​మాతృశ్రీ కళాశాలలో విద్యార్థులకు ఉచిత నైపుణ్య శిక్షణ..

by Kodari Anjali |

​మాతృశ్రీ కళాశాలలో రెగ్యులర్ విద్యతో పాటు ఉచిత నైపుణ్య శిక్షణ, ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు కళాశాల కరస్పాండెంట్, సెక్రటరీ తెలిపారు.

​మాతృశ్రీ కళాశాలలో విద్యార్థులకు ఉచిత నైపుణ్య శిక్షణ..
X

దిశ, ​హుజురాబాద్ రూరల్: హుజురాబాద్ పట్టణంలోని మాతృశ్రీ డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో విద్యార్థులకు రెగ్యులర్ విద్యతో పాటు ఉచిత నైపుణ్య శిక్షణ, ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు కళాశాల కరస్పాండెంట్, సెక్రటరీ కాయిత ఇంద్రసేనారెడ్డి తెలిపారు. శుక్రవారం కళాశాల అధ్యాపక బృందం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇతర కళాశాలలు తమపై ఎన్ని విష ప్రచారాలు చేసినప్పటికీ, విద్యార్థులు, తల్లిదండ్రులు తమపై ఉంచిన నమ్మకానికి ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఇటీవల ముగిసిన 'దోస్త్' మూడు విడతల కౌన్సిలింగ్‌లో 2026 - 2027 విద్యా సంవత్సరానికి గాను కళాశాలలో అడ్మిషన్లు విజయవంతంగా పూర్తయినట్లు ఆయన ప్రకటించారు.

​సమగ్ర వ్యక్తిత్వ వికాసానికి పెద్దపీట..

​విద్యార్థులకు కేవలం పాఠ్యపుస్తకాల జ్ఞానమే కాకుండా, వారి భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్దడమే మాతృశ్రీ కళాశాల ధ్యేయమని ఇంద్రసేనారెడ్డి పేర్కొన్నారు. ఇందులో భాగంగా డిగ్రీ చదువుతో పాటు అదనంగా కింది నైపుణ్యాలపై ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు.

​కమ్యూనికేషన్, పబ్లిక్ స్పీకింగ్..

వివిధ కార్యక్రమాల్లో సమర్థవంతంగా మాట్లాడేందుకు అవసరమైన పబ్లిక్ స్పీకింగ్ మెళకువలు నేర్పడం,విద్యార్థులను ఉత్తమ నాయకులుగా తీర్చిదిద్దడం,భవిష్యత్తులో ముందంజలో ఉండేందుకు స్టడీ స్కిల్స్, కెరీర్ కౌన్సిలింగ్.సమయ పాలన, ఒత్తిడి నిర్వహణ, పై ప్రత్యేక అవగాహన కల్పించడం లాంటి కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు.

​నిరుద్యోగ యువతకు ఉచిత కుట్టు శిక్షణ..

​హన్మకొండకు చెందిన ప్రముఖ సామాజిక సంస్థ 'రోటరీ క్లబ్' సంయుక్త ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతీయువకులకు ఉచిత కుట్టు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు కరస్పాండెంట్ వెల్లడించారు. ​"ప్రతి సంవత్సరం లాగే ఈ ఏడాది కూడా 3 నెలల పాటు కళాశాల ప్రాంగణంలో ఉచిత కుట్టుమిషన్ నైపుణ్య శిక్షణ అందిస్తాం. దీంతో పాటు ప్లాస్టిక్ ఉత్పత్తుల తయారీ, యంత్రాల నిర్వహణ వంటి అంశాలపై కూడా శిక్షణ ఇచ్చి ఉపాధి అవకాశాలు కల్పిస్తాం." అని కాయిత ఇంద్రసేనారెడ్డి తెలిపారు.

సంప్రదించాల్సిన వివరాలు..

ఇంటర్మీడియట్, అంతకంటే ఎక్కువ చదివిన నిరుద్యోగ యువతీయువకులు ఈ ఉచిత శిక్షణకు అర్హులని యాజమాన్యం తెలిపింది. ఆసక్తి గల అభ్యర్థులు పూర్తి వివరాల కోసం హుజురాబాద్‌లోని మాతృశ్రీ డిగ్రీ కళాశాల కార్యాలయంలో నేరుగా సంప్రదించాలని కోరారు. ఈ సమావేశంలో కళాశాల ప్రిన్సిపాల్ వి. రామారావు, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ నరసింహారెడ్డి, అధ్యాపక బృందం పాల్గొన్నారు.

Next Story