- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
లోన్ ఆశ చూపి లూటీ..!
తక్కువ వడ్డీకి రుణం ఇప్పిస్తామని నమ్మించి ఓ మహిళ నుంచి వ్యక్తిగత వివరాలు సేకరించిన రూ.6.70 లక్షలు కాజేసిన ఘటన బూర్గంపాడు మండలంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

దిశ, బూర్గంపాడు : తక్కువ వడ్డీకి రుణం ఇప్పిస్తామని నమ్మించి ఓ మహిళ నుంచి వ్యక్తిగత వివరాలు సేకరించిన సైబర్ నేరగాళ్లు, ఆమె ఫోటోలను అసభ్యకరంగా మార్ఫింగ్ చేసి బెదిరింపులకు పాల్పడి రూ.6.70 లక్షలు కాజేసిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితురాలి ఫిర్యాదుతో వెంటనే స్పందించిన బూర్గంపాడు పోలీసులు సైబర్ క్రైమ్ విభాగం సహకారంతో రూ.3.20 లక్షలను హోల్డ్ చేయించడంలో సఫలమయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బూర్గంపాడు మండలంలోని గౌతాపురం కాలనీకి చెందిన ఓ మహిళకు ఇటీవల గుర్తుతెలియని వ్యక్తుల నుంచి ఫోన్ కాల్ వచ్చింది. తక్కువ వడ్డీకే రుణం మంజూరు చేస్తామని నమ్మబలికిన నేరగాళ్లు ఆధార్, పాన్ కార్డు సహా ఇతర వ్యక్తిగత వివరాలను సేకరించారు. అనంతరం ఆ వివరాలను ఉపయోగించి ఆమె ఫోటోలను అసభ్యకరంగా మార్ఫింగ్ చేసి వాట్సాప్‌లో పంపించారు. తాము అడిగినంత డబ్బు చెల్లించకపోతే ఆ ఫోటోలను సోషల్ మీడియా గ్రూపుల్లో వైరల్ చేస్తామని బెదిరించారు.
ఈ బెదిరింపులతో తీవ్ర భయాందోళనకు గురైన బాధితురాలు పరువు పోతుందనే ఆందోళనతో విడతల వారీగా మొత్తం రూ.6.70 లక్షలను నేరగాళ్ల ఖాతాల్లో జమ చేసింది. అయినప్పటికీ మరింత డబ్బు కోసం నేరగాళ్లు ఒత్తిడి చేయడంతో ఇక తట్టుకోలేక బూర్గంపాడు పోలీసులను ఆశ్రయించింది. ఫిర్యాదు అందుకున్న వెంటనే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సైబర్ క్రైమ్ విభాగం సహకారంతో నిందితుల బ్యాంకు ఖాతాలను గుర్తించి ట్రాన్సాక్షన్లను నిలిపివేయడంతో నేరగాళ్ల ఖాతాల్లోకి వెళ్లిన మొత్తంలో రూ.3.20 లక్షలను హోల్డ్ చేయించగలిగారు. నిందితుల ఆచూకీ కోసం అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోందని, త్వరలోనే వారిని అరెస్టు చేస్తామని ఎస్‌ఐ ప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ ప్రసాద్ ప్రజలకు పలు సూచనలు చేశారు. తక్కువ వడ్డీకి రుణాలు ఇప్పిస్తామంటూ వచ్చే అపరిచితుల ఫోన్ కాల్స్, మెసేజ్‌లను నమ్మవద్దని, ఆధార్, పాన్, బ్యాంకు ఖాతా వివరాలు, ఓటీపీలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరులతో పంచుకోవద్దని సూచించారు. ఆన్‌లైన్ మోసాలు, ఫోటో మార్ఫింగ్, సైబర్ బెదిరింపులకు గురైన వెంటనే భయపడకుండా సమీప పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని లేదా 1930 సైబర్ హెల్ప్‌లైన్‌కు కాల్ చేసి, cybercrime.gov.in పోర్టల్‌లో ఫిర్యాదు నమోదు చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.






