ఈనెల 8న హైదరాబాద్‌లో ‘చేప ప్రసాదం’ పంపిణీ

by Nallavelli.Anjaneyulu |   (  Updated:2026-06-06 11:13:35  IST  )

మృగశిర కార్తెను పురస్కరించుకుని ఈనెల 8న నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో నిర్వహించనున్న ‘చేప ప్రసాదం’ పంపిణీ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను పూర్తి చేస్తోంది.

ఈనెల 8న  హైదరాబాద్‌లో ‘చేప ప్రసాదం’ పంపిణీ
X

దిశ, కార్వాన్ : మృగశిర కార్తెను పురస్కరించుకుని ఈనెల 8న నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో నిర్వహించనున్న ‘చేప ప్రసాదం’ పంపిణీ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను పూర్తి చేస్తోంది. భక్తులు, రోగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వ పక్షాన మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి శనివారం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్, షాట్ చైర్మన్ శివసేనారెడ్డి సహా పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ సాధారణంగా ప్రతి ఏటా ఉదయం పూట ప్రారంభమయ్యే మృగశిర కార్తె, ఈసారి ఈనెల 8వ తేదీ రాత్రి 9 గంటలకు ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో రాత్రి పూట వచ్చే ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని మంత్రులు ఆదేశించారు. ఈ పంపిణీ కార్యక్రమం 8వ తేదీ రాత్రి ప్రారంభమై, 9వ తేదీ రాత్రి వరకు నిరంతరాయంగా కొనసాగుతుందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. క్యూలైన్లలో తొక్కిసలాట జరగకుండా పోలీసులు అప్రమత్తంగా ఉండాలనీ,నాంపల్లి పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ కాకుండా ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. ప్రస్తుతం వేసవి కాలం కావడంతో ఉక్కపోత ఎక్కువగా ఉంటుందనీ ,అందుకే క్యూలైన్లలో భక్తుల కోసం ప్రత్యేకంగా ఫ్యాన్లు, కూలర్లు ఏర్పాటు చేసి నిరంతర విద్యుత్ సరఫరా ఉండేలా చూడాలన్నారు.


ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో అంబులెన్స్‌లు, మెడికల్ క్యాంపులు, అవసరమైన మందులను సిద్ధంగా ఉంచాలనీ ,అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు క్యూలైన్ల మధ్యలో సీపీఆర్ బృందాలను అందుబాటులో ఉంచాలని సూచించారు. మహిళల రక్షణ కోసం 'షి టీమ్స్' రంగంలోకి దించడంతో పాటు, జేబుదొంగల పట్ల ప్రజలను మైకుల ద్వారా అప్రమత్తం చేయాలన్నారు. సీసీ కెమెరాల ద్వారా నిరంతర నిఘా ఉంచాలని, అగ్నిమాపక వాహనాలను అందుబాటులో ఉంచాలని స్పష్టం చేశారు. పంపిణీ ప్రక్రియ పూర్తయ్యే వరకు అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేయడానికి ప్రత్యేక వాట్సప్ గ్రూప్‌ను, ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసి మానిటరింగ్ చేయాలని ఆదేశించారు. వచ్చే భక్తులకు తాగునీటి ఎద్దడి రాకుండా చూడాలని, ప్రతి ఏటా మాదిరిగానే స్వచ్ఛంద సంస్థల సహకారంతో భక్తులకు ఉచిత వసతి, భోజన సదుపాయాలు కల్పించాలని కోరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు తాము ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నట్లు హైదరాబాద్ ఇంచార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. "చేప ప్రసాదంపై ప్రజలకు వందల సంవత్సరాలుగా అపారమైన విశ్వాసం ఉంది. ఇతర రాష్ట్రాల నుండి కూడా పెద్ద సంఖ్యలో జనం వస్తున్నారు. ఎవరూ అలసత్వంగా వ్యవహరించవద్దు. అవసరమైనన్ని చేప పిల్లలను ఇప్పటికే సిద్ధం చేశాం. అన్ని ప్రభుత్వ విభాగాలు సమన్వయంతో పనిచేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి అని ఆయన పిలుపునిచ్చారు.

Next Story