- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఉత్తర తెలంగాణలో ముగ్గురు కలెక్టర్లపై నేతల ఫిర్యాదులు
ఉత్తర తెలంగాణ కలెక్టర్లపై ఫిర్యాదుల వెల్లువ! ప్రోటోకాల్ ఉల్లంఘనలు, నిర్లక్ష్యపు తీరుపై సీఎం రేవంత్ రెడ్డికి ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ నేతలు.

దిశ, తెలంగాణ బ్యూరో : బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న సివిల్ సర్వెంట్స్ విధుల్లో నిష్పక్షపాతంగా వ్యవహరించాలి. కానీ ఉత్తర తెలంగాణ జిల్లాల్లో పనిచేస్తున్న పలువురు కలెక్టర్ల పనితీరు, వ్యవహార శైలిపై విమర్శలు వస్తున్నాయి. వివాదాలు, సమస్యలను పరిష్కరించాల్సిన జిల్లా ఉన్నతాధికారులు వివాదాల్లో చిక్కుకోవడం, సమస్యలను సృష్టిస్తున్నారనే ఆరోపణలూ ఉన్నాయి. కొందరు అధికారులు ‘తమ మాటే శాసనం, నా రూటే సపరేటు’ అనే తీరుగా వ్యవహరిస్తుండటంతో స్థానికంగా ఇబ్బందులు తలెత్తున్నాయని ప్రచారం జరుగుతున్నది. దీంతో సదరు అధికారులను జిల్లాల నుంచి తప్పించి.. కొత్తవారిని అపాయింట్ చేయాలని బాధిత జిల్లాలకు చెందిన పలువురు నేతలు సీఎం రేవంత్ రెడ్డికి ఫిర్యాదు చేసినట్లు తెలిసింది.
వివాదాలకు కేరాఫ్ ఆ కలెక్టర్
ఉమ్మడి వరంగల్ కు చెందిన ఓ జిల్లా కలెక్టర్ కు నిజాయితీపరుడిగా పేరుంది. కానీ ఆయన వ్యవహారశైలితో వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా మారినట్టు విమర్శలు వస్తున్నాయి. కలెక్టర్ గా బాధ్యతలు తీసుకున్న కొద్దిరోజులకే కలెక్టరేట్ ఎదుట ‘ఇందిరా మహిళా శక్తి స్కీం’ కింద చిరు వ్యాపారాలు చేసుకుంటున్న ఇద్దరు దళిత మహిళలకు చెందిన స్టాల్స్ ను తొలగించే ప్రయత్నం చేయడం వివాదానికి దారితీసింది. గతంలో పనిచేసిన కలెక్టర్ సాయం చేస్తే.. కొత్త కలెక్టర్ జీవితాలను రోడ్డుపాలు చేస్తున్నారని బాధితులు న్యాయం కోసం కోర్టుకు వెళ్లారు.
కింద స్థాయి ఉద్యోగుల పట్ల ఆయన వ్యవహరించే తీరు చాలా చులకనగా ఉంటుందని, ఆయన చాంబర్ లోకి వెళ్తే నిలబెట్టి మాట్లాడతారనే ఆరోపణలు ఉన్నాయి. జిల్లా వైద్యాధికారి పవర్స్‌ను లాక్కొని, డాక్టర్లకు సెలవులు మంజూరు చేయడం, ఖాళీగా ఉన్న జిల్లా విద్యాధికారి పోస్టులో తనకు తానే ఇన్ చార్జిగా ప్రకటించుకోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల ఓ ప్రభుత్వ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే షెడ్యూల్ ప్రకారం వస్తే కలెక్టర్ మాత్రం గంట ఆలస్యంగా రావడంపై సదరు సీనియర్ ఎమ్మెల్యే కోపంగా ఉన్నట్లు తెలిసింది. గతంలో ఓ జిల్లాలో పనిచేసిన సమయంలో ప్రొటోకాల్ వివాదంలో ఇరుక్కోవడంతో అక్కడి నుంచి తప్పించారు.
కలెక్టర్‌ను కలవడం కష్టం
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందిన ఓ కలెక్టర్ పనితీరుపై ఆ జిల్లాకు చెందిన అధికార పార్టీ లీడర్లు గుర్రుగా ఉన్నారు. వివిధ పనుల కోసం కలెక్టర్ వద్దకు వెళ్తే సరిగ్గా స్పందించడం లేదని, తాము ఇచ్చిన దరఖాస్తులను సైతం చదవకుండానే పక్కన పెడతారని ఫిర్యాదులు ఉన్నాయి. ఆ జిల్లాకు చెందిన నియోజకవర్గం ఇన్‌చార్జ్‌లు సదరు కలెక్టర్ ను మార్చాలని ఏకంగా సీఎంను కలిసి ఫిర్యాదు చేశారని ప్రచారం నడుస్తున్నది. ‘పనుల కోసం వెళ్తే గంటలకొద్దీ కూర్చోపెడతారు. ఆ సమయంలో బిజీగా ఉంటే మమ్మల్ని వెయిట్ చేయించినా పట్టించుకోం. కానీ ఖాళీగా కూర్చొని ఫోన్ లో చాటింగ్ చేస్తూ కాలక్షేపం చేస్తుంటారు.’ అని సీఎం రేవంత్ రెడ్డికి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. అయితే సదరు కలెక్టర్ బీఆర్ఎస్ పార్టీకి సపోర్టుగా ఉంటారని, అందుకే ఆ పార్టీ లీడర్లు, ఎమ్మెల్యేలకు అడిగిన వెంటనే ఆపాయింట్మెంట్ ఇస్తుంటారని కాంగ్రెస్ లీడర్లు ఆరోపిస్తున్నారు.
ఇద్దరి మధ్య ఆధిపత్యపోరు
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఓ కలెక్టర్, ఎస్పీ మధ్య ఆధిపత్య పోరు నడుస్తున్నట్టు ప్రచారం జరుగుతున్నది. ఇద్దరు కీలక అధికారుల మధ్య కోఆర్డినేషన్ లేకపోవడంతో ఆ ప్రభావం పడి చిన్న చిన్న సమస్యలు సైతం పెద్దగా మారుతున్నాయని జిల్లాకు చెందిన నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ జిల్లాలో రాష్ట్రానికి తలమానికంగా ఉన్న ఓ ఉన్నత విద్యాలయం ఉంది. కానీ ఆ ఇద్దరు అధికారుల తీరుతో ఆ విద్యాసంస్థలో వివాదాలు తలెత్తున్నాయని విమర్శలు ఉన్నాయి. కానీ జిల్లాకు చెందిన ఓ ఆఫీసర్.. ఓ వర్గానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అందుకోసమే ఆ ఇద్దరు అధికారులను అక్కడి నుంచి తప్పించి.. కొత్త వారికి బాధ్యతలు అప్పగించాలని జిల్లా నేతలు ప్రభుత్వానికి ఫిర్యాదు చేసినట్లు తెలిసింది.






