోందని, నిధులు విడుదల చేయకపోవడం వల్ల కాలేజీల యాజమాన్యాలు సర్టిఫికెట్లు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నాయని నినాదాలు చేశారు. నిరసన దృష్ట్యా అక్కడ పోలీసులు అప్పటికే భారీగా మోహరించారు. అయితే, విద్యార్థి నేతలు పోలీసుల బారికేడ్లను దాటుకుంటూ విద్యామండలి లోపలికి దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు.

పోలీసులతో తోపులాట - అరెస్టులు

ఈ క్రమంలో విద్యార్థి నేతలకు, పోలీసులకు మధ్య తీవ్ర తోపులాట చోటుచేసుకుంది. పోలీసులు విద్యార్థులను చెల్లాచెదురు చేసేందుకు ప్రయత్నించడంతో వాతావరణం ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు పలువురు ఏబీవీపీ ముఖ్య నాయకులను, విద్యార్థులను బలవంతంగా ఈడ్చుకెళ్లి పోలీసు వాహనాల్లో ఎక్కించారు. అదుపులోకి తీసుకున్న నేతలను స్థానిక పోలీస్ స్టేషన్‌కు తరలించారు. బకాయిలు విడుదల చేసే వరకు తమ పోరాటం ఆగేది లేదని ఈ సందర్భంగా విద్యార్థి సంఘాలు హెచ్చరించాయి.

Next Story