బూందీఖారాలో బల్లి కలకలం

by Ratna Kumari |

జిల్లాలో ఇటీవల పానీపూరీ ఘటన మరువక ముందే సిరిసిల్ల పట్టణంలో మరో ఆహార భద్రతా ఘటన కలకలం రేపింది.

బూందీఖారాలో బల్లి కలకలం
X

దిశ ప్రతినిధి, రాజన్న సిరిసిల్ల: జిల్లాలో ఇటీవల పానీపూరీ ఘటన మరువక ముందే సిరిసిల్ల పట్టణంలో మరో ఆహార భద్రతా ఘటన కలకలం రేపింది. పట్టణంలోని శ్రీ బాలాజీ ఆనంద్ మిఠాయి బండార్‌లో కొనుగోలు చేసిన బూందీఖారా (మిక్చర్)లో చనిపోయిన బల్లి కనిపించిందని బాధితుడు చందు ఆరోపించారు. బాధితుడి కథనం ప్రకారం, కుటుంబ సభ్యులతో కలిసి తినేందుకు కొనుగోలు చేసిన మిక్చర్‌ను ఇంటికి తీసుకెళ్లి తెరిచి చూడగా అందులో చనిపోయిన బల్లి కనిపించిందన్నారు. అప్పటికే తన పిల్లలు కొంతమేర స్నాక్స్ తిన్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని స్వీట్ హౌస్ యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లగా, బాధ్యతాయుతంగా స్పందించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడమే కాకుండా తనతో దురుసుగా మాట్లాడారని ఆరోపించారు. తన పిల్లలకు ఏవైనా ఆరోగ్య సమస్యలు తలెత్తితే బాధ్యత ఎవరిదని ప్రశ్నించారు. సంబంధిత ఫుడ్ సేఫ్టీ అధికారులు వెంటనే స్పందించి స్వీట్ హౌస్‌పై విచారణ జరిపి, నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని బాధితుడు కోరారు. ఇటీవల సిరిసిల్లలో పానీపూరీ తిని పలువురు అస్వస్థతకు గురైన ఘటన జరిగి పది రోజులు కూడా గడవకముందే మరోసారి ఆహార పదార్థంలో బల్లి కనిపించడం స్థానికుల్లో ఆందోళనకు గురిచేస్తోంది. వరుసగా చోటుచేసుకుంటున్న ఇలాంటి ఘటనలు జిల్లాలో ఆహార భద్రతా ప్రమాణాల అమలుపై సందేహాలు రేకెత్తిస్తున్నాయి. ఫుడ్ సేఫ్టీ శాఖ తనిఖీలను మరింత కట్టుదిట్టం చేసి, ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పట్టణవాసులు కోరుతున్నారు.

Next Story