కీసరలో వరుస చోరీలు.. భయాందోళనలకు గురవుతున్న స్థానిక ప్రజలు

by Jakkula.Mamatha |

కీసర మండల కేంద్రంలో వరుసగా రాత్రి వేళల్లో దొంగతనాలు చేస్తున్నారు

కీసరలో వరుస చోరీలు.. భయాందోళనలకు గురవుతున్న స్థానిక ప్రజలు
X

దిశ,కీసర : కీసర మండల కేంద్రంలో వరుసగా రాత్రి వేళల్లో దొంగతనాలు చేస్తున్నారు. ఈరోజు కీసర సుభాష్ నగర్ కాలనీలో నివాసం ఉంటున్న వహీద్ అనే ఇంజనీరింగ్ విద్యార్థి తన ఇంటి ముందు రాత్రి బైక్ పార్క్ చేసి పడుకున్నాడు. ఉదయం లేచే సరికి ఇంటి ముందు పార్క్ చేసిన బైక్ లేకపోవడంతో షాక్ కి గురైన వహీద్ వెంటనే కీసర పోలీసులకు సమాచారం ఇచ్చాడు. వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న కీసర పోలీసులు చుట్టూ పక్కల ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించారు.

రెండు రోజుల క్రితం ఎన్ ఎన్ ఆర్ కాలనీలో పార్కింగ్ చేసిన వాహనాల్లో నుండి బ్యాటరీలు ఎత్తుకెళ్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. రాత్రి వేళల్లో భారీ వాహనాలను లక్ష్యంగా చేసుకొని రెచ్చిపోతున్నారు. మంగళవారం అర్ధరాత్రి సమయంలో కీసర గ్రామానికి చెందిన యెలిమేటి కనక రెడ్డి యాజమాన్యంలోని టిప్పర్ వాహనాలు TS 08 UE 3909 మరియు AP 12 V 7083 లకు సంబంధించిన బ్యాటరీలను గుర్తుతెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు. అదే రోజు రాత్రి ముద్దం వెంచర్ లే అవుట్ ప్రాంతంలో శివప్రసాద్ రెడ్డి టిప్పర్ లారీ TS 12 VB 6661 కి చెందిన బ్యాటరీలను కూడా దుండగులు దొంగిలించారు. గత కొంతకాలంగా కీసర మండల కేంద్రం,పరిసర ప్రాంతాల్లో ఇదే తరహా బ్యాటరీల దొంగతనాలు వరుసగా జరుగుతున్నాయని ప్రజలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

భారీ వాహనాలను లక్ష్యంగా చేసుకుని ఒక ముఠా పక్కా ప్రణాళికతో ఒక్క చోరికి మరొక చోరికి గ్యాప్ ఇస్తూ ఈ చోరీలకు పాల్పడుతోందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దొంగతనాల కారణంగా వాహన యజమానులు భారీ ఆర్థిక నష్టాన్ని చవిచూస్తున్నారు. వాహనాలతో వ్యాపారం చేసుకునే వారికి ఒక్కసారిగా వారం పాటు వాహనాలు నిలిపివేయాల్సిన పరిస్థితి రావడంతో వారి ఉపాధిపై కూడా తీవ్ర ప్రభావం పడుతోంది. ఈ నేపథ్యంలో ఘటన జరిగిన ప్రాంతాల్లోని సీసీ కెమెరాల ఫుటేజ్‌ను క్షుణ్ణంగా పరిశీలించి పోలీసులు దొంగల ముఠాను గుర్తించి వెంటనే పట్టుకుని కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. అలాగే రాత్రి వేళల్లో పోలీసులు గస్తీని మరింత ముమ్మరం చేసి ఇలాంటి దొంగతనాలకు అడ్డుకట్ట వేయాలని కోరుతున్నారు.ఈ మేరకు యెలిమేటి కనక రెడ్డి, శివప్రసాద్ రెడ్డి తదితర బాధితులు కీసర పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో దొంగతనం జరిగిన ఘటన స్థలాన్ని పరిశీలించిన సెక్టర్ ఎస్‌ఐ హరిప్రసాద్. వాహన యజమానుల నుంచి వివరాలు సేకరించి, సంఘటన జరిగిన ప్రాంతాల్లోని సీసీ కెమెరాల ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నట్లు తెలిపారు.

కీసర సీఐ ఆర్కపల్లి ఆంజనేయులు..

బ్యాటరీల దొంగతనం ఘటన విషయంలో సీరియస్ గానే ఉన్నాము అని అన్నారు. దొంగతనం జరిగిన తీరుపై అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది అని తెలిపారు.పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరాల ఫుటేజ్‌ను కూడా సేకరించి పరిశీలిస్తున్నాం అని అన్నారు.నిందితులను త్వరలోనే గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. మండలంలో రాత్రి గస్తీని మరింత ముమ్మరం చేస్తాం. వాహన యజమానులు కూడా తమ వాహనాలను భద్రత కలిగిన ప్రదేశాల్లో నిలిపి అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలి" అని సీఐ తెలిపారు.

Next Story