- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చౌటుప్పల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్‌లో ‘భూ’ మాయాజాలం
చౌటుప్పల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవసాయేతర భూములను వ్యవసాయ భూములుగా రిజిస్ట్రేషన్ చేసిన ఉదంతం బయటపడింది. ఏసీబీ విచారణ జరపాలని స్థానికులు కోరుతున్నారు.

దిశ, చౌటుప్పల్ : యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం అవినీతికి నిలయంగా మారింది. కాసులకు కక్కుర్తి పడిన కొందరు అధికారులు ఎలాంటి చట్టబద్ధమైన పత్రాలు లేకపోయినా రిజిస్ట్రేషన్లు పూర్తి చేస్తున్నారు. అర్హులైన సామాన్యులను నిబంధనల పేరుతో నెలల తరబడి ఇబ్బందులకు గురి చేసే అధికారులు, అక్రమార్కులకు మాత్రం దొడ్డిదారిన మార్గం సుగమం చేస్తున్నారు. ఈ క్రమంలోనే నిషేధిత జాబితాలో ఉన్న భూములను సైతం గుట్టుచప్పుడు కాకుండా రిజిస్ట్రేషన్ చేసి, గతంలో ఇక్కడ పనిచేసిన అధికారులు రూ.వందల కోట్లు కూడబెట్టినట్లు రాజకీయ వర్గాల్లో జోరుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఆన్‌లైన్ పహాణీతోనే మాయాజాలం..
సంస్థాన్ నారాయణపురం మండలంలోని రాచకొండ రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ 84 లో జరిగిన ఓ భూ వ్యవహారం ఇక్కడి అక్రమాలకు అద్దం పడుతోంది. ఓ వ్యక్తికి చెందిన 10 ఎకరాల 26 గుంటల భూమి ధరణి రాకముందు ఆన్‌లైన్ రికార్డుల్లో ‘వ్యవసాయేతర’ భూమిగా నమోదై ఉంది. సాధారణంగా ఇలాంటి భూములను వ్యవసాయ భూమిగా రిజిస్ట్రేషన్ చేయడం చట్టరీత్యా అసాధ్యం. కానీ, సదరు ఆన్‌లైన్ పహాణీ కాపీలో డిజిటల్ సంతకం కూడా లేనప్పటికీ, నాటి సబ్ రిజిస్ట్రార్ భారీగా ముడుపులు తీసుకుని నిబంధనలను తుంగలో తొక్కారు. కేవలం ఆన్‌లైన్ ప్రింట్ కాపీ ఆధారంగానే రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయడం వెనుక ఉన్న లబ్ధి స్పష్టంగా కనిపిస్తోంది.
వ్యవసాయేతర డ్యూటీ.. వ్యవసాయ రిజిస్ట్రేషన్..
ఈ భూమికి సంబంధించి చెల్లించిన స్టాంప్ డ్యూటీ మరొక పెద్ద కుంభకోణానికి దారితీస్తోంది. సదరు యజమాని స్టాంప్ డ్యూటీని ‘వ్యవసాయేతర’ కేటగిరీ కింద చెల్లించి, రిజిస్ట్రేషన్ మాత్రం ‘వ్యవసాయ భూమి’గా చేయించుకోవడం గమనార్హం. ఒకవేళ అది నిజంగానే వ్యవసాయ భూమి అయితే, యజమాని వ్యవసాయేతర రేట్ల ప్రకారం స్టాంప్ డ్యూటీ ఎందుకు చెల్లించారు? అలాగే, వ్యవసాయేతర డ్యూటీ చెల్లించినప్పుడు సబ్ రిజిస్ట్రార్ దానిని వ్యవసాయ భూమిగా ఎలా రిజిస్టర్ చేశారు? అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నలుగా మిగిలాయి. రాచకొండ పరిధిలో ఇలాంటి ‘మార్పిడి’ రిజిస్ట్రేషన్లు మరెన్నో జరిగినట్లు ఆరోపణలు వస్తున్నాయి.
ధరణి రాకముందే పక్కా స్కెచ్..
అక్టోబర్-29, 2020న ధరణి పోర్టల్ అమల్లోకి రావడానికి సరిగ్గా మూడు నెలల ముందే ఈ అక్రమాలకు పునాది పడింది. ధరణి వస్తే ఇలాంటి తప్పుడు పనులు సాధ్యం కాదని గుర్తించిన అక్రమార్కులు, జూలై 2020లో సబ్ రిజిస్ట్రార్‌తో కుమ్మక్కై ఈ దందాను పూర్తి చేశారు. సాధారణంగా ఇలాంటి భూములకు తహశీల్దార్ కార్యాలయం నుంచి ఎన్‌ఓసీ తప్పనిసరి. కానీ అధికారులు ఆ దిశగా ఎలాంటి విచారణ చేయకుండానే పని పూర్తి చేసేశారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా వివిధ కార్యాలయాలపై ఏసీబీ, విజిలెన్స్ దాడులు జరుగుతున్న నేపథ్యంలో చౌటుప్పల్ కార్యాలయంలోని పదేళ్ల రికార్డులను క్షుణ్ణంగా పరిశీలిస్తే అధికారుల అసలు బండారం బయటపడుతుందని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.






