- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రైవేట్ పాఠశాలల్లో తనిఖీలు చేపట్టాలి..!
నర్సంపేట నియోజకవర్గ పరిధిలో ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించని ప్రైవేట్ పాఠశాలల్లో వెంటనే తనిఖీలు నిర్వహించి చర్యలు తీసుకోవాలని నర్సంపేట ప్రైవేట్ స్కూల్స్ పేరెంట్స్ అసోసియేషన్ డిమాండ్ చేసింది.

దిశ, నర్సంపేట : నర్సంపేట నియోజకవర్గ పరిధిలో ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించని ప్రైవేట్ పాఠశాలల్లో వెంటనే తనిఖీలు నిర్వహించి చర్యలు తీసుకోవాలని నర్సంపేట ప్రైవేట్ స్కూల్స్ పేరెంట్స్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. ఈ మేరకు ద్వారకపేటలోని ఫైర్ స్టేషన్‌లో అధికారులకు వినతిపత్రం సమర్పించింది. పట్టణంలోని పలు ప్రైవేట్ పాఠశాలల్లో అగ్నిమాపక భద్రతా ప్రమాణాలు సక్రమంగా అమలు కావడం లేదని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అత్యవసర నిష్క్రమణ ద్వారాలు, హెచ్చరిక సూచికలు, ఫైర్ అలారం వ్యవస్థలు వంటి ప్రాథమిక భద్రతా ఏర్పాట్లు పలు పాఠశాలల్లో కనిపించడం లేదని పేర్కొన్నారు. ప్రమాదం సంభవించిన సమయంలో విద్యార్థులు, సిబ్బంది ఎలా స్పందించాలనే అంశంపై మాక్ డ్రిల్స్ కూడా నిర్వహించడం లేదని ఆరోపించారు. ఇరుకైన తరగతి గదులు, తగిన భద్రతా చర్యల లేమి వల్ల అగ్నిప్రమాదం సంభవిస్తే తీవ్ర పరిణామాలు చోటుచేసుకునే అవకాశం ఉందని పేర్కొంటూ నర్సంపేట డివిజన్ పరిధిలోని అన్ని ప్రైవేట్ పాఠశాలల్లో విస్తృత తనిఖీలు నిర్వహించాలని, నిబంధనలు ఉల్లంఘిస్తున్న విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలని కోరారు.
సామర్థ్యానికి మించి బస్సుల్లో విద్యార్థుల తరలింపు..
ప్రైవేట్ పాఠశాలలు విద్యార్థులను సామర్థ్యానికి మించి బస్సులు, ఇతర వాహనాల్లో తరలిస్తున్నాయని పేరెంట్స్ అసోసియేషన్ ఆరోపించింది. పలు స్కూల్ వాహనాలు ఫిట్‌నెస్ సర్టిఫికెట్, బీమా తదితర అవసరమైన పత్రాలు లేకుండానే నడుస్తున్నాయని పేర్కొంది. అనుభవం, అర్హత లేని డ్రైవర్లతో వాహనాలు నడపించడం కూడా విద్యార్థుల భద్రతకు ముప్పుగా మారిందని ఆందోళన వ్యక్తం చేసింది.
వరంగల్ రోడ్డుపై ట్రాఫిక్ సమస్య..
వరంగల్ రోడ్డులోని అక్షర స్కూల్ సమీపంలో సాయంత్రం వేళల్లో స్కూల్ బస్సులను ప్రధాన రోడ్డుపైనే నిలిపివేయడంతో తీవ్ర ట్రాఫిక్ సమస్య ఏర్పడుతోందని తెలిపారు. ఈ కారణంగా ఇతర వాహనదారులు ప్రమాదాలకు గురైన ఘటనలు కూడా చోటుచేసుకున్నాయని పేర్కొన్నారు. ప్రధాన రోడ్డుపై బస్సుల పార్కింగ్‌ను అరికట్టాలని, విద్యార్థులు సురక్షితంగా రోడ్డు దాటేందుకు జీబ్రా క్రాసింగ్‌లు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమస్యలపై తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతూ నర్సంపేట పోలీస్ స్టేషన్‌లో కూడా వినతిపత్రం అందజేశారు. పాఠశాలల భద్రతా ప్రమాణాలు, రవాణా ఏర్పాట్లపై సంబంధిత శాఖలు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించి విద్యార్థుల భద్రతను నిర్ధారించాలని పేరెంట్స్ అసోసియేషన్ విజ్ఞప్తి చేసింది.






