ఖారాలో బల్లి ఘటన.. స్వీట్ షాప్‌కు తాళం వేసిన ఫుడ్ సేఫ్టీ అధికారులు

by Ratna Kumari |

రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని శ్రీ బాలాజీ స్వీట్ షాప్‌లో కొనుగోలు చేసిన ఖారాలో చనిపోయిన బల్లి కనిపించిన ఘటనపై ఫుడ్ సేఫ్టీ అధికారులు బుధవారం దుకాణాన్ని తనిఖీ చేసి తాళం వేశారు.

ఖారాలో బల్లి ఘటన.. స్వీట్ షాప్‌కు తాళం వేసిన ఫుడ్ సేఫ్టీ అధికారులు
X

దిశ ప్రతినిధి, రాజన్న సిరిసిల్ల : రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని శ్రీ బాలాజీ స్వీట్ షాప్‌లో కొనుగోలు చేసిన ఖారాలో చనిపోయిన బల్లి కనిపించిన ఘటనపై ఫుడ్ సేఫ్టీ అధికారులు బుధవారం దుకాణాన్ని తనిఖీ చేసి తాళం వేశారు. ఇప్పటికే బాధితుడి ఫిర్యాదు మేరకు షాపు యజమానిపై పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. బాధిత కుటుంబ సభ్యుల సమాచారం ప్రకారం, ఖారా తిన్న ఇద్దరు చిన్నారులు ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు దుకాణాన్ని తనిఖీ చేసేందుకు వచ్చిన ఫుడ్ సేఫ్టీ అధికారిణి అనూషను స్థానికులు నిలదీశారు. హోటళ్లు, స్వీట్ షాపులు, ఇతర ఆహార విక్రయ కేంద్రాలపై అధికారులు నిరంతర పర్యవేక్షణ చేపట్టకపోవడం వల్లే ఇలాంటి ఘటనలు పునరావృతమవుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల ఆరోగ్య భద్రత విషయంలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు. అయితే దుకాణాన్ని పూర్తిస్థాయిలో సీజ్ చేయకుండా కేవలం తాళం వేసి తాళం చెవులను అధికారులు తమ వద్ద ఉంచుకోవడంపై స్థానికులు పలు అనుమానాలు వ్యక్తం చేశారు. నిబంధనల ప్రకారం తదుపరి తీసుకునే చర్యలపై స్పష్టత ఇవ్వాలని కోరారు. ఇదిలా ఉండగా, ఈ ఘటనను వివాదాస్పదం చేయొద్దని ఫుడ్ ఇన్‌స్పెక్టర్ మీడియా ప్రతినిధులకు సూచించినట్లు సమాచారం. కాగా, దుకాణంపై తీసుకున్న చర్యలు, ఆహార నమూనాల సేకరణ, ప్రయోగశాల పరీక్షలు, తదుపరి విచారణకు సంబంధించి ఫుడ్ సేఫ్టీ శాఖ నుంచి అధికారిక వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.

Next Story