- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రూ.27 కోట్ల సీసీ రోడ్డు పనుల్లో నాణ్యత లోపం?
సీతారామ ప్రాజెక్టు ప్యాకేజీ-3 పరిధిలో కమలాపురం వద్ద రూ.27 కోట్ల వ్యయంతో చేపడుతున్న ఐదు కిలోమీటర్ల సీసీ రోడ్డు, సైడ్ డ్రెయిన్ పనులపై నాణ్యత లోపం కనిపిస్తుంది.

దిశ, ములకలపల్లి: సీతారామ ప్రాజెక్టు ప్యాకేజీ-3 పరిధిలో కమలాపురం వద్ద రూ.27 కోట్ల వ్యయంతో చేపడుతున్న ఐదు కిలోమీటర్ల సీసీ రోడ్డు, సైడ్ డ్రెయిన్ పనులపై నాణ్యత లోపం కనిపిస్తుంది. నిర్మాణంలో నిబంధనలకు అనుగుణంగా ఉండాల్సిన ఇసుకకు బదులుగా స్థానికంగా లభించే ఇసుకనే వినియోగిస్తున్నారు. దీంతో సీసీ రోడ్డు దీర్ఘకాలిక మన్నికపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కోట్లాది రూపాయల ప్రజాధనంతో జరుగుతున్న పనుల్లో ప్రతి దశను సాంకేతికంగా పరిశీలించాల్సిన అవసరం ఉంది. ఇంత పెద్ద ప్రాజెక్టులో శాఖ ఇంజినీర్ల తనిఖీలు, నిర్మాణంలో వాడుతున్న మెటీరియల్ నాణ్యత పరిశీలన కరువైంది. కాంక్రీటు క్యూబ్ టెస్టులు, మెటీరియల్ నాణ్యత పరీక్షలు, ఫీల్డ్ ఇన్‌స్పెక్షన్లు సక్రమంగా జరగడం లేదు.
స్టీల్ తరలింపు వెనుక మర్మమేమిటి.. 35 టన్నుల ఇనుము రాత్రికిరాత్రే బయటకు..
సీసీ రోడ్డు పనుల్లో స్టీల్ తరలింపు వ్యవహారం పలు ప్రశ్నలకు తావిస్తోంది. సైట్ నుంచి 35 టన్నుల స్టీల్ రాత్రికిరాత్రే బయటకు వెళ్లింది. విషయం బయటకు పొక్కడంతో తిరిగి మళ్లీ అదే ప్రాంతానికి చేర్చారు. పెద్ద ఎత్తున సిమెంట్ బస్తాలు కూడా దారిమళ్లడం వంటి వ్యవహారం స్థానికంగా చర్చనీయాంశమైంది. అయితే ప్రభుత్వ పనులకు సంబంధించిన నిర్మాణ సామాగ్రిని దొంగచాటుగా రాత్రి వేళ సైట్ నుంచి తరలించడంతో, ఇలాంటి ఘటనలు గతంలో కూడా జరిగాయా? గుట్టు చప్పుడు కాకుండా ఇలా ఎన్నిసార్లు మాయం చేసుంటారు? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో సీసీ రోడ్డు పనుల పై సమగ్ర విచారణ జరపాలని స్థానికులు కోరుతున్నారు.
ఈ విషయమై డీఈ రవి కుమార్‌ని వివరణ కోరగా.. సబ్ కాంట్రాక్టర్లు లావాదేవీలు వ్యవహారంలో స్టీల్ తరలించింది వాస్తవమే. ఈ ఘటనకు మాకు సంబంధం లేదు. పనుల నాణ్యత పరిశీలిస్తున్నామని చెప్పారు. ఈ ఘటనపై స్థానిక ఎస్సై మధు ప్రసాద్‌ను వివరణ కోరగా.. ఎటువంటి ఫిర్యాదు అందలేదు. కాంట్రాక్టర్ల మధ్య లావాదేవీలు సమస్యతో స్టీల్ తరలించారని, మాట్లాడుకుని తర్వాత యథాస్థానానికి తీసుకొచ్చినట్లు తెలిసింది అన్నారు.






