అన్నపురెడ్డిపల్లి మండల కేంద్రంలో భారీగా గంజాయి పట్టివేత

by Jakkula.Mamatha |

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లి పోలీసులు గంజాయి స్మగ్లింగ్‌పై ఉక్కుపాదం మోపారు.

అన్నపురెడ్డిపల్లి మండల కేంద్రంలో భారీగా గంజాయి పట్టివేత
X

దిశ, అన్నపురెడ్డిపల్లి: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లి పోలీసులు గంజాయి స్మగ్లింగ్‌పై ఉక్కుపాదం మోపారు. టాస్క్‌ఫోర్స్‌తో కలిసి నిర్వహించిన వాహన తనిఖీల్లో భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. కేరళకు తరలిస్తున్న ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి, మరో ముగ్గురి కోసం గాలింపు చేపట్టారు. అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని వెంకటాపురం ఎక్స్‌ రోడ్డు వద్ద పోలీసులు, టాస్క్ ఫోర్స్ సిబ్బంది సంయుక్తంగా వాహన తనిఖీలు నిర్వహించారు.

ఈ తనిఖీల్లో ఆంధ్రప్రదేశ్–ఒడిశా సరిహద్దు ప్రాంతం నుంచి కేరళకు అక్రమంగా తరలిస్తున్న 88 కిలోల 590 గ్రాముల గంజాయిని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ సుమారు రూ.44 లక్షల 30 వేలు ఉంటుందని పోలీసులు తెలిపారు. గంజాయి రవాణాకు ఉపయోగించిన కారు, సెల్‌ఫోన్‌ను కూడా సీజ్ చేశారు.ఈ కేసులో కేరళకు చెందిన ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు. మరో ముగ్గురు నిందితులు పరారీలో ఉండగా, వారి కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. గంజాయి స్మగ్లింగ్‌ను అరికట్టడంలో ప్రతిభ కనబరిచిన అధికారులను జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ అభినందించారు.

Next Story