- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
లిక్కర్ స్కామ్ క్లీన్ చిట్ : సీబీఐ వైఫల్యమా? రాజకీయ ఎత్తుగడనా?
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కేజ్రీవాల్, కల్వకుంట్ల కవితలకు క్లీన్ చిట్ లభించడంతో దేశ రాజకీయాల్లో కీలక మలుపు చోటు చేసుకుంది.

దిశ, వెబ్ డెస్క్ : ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో రౌస్ అవెన్యూ కోర్టు ఇచ్చిన తీర్పు దేశ రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. ఏళ్ల తరబడి విచారణ, కీలక నేతల అరెస్టులు, నెలల తరబడి జైలు శిక్షల తర్వాత "క్లీన్ చిట్" రావడం అనేది జాతీయ దర్యాప్తు సంస్థల విశ్వసనీయతపై అనేక ప్రశ్నలను లేవనెత్తుతోంది. అంతేకాదు కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ తమ రాజకీయ వ్యూహాలకు, ఎత్తుగడలకు దర్యాప్తు సంస్థలను పావులాగా వాడుకుంటున్నాయనే ఆరోపణలకు బలం చేకూరుతోంది. ఈకేసులో నిందితులకు జగరాల్సిన నష్టం జరిగినప్పటికీ, విక్టిమ్ కార్డుతో ప్రజల్లోకి వెళ్లే అవకాశాలు ఉన్నాయి. అలాగే దర్యాప్తు సంస్థల మీద, అనుచిత వ్యాఖ్యలు చేసిన నేతల మీద పరువు నష్టం దావాలు వేస్తారని అంచనా వేస్తున్నారు.
సీబీఐ, ఈడీల వైఫల్యం
ఈ కేసులో మొదటి నుంచి ప్రధానంగా వినిపించిన ఆరోపణ "రూ. 100 కోట్ల ముడుపులు". అయితే, ఇంత భారీ మొత్తంలో నగదు ఒక చోట నుండి మరొక చోటుకు ఎలా పంపించారు అనే "మనీ ట్రైల్" (Money Trail) ను నిరూపించడంలో దర్యాప్తు సంస్థలు పూర్తిగా విఫలమయ్యాయి. సీబీఐ, ఈడీలు సమర్పించిన చార్జిషీట్లు ఎక్కువగా అప్రూవర్లుగా మారిన నిందితుల వాంగ్మూలాలపైనే ఆధారపడ్డాయి. న్యాయశాస్త్రం ప్రకారం.. ఒక నిందితుడు తన శిక్ష తగ్గించుకోవడానికి ఇచ్చే సాక్ష్యం (Accomplice Evidence) అత్యంత బలహీనమైనది. దానిని బలపరిచే భౌతిక ఆధారాలు, అంటే రికవరీ అయిన నగదు, బ్యాంక్ లావాదేవీల పత్రాలు, ఇతరుల ధృవీకరణ ఉంటేనే ఆ సాక్ష్యానికి బలం ఉంటుంది. ఈకేసులో అలాంటి బలమైన ఆధారాలు ఏవీ లేకపోవడంతో ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు సహజంగానే "బెనిఫిట్ ఆఫ్ డౌట్" కింద నిందితులను నిర్దోషులుగా పరిగణిస్తుంది. నిందితులు సుమారు 170 ఫోన్లను ధ్వంసం చేశారని దర్యాప్తు సంస్థలు మరో ఆరోపణ చేసినప్పటికీ.. ఆ ధ్వంసం వెనుక ఉన్న ఉద్దేశం నేరపూరితమైనదని గాని ఆ ఫోన్లలోని సమాచారం నేరానికి సంబంధించిందని నిరూపించే శాస్త్రీయ ఆధారాలను దర్యాప్తు సంస్థలు కోర్టు ముందు ఉంచలేకపోయాయి. ఇదే ఈ కేసు పూర్తిగా నీరుగారిపోయేలా చేసిన కీలక అంశం.
రాజకీయ ఎత్తుగడలు.. గెలుపు ఓటముల లెక్కలు
ఈ కేసు విచారణ సాగిన తీరును గమనిస్తే, దీని వెనుక ఒక పకడ్బందీ రాజకీయ వ్యూహం ఉందనే వాదన బలంగా వినిపిస్తోంది. ఢిల్లీ, తెలంగాణ రాజకీయాల్లో ఈ కేసు పెను మార్పులకు కారణమైంది. ఈ కేసు ఫలితంగా రెండు రాష్ట్రాల్లో రెండు పార్టీలు అధికారాన్ని కోల్పోవాల్సి వచ్చింది అనేది సత్యం.
ప్రత్యామ్నాయ శక్తులను దెబ్బతీయడం : ఢిల్లీలో బీజేపీకి గట్టి పోటీ ఇస్తున్న 'ఆమ్ ఆద్మీ పార్టీ' (AAP) ఇమేజ్‌ను దెబ్బతీయడమే ప్రధాన లక్ష్యంగా ఈ కేసు నడిచిందని ముందునుంచి ఈ వ్యవహారాన్ని పరిశీలిస్తున్న ఎవరికైనా అర్థం అవుతుంది. "అవినీతి వ్యతిరేక పార్టీ" అని చెప్పుకునే ఆప్ నేతలే అవినీతికి పాల్పడ్డారని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఈ కేసు సక్సెస్ అయింది. దీనివల్ల ఢిల్లీ ఎన్నికల్లో ఆప్ భారీగా నష్టపోయింది. అవినీతి నిర్మూలన నినాదంతో అధికారంలోకి వచ్చి జాతీయ పార్టీగా ఎదుగుతున్న క్రమంలో ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) ఇమేజ్‌ను ఈ కేసు తీవ్రంగా దెబ్బతీసింది. పార్టీ అగ్రనేతలు జైలుకు వెళ్లడం వల్ల క్షేత్రస్థాయిలో పార్టీ కార్యకర్తలు నైతిక స్థైర్యాన్ని కోల్పోవడమే కాకుండా, ప్రజల్లో పార్టీ పట్ల నమ్మకం సడలింది. ఇది ఎన్నికల్లో ఆప్ ఓటమికి ప్రధాన కారణమైంది.
తెలంగాణలో రాజకీయ మార్పు: తెలంగాణలో బీఆర్ఎస్ (BRS) గ్రాఫ్‌ను తగ్గించడానికి కవిత అరెస్టు ఒక సాధనంగా మారింది. సెంటిమెంట్ తగ్గిస్తూ "అవినీతి" అంశాన్ని హైలైట్ చేయడం ద్వారా కాంగ్రెస్, బీజేపీ లబ్ధి పొందాయనడంలో అతిశయోక్తి లేదు. "బీఆర్ఎస్ నేతలు అవినీతిలో కూరుకుపోయారు" అనే ప్రచారాన్ని ఇంటింటికీ తీసుకెళ్లడంలో ఈ కేసు ఒక శక్తివంతమైన ఆయుధంగా పనిచేసింది. ఫలితంగా ఓటర్లు మార్పు వైపు మొగ్గు చూపడానికి కారణం అయింది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన పార్టీగా ప్రజల్లో బలంగా ఉన్న సెంటిమెంటును పూర్తిగా తుడిచేయడానికి ప్రత్యర్థి పార్టీలు ఈ కేసును సమర్థవంతంగా వాడుకున్నాయి.
బ్రాండ్ ఇమేజ్ డ్యామేజ్: ఏళ్ల తరబడి విచారణ సాగడం వల్ల, చివరకు కోర్టు నిర్దోషులని తేల్చినా, అప్పటికే జరగాల్సిన రాజకీయ నష్టం (Reputational Damage) జరిగిపోయింది. "జైలుకు వెళ్లారు అంటే ఏదో తప్పు చేసే ఉంటారు" అనే భావనను ఓటర్లలో నాటడమే అసలు వ్యూహంగా కనిపిస్తోంది. ప్రస్తుతం క్లీన్ చిట్ లభించినప్పటికీ.. ఒక రాజకీయ నేత నెలల తరబడి జైల్లో ఉండటం వల్ల, ప్రజల మనస్సుల్లో ఆ నేతపై ఒక విధమైన సందేహం నాటుకుపోతుంది. కోర్టు నిర్దోషిగా తేల్చినా, రాజకీయ ప్రత్యర్థులు "సాంకేతిక కారణాల వల్ల తప్పించుకున్నారు" అనే వాదనను కొనసాగిస్తారు. అయితే, ఈ తీర్పు ఆప్, బీఆర్ఎస్ పార్టీలకు ఒక కొత్త ఊపిరిని ఇచ్చే అవకాశం ఉంది. "మేము నిప్పులాంటి వాళ్లమని కోర్టు నిరూపించింది, మమ్మల్ని కావాలనే ఇబ్బంది పెట్టారు" అని వారు ప్రజల్లోకి వెళ్లి సానుభూతి పొందే ప్రయత్నం చేస్తారు.
దర్యాప్తు సంస్థల విశ్వసనీయతపై మచ్చ
ఈ తీర్పు జాతీయ దర్యాప్తు సంస్థలైన సీబీఐ, ఈడీల స్వయంప్రతిపత్తిపై పెద్ద చర్చకు దారితీసింది. ఆధారాలు లేకుండా ముఖ్యమంత్రుల స్థాయి వ్యక్తులను అరెస్టు చేయడం, నెలల తరబడి జైల్లో ఉంచడం అనేది రాజ్యాంగం కల్పించిన వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించడమేనని విమర్శలు వస్తున్నాయి. కేవలం రాజకీయ ప్రత్యర్థులను అణచివేయడానికే అధికార పార్టీ నేతలు ఈ సంస్థలను వాడుకుంటున్నారనే విపక్షాల ఆరోపణలకు ఈ క్లీన్ చిట్ మరింత బలాన్ని చేకూర్చింది. భవిష్యత్తులో ఇలాంటి హై ప్రొఫైల్ కేసుల విషయంలో దర్యాప్తు సంస్థలు మరింత బాధ్యతాయుతంగా, రాజకీయ ఒత్తిళ్లకు తావులేకుండా పనిచేయాల్సిన అవసరాన్ని రౌస్ అవెన్యూ కోర్ట్ తీర్పు గుర్తు చేస్తోంది. ఈ వ్యవహారంపై ప్రత్యర్థులు అధికార పార్టీని ప్రజల్లో ఎండగట్టే అవకాశాలున్నాయి.
పరువు నష్టం దావా వేసే అవకాశం ఉందా?
ఈకేసు దేశవ్యాప్తంగా సంచలనం రేపడమే కాకుండా ఆయా పార్టీల తలరాతను మార్చింది కాబట్టి.. జైలుకు వెళ్లొచ్చిన కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, కవిత సహా ఇతర నేతలు దర్యాప్తు సంస్థల మీద పరువు నష్టం దావా వేసే అవకాశం ఉంది. అయితే, మన దేశ చట్టాల ప్రకారం దర్యాప్తు సంస్థలైన సీబీఐ, ఈడీలపై ఇలాంటి దావాలు గెలవడం అంత సులభం కాదు. ఎందుకంటే తాము ప్రాథమిక సమాచారంగా అరెస్ట్ చేశామని కోర్టులో వాదించే అవకాశం ఉంది. ఇక డైరెక్ట్ గా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ మీద కాకుండా తమపై తమపై అనుచిత వ్యాఖ్యలు చేసిన రాజకీయ ప్రత్యర్థులపై వీరంతా పరువు నష్టం దావా వేయవచ్చు. దీని ద్వారా తాము నిర్దోషులమని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్ళే అవకాశం ఉంది. ఒకవేళ సీబీఐ కావాలనే, ఎటువంటి ఆధారాలు లేవని తెలిసి కూడా రాజకీయ ఒత్తిళ్లతో తమను ఇబ్బంది పెట్టిందని వారు నిరూపించగలిగితే, 'మెలీషియస్ ప్రాసిక్యూషన్' కింద పరిహారం కోరవచ్చు. కానీ, కోర్టులో దర్యాప్తు సంస్థల దురుద్దేశాన్ని నిరూపించడం అత్యంత కఠినమైన ప్రక్రియ అని న్యాయ నిపుణులు చెబుతున్నారు.
కేజ్రీవాల్, కవితల నెక్స్ట్ స్టెప్ ఏంటి?
ఈకేసులో భారీగా డ్యామేజ్ కాబడిన ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్, జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత విక్టిమ్ కార్డు ప్లే చేసే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. "ప్రభుత్వం మమ్మల్ని కావాలనే టార్గెట్ చేసింది, సాక్ష్యాలు లేకపోయినా జైల్లో పెట్టింది" అని ప్రజల్లో సానుభూతి పొందేందుకు ఆప్, బీఆర్ఎస్ ప్రయత్నిస్తాయి. రాబోయే ఎన్నికల్లో ఇది వారికి ప్రధాన అస్త్రం అవుతుంది. మరోవైపు ఆధారాలు లేకుండా ఇన్ని రోజులు కీలక నేతలను జైల్లో ఉంచడంపై పార్లమెంటులో పెద్ద ఎత్తున చర్చ జరగొచ్చు. దర్యాప్తు సంస్థల అధికారాలకు కత్తెర వేయాలని విపక్షాలు డిమాండ్ చేస్తాయి. ఈ విజయంతో ఆప్, బీఆర్ఎస్ నేతలు, కవిత శ్రేణులు మరింత ఉత్సాహంతో పని చేస్తారు. ఇతర విపక్ష పార్టీలు కూడా వీరితో చేతులు కలిపి కేంద్రంపై ఒత్తిడి పెంచే ఛాన్స్ లేకపోలేదు.
సీబీఐ సుప్రీంకోర్టుకు వెళ్తుందా?
సాధారణంగా ఇలాంటి హై-ప్రొఫైల్ కేసుల్లో దిగువ కోర్టు (Trial Court) క్లీన్ చిట్ ఇస్తే, సీబీఐ, ఈడీలు హైకోర్టు లేదా సుప్రీంకోర్టులో అప్పీల్ చేసే అవకాశం 99% ఉంటుంది. కాబట్టి, ఈ ఊరట తాత్కాలికమా శాశ్వతమా అనేది పై కోర్టుల తీర్పుపై ఆధారపడి ఉంటుంది. ఇక ఈకేసులో ప్రజలు కొందరు న్యాయం గెలిచిందని భావిస్తుండగా, మరికొందరు వ్యవస్థలోని లొసుగుల వల్ల నిందితులు బయటపడ్డారని నమ్ముతున్నారు.






