- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తాడ్వాయి పశువైద్య కేంద్రంపై వరద ముప్పు..!
తాడ్వాయిలోని ప్రభుత్వ పశువైద్య కేంద్రం ప్రతి వర్షాకాలంలో వరద ముప్పును ఎదుర్కొంటోంది.

దిశ, తాడ్వాయి : తాడ్వాయిలోని ప్రభుత్వ పశువైద్య కేంద్రం ప్రతి వర్షాకాలంలో వరద ముప్పును ఎదుర్కొంటోంది. భారీ వర్షాలు కురిసిన ప్రతిసారీ సమీప గుట్టపై నుంచి వచ్చే వరద నీరు రహదారి మీదుగా నేరుగా ఆసుపత్రి గదుల్లోకి చేరుతుండటంతో వైద్య సేవలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. ఇప్పటికే శిథిలావస్థకు చేరిన భవనానికి వరద ముప్పు తోడవడంతో పశువైద్య కేంద్రం నిర్వహణ మరింత ఇబ్బందికరంగా మారిందని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నివారణ చర్యలు శూన్యం.. తాత్కాలిక ఏర్పాట్లే దిక్కు..
వరద నీరు గదుల్లోకి రాకుండా ఉండేందుకు సిబ్బంది స్వయంగా కాలువలు తవ్వడం, మట్టి పోయడం వంటి తాత్కాలిక చర్యలు చేపడుతున్నప్పటికీ సమస్యకు శాశ్వత పరిష్కారం దొరకడం లేదు. గుట్టపై నుంచి వచ్చే వరద ఉధృతి ఎక్కువగా ఉండటంతో ఈ చర్యలు కూడా ఫలించడం లేదని చెబుతున్నారు. భారీ వర్షం కురిసినప్పుడు ఆసుపత్రి ఆవరణ మొత్తం చెరువును తలపిస్తోందని, మందులు, వైద్య పరికరాలు దెబ్బతినే ప్రమాదం నెలకొంటోందని సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
నిధుల కోసం ఎదురుచూపులే..
ఆసుపత్రి భవనం దుస్థితి, వరద ముప్పు గురించి ఇప్పటికే పలుమార్లు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామని స్థానిక వెటర్నరీ వైద్యాధికారి డాక్టర్ రమేష్ తెలిపారు. సమస్యపై నివేదికలు పంపినప్పటికీ నిధుల మంజూరులో జాప్యం జరుగుతుండటంతో శాశ్వత పరిష్కారం లభించడం లేదన్నారు. ఎన్నో ఏళ్ల క్రితం నిర్మించిన ఈ భవనం ప్రస్తుతం రహదారి కంటే తక్కువ ఎత్తులో ఉండటంతో వర్షపు నీరు నేరుగా ఆసుపత్రిలోకి చేరుతోందని, దాన్ని మళ్లించేందుకు ప్రతి వర్షాకాలంలో సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వివరించారు.
ప్రజాప్రతినిధులు స్పందించాలంటున్న పశుపోషకులు..
పశుసంవర్ధక శాఖ అధికారులు నిధుల కోసం ప్రతిపాదనలు పంపామని చెబుతున్నప్పటికీ, ప్రజాప్రతినిధులు ప్రత్యేక చొరవ తీసుకుని నూతన పశువైద్య కేంద్ర భవనం నిర్మాణానికి చర్యలు చేపట్టాలని పశుపోషకులు కోరుతున్నారు. ప్రమాదకర స్థితిలో ఉన్న భవనం కూలిపోయేలోపు లేదా వరదలతో మరింత నష్టం జరిగేలోపు ఉన్నతాధికారులు స్పందించి శాశ్వత పరిష్కారం చూపాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.






