- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ముగిసిన తెలంగాణ ‘ఈ కేబినెట్’ భేటీ.. మూసీ ప్రాజెక్టు ఫేజ్-1కు ఆమోదం
సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ముగిసిన తెలంగాణ 'ఈ-కేబినెట్' భేటీలో అత్యంత కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ సచివాలయం వేదికగా సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన దాదాపు 3 గంటల పాటు కొనసాగిన ‘ఈ కేబినెట్’ (E-Cabinet) భేటీ ముగిసింది. ఈ సమావేశంలో ప్రధానంగా విద్యాశాఖ, సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన పలు కీలకమైన అంశాలపై మంత్రి మండలి విస్తృతంగా చర్చించి, కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. ముందుగా విద్యా రంగానికి సంబంధించి రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో ఇకపై విద్యార్థులతో పాటు విధులు నిర్వహించే ఉపాధ్యాయులు, లెక్చరర్లు, బోధనేతర (నాన్-టీచింగ్) సిబ్బంది అందరికీ కూడా ఉచితంగా అల్పాహారం (Breakfast), మధ్యాహ్న భోజనం (Mid-day Meals) అందించాలని మంత్రివర్గం నిర్ణయించింది.
రాష్ట్రంలో ‘వీబీజీ రామ్‌జీ’ పథకం అమలు..
ఇక కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ‘వీబీజీ రామ్‌జీ’ పథకాన్ని రాష్ట్రంలో అమలు చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. అయితే, ఈ పథకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న కొన్ని అభ్యంతరాలపై దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టును ఆశ్రయించాలని, దీనిపై న్యాయ పోరాటం చేయాలని కేబినెట్ ఏకగ్రీవంగా తీర్మానించింది. ఈ మేరకు కేబినెట్ సబ్ కమిటీ ఇచ్చిన సిఫార్సులకు ఆమోద ముద్ర వేసింది. ఇక హైదరాబాద్ నగర పరిధిలో ప్రతిష్టాత్మకంగా చేపట్ట తలపెట్టిన ‘మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్టు’ (Musi Riverfront Development Project) ఫేజ్-1 పనులకు కేబినెట్ అధికారికంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ ప్రాజెక్టు ద్వారా మూసీ పరివాహక ప్రాంతాల అభివృద్ధి, సుందరీకరణ పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించింది.
‘గాంధీ సరోవర్ ప్రాజెక్ట్’కు ఆమోదం..
అదేవిధంగా టిమ్స్, వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల్లో మొత్తం 6,278 పోస్టుల భర్తీకి ఆమోదం తెలిపినట్లుగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మీడియాకు తెలిపారు. నగరంలో కేంద్ర రక్షణ శాఖ భూములు ఇచ్చేందుకు అంగీకరించిన తరుణంలో ‘గాంధీ సరోవర్ ప్రాజెక్ట్’కు కేబినెట్ ఆమోదం ముద్ర వేసిందని తెలిపారు. ఇక 21 కి.మీ మేర మూసీ సుందరీకరణకు ఆమోదం తెలిపామని.. ఇందులో ఫేజ్-1 పనులకు గాను రూ.7,345 కోట్ల నిధులు కేటాయించాలని నిర్ణయించామని వెల్లడించారు. రాష్ట్రంలోని గోదాములు, విద్యాలయాలు, సంస్థల నిర్మాణం కోసం స్థలాల కేటాయింపు, 12వ తరగతి వరకు విద్యార్థులకు అల్పాహారంతో పాటు పాలు, మధ్యహ్నా భోజనం ఇవ్వాలని కేబినెట్ నిర్ణయం తీసుకుందని మంత్రి పొంగులేటి మీడియాకు వివరించారు.






