AI కళ్ళద్దాలతో బెడ్ రూమ్ సీన్స్ రికార్డ్.. మెటాపై దావా

by Muthe.Rajitha |

ఏఐ స్మార్ట్ గ్లాసెస్ న్యూడ్ సీన్స్ రికార్డ్ చేయడంతో మెటాపై క్లాస్ యాక్షన్ దావా నమోదైంది.

AI కళ్ళద్దాలతో బెడ్ రూమ్ సీన్స్ రికార్డ్.. మెటాపై దావా
X

దిశ, వెబ్ డెస్క్ : మెటా (Meta) సంస్థకు చెందిన ఏఐ స్మార్ట్ గ్లాసెస్ పై తీవ్ర దుమారం రేగుతోంది. వినియోగదారులు తమ బెడ్‌రూమ్‌లు, బాత్‌రూమ్‌లలో గడిపిన అత్యంత వ్యక్తిగత క్షణాలు ఈ గ్లాసెస్ ద్వారా రికార్డ్ అయ్యాయని, వాటిని మెటా ఉద్యోగులు వీక్షించారని ఆరోపిస్తూ అమెరికాలో ఆ సంస్థపై భారీ క్లాస్ యాక్షన్ దావా(Class Action Lawsuit) నమోదైంది. స్వీడిష్ వార్తాపత్రికలు నిర్వహించిన ఒక స్టింగ్ ఆపరేషన్ లో వెల్లడైన షాకింగ్ వివరాల ప్రకారం.. మెటా సంస్థ తన ఏఐ(AI) మోడళ్లను శిక్షణ ఇవ్వడానికి కెన్యాకు చెందిన ఒక సబ్‌కాంట్రాక్టింగ్ సంస్థను వాడుకుంటోంది. అక్కడ పనిచేసే సిబ్బంది వినియోగదారుల స్మార్ట్ గ్లాసెస్ నుండి అప్‌లోడ్ అయిన వీడియోలను మాన్యువల్‌గా చూసి వాటికి 'లేబుల్స్' ఇస్తుంటారు. ఈ క్రమంలో, వినియోగదారులు తమకు తెలియకుండానే రికార్డ్ చేసిన బెడ్‌రూమ్ సీన్లు, బాత్‌రూమ్ దృశ్యాలు, దంపతుల మధ్య జరిగే అత్యంత ప్రైవేట్ క్షణాలు, నగ్నంగా ఉన్న వీడియోలను తాము చూడాల్సి వచ్చిందని సదరు సిబ్బంది వెల్లడించడం సంచలనం సృష్టిస్తోంది.

మెటా "ప్రైవసీ"... అంతా అబద్ధమేనా?

ఈ నివేదికల ఆధారంగా కాలిఫోర్నియా, న్యూజెర్సీకి చెందిన వినియోగదారులు మెటాపై కోర్టును ఆశ్రయించారు. మెటా తన అడ్వర్టైజ్‌మెంట్లలో ఈ గ్లాసెస్ "Designed for privacy, controlled by you"(ప్రైవసీ కోసం రూపొందించబడింది, మీ నియంత్రణలో ఉంటుంది) అని ప్రచారం చేస్తూ వినియోగదారులను మోసం చేసిందని పిటిషన్ లో పేర్కొన్నారు. తమ ఇంట్లోని అత్యంత రహస్యమైన దృశ్యాలను ఎక్కడో వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న అపరిచితులు చూస్తారని తెలిస్తే, తాము ఈ గ్లాసెస్‌ను కొనేవాళ్లమే కాదని వారు ఆవేదన చెందారు. ముఖ్యంగా ఏఐ ఫీచర్లను ఉపయోగించినప్పుడు ఆ డేటా మెటా సర్వర్‌లకు వెళ్తుందని, అక్కడ హ్యూమన్ రివ్యూ జరుగుతుందనే విషయాన్ని కంపెనీ స్పష్టంగా వెల్లడించలేదని ఆరోపించారు. టెక్నాలజీ మన జీవితాలను సులభతరం చేస్తున్నప్పటికీ, ఇలాంటి 'స్మార్ట్' పరికరాలు మన ప్రైవేట్ జీవితాల్లోకి ఎంతలా చొరబడుతున్నాయో ఈ ఘటన హెచ్చరిస్తోంది. ముఖ్యంగా బెడ్ రూమ్ వంటి ప్రదేశాల్లో ఇలాంటి కెమెరా ఉన్న గ్లాసెస్‌ను వాడేటప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.

Next Story