- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏజెన్సీ రైతులను ముంచుతున్న సహకార సంఘాల సబ్‌సెంటర్లా..?
ఆరుగాలం శ్రమించి పంటలు పండిస్తున్న రైతులు ప్రకృతి వైపరీత్యాలు, పెరుగుతున్న సాగు ఖర్చులు, నకిలీ విత్తనాలు, ఎరువులతో ఇప్పటికే ఇబ్బందులు ఎదుర్కొంటుండగా, ఇప్పుడు సహకార సంఘాల సబ్‌సెంటర్లలో యూరియా విక్రయాల్లో అవకతవకలు జరుగుతున్నాయంటూ ఏజెన్సీ రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

దిశ, బయ్యారం : ఆరుగాలం శ్రమించి పంటలు పండిస్తున్న రైతులు ప్రకృతి వైపరీత్యాలు, పెరుగుతున్న సాగు ఖర్చులు, నకిలీ విత్తనాలు, ఎరువులతో ఇప్పటికే ఇబ్బందులు ఎదుర్కొంటుండగా, ఇప్పుడు సహకార సంఘాల సబ్‌సెంటర్లలో యూరియా విక్రయాల్లో అవకతవకలు జరుగుతున్నాయంటూ ఏజెన్సీ రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బయ్యారం రైతు సహకార సంఘం ఆధ్వర్యంలో రైతులకు ఎరువులు, విత్తనాలు గ్రామాలకే అందుబాటులో ఉండేలా కంబాలపల్లి, లక్ష్మీపురం తదితర ప్రాంతాల్లో ఐదు సబ్‌సెంటర్లు ఏర్పాటు చేశారు. అయితే ఈ కేంద్రాల్లో ప్రభుత్వం నిర్ణయించిన ధర కంటే యూరియా బస్తాకు రూ.10 నుంచి రూ.20 వరకు అదనంగా వసూలు చేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. రైతుల ఆరోపణల ప్రకారం, బిల్లులో ఒక ధర నమోదు చేసి, నగదు మాత్రం అంతకంటే ఎక్కువగా వసూలు చేస్తున్నారని, చాలామంది రైతులకు బిల్లులు కూడా ఇవ్వడం లేదని పేర్కొంటున్నారు. సబ్‌సెంటర్ల వద్ద రైతులకు ఇవ్వాల్సిన బిల్లులు బయట పడివుండటం గమనార్హమని తెలిపారు. సబ్‌సెంటర్ల నిర్వహణపై సంబంధిత అధికారులు పర్యవేక్షణ చేపట్టకపోవడంతో కొందరు సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. ఈ అంశంపై జిల్లా సహకార శాఖ అధికారులు సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే యూరియా అందేలా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.
బిల్లులో ఒక రేటు.. నగదు మరో రేటు..
నారాయణపురం సర్పంచ్ బాలకృష్ణ మాట్లాడుతూ.. కంబాలపల్లి సబ్‌సెంటర్‌లో రెండు యూరియా బస్తాలకు నగదుగా రూ.570 వసూలు చేసి, బిల్లులో మాత్రం రూ.532 మాత్రమే నమోదు చేశారని ఆరోపించారు. బిల్లు రైతుకు కాకుండా హమాలీలకు ఇచ్చి యూరియా బస్తాలు అందించారని తెలిపారు. సుద్ధరేవుకు చెందిన రైతు పూనెం చిన్న లింగయ్య మాట్లాడుతూ, ఐదు యూరియా బస్తాలకు రూ.1,425 నగదు తీసుకుని, రూ.1,330కే బిల్లు ఇచ్చారని ఆరోపించారు. తాము చదువులేని రైతులమనే కారణంతో ఇలా మోసం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
సీఈఓ వివరణ..
ఈ ఆరోపణలపై బయ్యారం రైతు సహకార సంఘం సీఈఓ అనూష స్పందిస్తూ, ప్రభుత్వం నిర్ణయించిన ధరల కంటే అధికంగా యూరియా విక్రయిస్తున్నట్లు నిర్ధారణ అయితే జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. ఇప్పటివరకు ఏ రైతు కూడా ఈ అంశాన్ని అధికారికంగా తమ దృష్టికి తీసుకురాలేదని, ఫిర్యాదులు అందితే విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.






