కోహెడ రైతులకు న్యాయం చేయకుండా మార్కెట్ శంకుస్థాపన సరికాదు

by Batti.Sumithra |   (  Updated:2026-06-06 10:28:31  IST  )

కోహెడ రైతులకు న్యాయం చేయకుండా మార్కెట్ శంకుస్థాపన సరికాదనీ, సమీకృత ఫ్రూట్ మార్కెట్ స్థల మార్పు పై మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

కోహెడ రైతులకు న్యాయం చేయకుండా మార్కెట్ శంకుస్థాపన సరికాదు
X

దిశ, తుర్కయంజాల్ : కోహెడ రైతులకు న్యాయం చేయకుండా మార్కెట్ శంకుస్థాపన సరికాదనీ, సమీకృత ఫ్రూట్ మార్కెట్ స్థల మార్పు పై మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. శనివారం ఆదిభట్ల సర్కిల్ పరిధిలోని రొక్కం సత్తిరెడ్డి గార్డెన్ లో బీఆర్ఎస్ నాయకులు సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో సర్వేనంబర్లు 507, 548లో అంతర్జాతీయ ఫ్రూట్ మార్కెట్ ఏర్పాటు చేయాలని నిర్ణయించగా, ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం సర్వేనంబర్ 167/1లో మార్కెట్ నిర్మాణానికి శంకుస్థాపన చేయడం సరైన నిర్ణయం కాదని విమర్శించారు. 170 ఎకరాల విస్తీర్ణంలో రెవెన్యూ, ఇంజనీరింగ్, మార్కెటింగ్ శాఖల అధికారులు ఎంతో కష్టపడి భూమిని చదును చేశారని తెలిపారు. అయితే రెండున్నర సంవత్సరాలుగా అధికారంలో ఉన్న ప్రభుత్వం ఎలాంటి సమగ్ర అధ్యయనం లేకుండానే మార్కెట్‌ను మరోప్రాంతానికి తరలిస్తోందని ఆరోపించారు.

ఓఆర్ఆర్‌కు సమీపంలో ఉన్న సర్వే నంబర్ 167/1లో చెట్లు, గుట్టలు అధికంగా ఉండటంతో మార్కెట్ నిర్మాణానికి అనుకూల పరిస్థితులు లేవని పేర్కొన్నారు. ఇప్పటికే అన్ని విధాలుగా అనుకూలమైన భూమి అందుబాటులో ఉండగా దానిని వదిలిపెట్టి ఎత్తైన ప్రాంతాన్ని ఎంపిక చేయడం వల్ల భవిష్యత్తులో భారీ వాహనాల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందన్నారు. సర్వే నంబర్ 167/1లో 120 మంది రైతులు తరతరాలుగా సాగుచేస్తున్న భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటోందని, ఇప్పటి వరకు రైతులకు తగిన నష్టపరిహారం కూడా చెల్లించలేదని ఆరోపించారు. రైతుల పై కేసులు నమోదు చేయడం, నాయకులను అరెస్టు చేయడం ప్రజాస్వామ్య విరుద్ధమని విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపనకు ముందు ఇంటెలిజెన్స్, పరిపాలనా వర్గాల నుంచి పూర్తి వాస్తవాలను తెలుసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో అనేక శంకుస్థాపనలు జరుగుతున్నప్పటికీ పనుల పురోగతి కనిపించడం లేదని వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వ హయాంలో ప్రతిపాదించిన మార్కెట్ కోసం డీపీఆర్ సిద్ధం చేసి రూ.300 కోట్లు మార్కెట్ ఖాతాలో జమ చేసినట్లు తెలిపారు. అలాగే 507, 548 సర్వేనంబర్లలోని రైతులకు రూ.17.25 కోట్ల పరిహారం చెల్లించిన తర్వాతే పనులు ప్రారంభించామని, ఎన్నికల కోడ్ కారణంగా పనులు నిలిచిపోయాయని పేర్కొన్నారు.

రైతులకు తక్షణమే పూర్తినష్టపరిహారం చెల్లించిన తర్వాత మాత్రమే మార్కెట్ నిర్మాణ పనులు చేపట్టాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా కోల్డ్ స్టోరేజీలు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల పేరుతో భూములను ఇతరులకు కేటాయించే ప్రయత్నాలు జరుగుతున్నాయనే అనుమానాలను వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం మార్కెట్‌ను తిరిగి సర్వేనంబర్లు 507, 548లోనే ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు వంగేటి లక్ష్మారెడ్డి లక్ష్మారెడ్డి, కళ్యాణ్ నాయక్, సంజీవరెడ్డి, ఆనంద్ రెడ్డి, దశరథ, గౌతమ్ రెడ్డి, మల్లేష్, చెన్నయ్య, సంపదీశ్వర్, మోహన్ గుప్తా, మేతరి అశోక్, గౌని వినోద్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Next Story