- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కరీంనగర్ విలీన గ్రామాల్లో భూ మాఫియా పంజా
కరీంనగర్ విలీన గ్రామాల్లో భూ మాఫియా దందా! అధికారుల అండతో ప్రభుత్వ భూముల అక్రమ రిజిస్ట్రేషన్లు. దుర్శేడ్‌లో 38 గుంటల భూమి అన్యాక్రాంతం.

దిశ, కరీంనగర్ బ్యూరో: విలీన గ్రామాల్లో భూ మాఫియా రెచ్చిపోతున్నారు. ప్రభుత్వ భూములు టార్గెట్ గా విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఇంటి నంబర్లతో సర్వే నంబర్లు మార్చి రిజిస్ట్రేషన్లు చేపిస్తూ కోట్లాది రూపాయల ప్రభుత్వ భూమిని అన్యాక్రాంతం చేస్తున్నారు. అయితే అందుకు అధికారులు చేతివాటం ప్రదర్శించడం స్థానిక నాయకుల అండదండలు పుష్కలంగా ఉండటంతో కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ విలీన గ్రామాల్లో అక్రమ దందా మూడు పువ్వులు ఆరుకాయలుగా విలసిల్లుతుంది.
యథేచ్ఛగా ప్రభుత్వ భూములు క్రయ విక్రయాలు
కరీంనగర్ విలీన గ్రామం దుర్శేడ్ మున్సిపాలిటీలో కలవడంతో అక్కడ భూముల ధరలు ఒక్కసారిగా పెరిగాయి. దీంతో అక్రమార్కుల దృష్టి ఖాళీ స్థలాలు, ప్రభుత్వ భూముల పై పడింది. అందుకు అధికారుల అండదండలు ఉండటంతో యథేచ్ఛగా ప్రభుత్వ భూములను ఆక్రమిస్తున్న అక్రమార్కులు కోట్ల రూపాయల భూములను అన్యాక్రాంతం చేస్తున్నారు. పక్కా భూముల సర్వే నంబర్లు జోడించి రిజిస్ట్రేషన్లు చేస్తూ క్రయ విక్రయాలు సాగిస్తున్నారు. దీంతో విలువైన ప్రభుత్వ భూములు కనుమరుగవుతూ కాలగర్భంలో కలసిపోతున్నాయి
అధికారుల సాక్షిగా ఆక్రమణ
కరీంనగర్ శివారు గ్రామం దుర్శేఢ్ కరీంనగర్ కార్పొరేషన్ లో విలీనం కావడం అక్కడి అధికారులకు, ప్రజాప్రతినిధులకు కాసుల వర్షం కురిపిస్తుంది. విలీన సమయంలో అడ్డగోలుగా అక్రమ ఇంటి నంబర్లను సృష్టించిన కొందరు ప్రజాప్రతినిధులు, అధికారులు ఆ నంబర్లు ఆధారంగా అక్కడి ప్రభుత్వ భూమిని అన్యాక్రాంతం చేస్తున్నారు. దుర్శేడ్ గ్రామంలో విలీన సమయంలో సర్వే నెంబర్ 168 లో 38 గుంటల ప్రభుత్వ భూమి ఉంది. దుర్శేడ్ గ్రామం కరీంనగర్ మున్సిపాలిటీలో విలీనం కావడంతో ఆ భూమికి డిమాండ్ పెరిగింది. ఇదే అదనుగా భావించిన అధికారులు ప్రజాప్రతినిధులు ఇంటి నంబర్లు సృష్టించి సర్వేనంబర్లు మార్చి యథేచ్ఛగా క్రయ విక్రయాలు చేస్తున్నారు. దీంతో కోట్లాది రూపాయల ప్రభుత్వ భూమి అన్యాక్రాంతమవుతున్న అక్రమార్కులకు ఆదాయ వనరుగా మారింది
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం కేంద్రంగా అక్రమ రిజిస్ట్రేషన్లు
కరీంనగర్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం కేంద్రంగా అక్రమ రిజిస్ట్రేషన్లు సాగుతున్నాయనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. స్థానిక నాలుగవ డివిజన్ లో ప్రభుత్వ భూమి టార్గెట్గా అక్రమ రిజిస్ట్రేషన్లు జరగడంతో కోట్లాది రూపాయల ప్రభుత్వ భూమిని సర్వే నంబర్లు మార్చి ఇంటి నెంబర్ తో రిజిస్ట్రేషన్లు చేయడం తో అధికారులకు కాసుల వర్షం కురుస్తుంది. అందుకు ప్రత్యేక కోడ్ భాషను అమలు చేస్తూ యథేచ్ఛగా రిజిస్ట్రేషన్లు సాగిస్తున్నారు. దీంతో 38 గుంటల ప్రభుత్వ భూము ప్రస్తుతం మూడు గుంటలు కూడా లేకుండా పోవడం అక్కడి పరిస్థితికి నిదర్శనం. ఇప్పటికైన జిల్లా కలెక్టర్ స్పందించి కోట్లాది రూపాయల ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం రాకుండా చూడాలని స్థానికులు వేడుకుంటున్నారు.






