నిధులు రాక.. నిర్మాణాలు పూర్తికాక..

by Jakkula.Mamatha |   (  Updated:2026-07-28 03:18:37  IST  )

గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత చేరువ చేయాలనే లక్ష్యంతో కోట్ల రూపాయల వ్యయంతో ప్రారంభించిన ప్రభుత్వ భవనాల నిర్మాణాలు నడిగూడెం మండలంలో నత్తనడకన సాగుతున్నాయి.

నిధులు రాక.. నిర్మాణాలు పూర్తికాక..
X

దిశ, నడిగూడెం: గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత చేరువ చేయాలనే లక్ష్యంతో కోట్ల రూపాయల వ్యయంతో ప్రారంభించిన ప్రభుత్వ భవనాల నిర్మాణాలు నడిగూడెం మండలంలో నత్తనడకన సాగుతున్నాయి. కొన్ని గ్రామాల్లో వివో (VO) భవనాలు, మరికొన్ని చోట్ల అంగన్‌వాడీ కేంద్రాలు, ఇంకొన్ని గ్రామాల్లో గ్రామపంచాయతీ భవనాల నిర్మాణ పనులు ప్రారంభమైనప్పటికీ, నిధుల కొరత కారణంగా మధ్యలోనే నిలిచిపోయాయి. దీంతో అభివృద్ధికి ప్రతీకగా నిలవాల్సిన భవనాలు నేడు అసంపూర్తి నిర్మాణాలుగా దర్శనమిస్తున్నాయి. ఒకవైపు ప్రభుత్వ పెద్దలు కొత్త భవనాల మంజూరు, శంకుస్థాపనలు ఘనంగా నిర్వహించినా, ఆ స్థాయిలో నిర్మాణాలు పూర్తి కాకపోవడంతో ప్రజలు ఆశించిన ఫలితాలు అందడం లేదు. పునాదులు వేసి వదిలేసిన భవనాలు, గోడల వరకు నిర్మించి ఆపేసిన భవనాలు, స్లాబ్ వేసి తుది పనులు నిలిపివేసిన నిర్మాణాలు మండలంలోని పలు గ్రామాల్లో కనిపిస్తున్నాయి. ఈ నిర్మాణాలకు ఇప్పటికే ఖర్చు చేసిన ప్రభుత్వ నిధులు కూడా వృథా అవుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి.

మంజూరులో వేగం.. చెల్లింపుల్లో జాప్యం..

రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు మెరుగైన సౌకర్యంతో కూడిన సేవను అందించాలని ఉద్దేశంతో ప్రభుత్వం భవనాలను పెద్ద ఎత్తున మంజూరు చేస్తుంది. కానీ మంజూరు లో ఉన్న వేగo నిర్మాణాలు పూర్తి చేయించడంలో లేదని విమర్శలు ప్రజల నుంచి వినిపిస్తున్నాయి. అయితే నడిగూడెం మండలంలో రూ.1.20 కోట్లతో మొత్తం 12 వివో భవనాలు మంజూరు కాగా.. అందులో 8 భవనాలకు మాత్రమే నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. మరో నాలుగు వివిధ కారణాలతో పనులు ప్రారంభం జరగలేదు. అదేవిధంగా అంగన్వాడి భవన నిర్మాణాలకు గాను రూ. 1.80 కోట్లతో 15 భవనాలు మంజూరు చేయగా అందులో 8 భవన నిర్మాణ పనులు ప్రారంభమవగా మరో 6 భవనాల నిర్మాణాల కొరకు ఏజెన్సీలు ఎంపిక జరగనుంది. మరొకటి బృందావనపురం గ్రామానికి మంజూరైన కేంద్రానికి స్థల ఎంపికలో సమస్య ఏర్పడడంతో అక్కడ నిర్మాణం ప్రారంభం కాలేదు. ఒక్కొక్క భవన నిర్మాణ అంచనా వ్యయం రూ. 12 లక్షలు. వీటితోపాటు శిధిలావస్థకు చేరిన గ్రామ పంచాయతీ భవనాల స్థానంలో.. నూతన భవనాల నిర్మాణాల కోసం ఈజీఎస్ నిధుల ద్వారా రూ. 40 లక్షలతో మండలంలో తొలి విడతగా రెండు మంజూరు చేశారు.

నడిగూడెం మండల కేంద్రంలో నిర్మించిన భవనం పనులు పూర్తయి ప్రారంభోత్సవం జరిగింది.. దీనితో పాటు ప్రారంభించిన ఎకలాస్ ఖాన్ పేట తండా భవన నిర్మాణం గత ఏడాదిన్నరగా కొనసాగుతూనే ఉంది. అదే విధంగా రూ.80 లక్షలతో కొత్తగా మరో నాలుగు జిపి భవనాలు మంజూరయ్యాయి. అవి వల్లాపురం, కే ఆర్ సి పురం, రామాపురం, తెల్లబెల్లి గ్రామాలకు మంజూరు కాగా వీటిని నిర్మాణాలకు ఏజెన్సీలను ఎంపిక చేయాల్సి ఉంది. వీటితోపాటు డి ఎం ఎఫ్ టి నిధులు రూ .70 లక్షల వ్యయంతో రెండు కమ్యూనిటీ హాలు మంజూరు జరగగా కేశవాపురంలో బీసీ కమ్యూనిటీ హాల్, నడిగూడెంలో ఎస్సీ కమిటీ భవనం వీటి నిర్మాణాలకు టెండర్ ప్రక్రియ పూర్తయినప్పటికీ ఏజెన్సీల ఎంపిక చేయకపోవడంతో నిర్మాణ పనులు ప్రారంభం జరగలేదు.

బిల్లులు నిలిచి.. నిర్మాణాలు ఆగి...

నిర్మాణ పనులు చేపట్టిన కాంట్రాక్టర్లకు ఇప్పటికే చేసిన పనులకు సంబంధించిన బిల్లులు సకాలంలో చెల్లించకపోవడం, తదుపరి విడత నిధులు విడుదల కాకపోవడం వల్ల పలువురు కాంట్రాక్టర్లు పనులను నిలిపివేసినట్లు సమాచారం. కొందరు అప్పులు చేసి పనులు ప్రారంభించినా, కొన్ని భవనాలు స్లాబ్ పూర్తిచేసుకుని ప్లాస్టరింగ్, ఫ్లోరింగ్ వంటి పనులు ఆగిపోగా, మరికొన్ని భవనాలు గోడల వరకు మాత్రమే నిర్మాణాలు జరిగాయి. అయితే అంగన్వాడి భవనాలకు సంబంధించి నిధులు ఈజీఎస్ (జి రాంజీ ఉపాధి హామీ పథకం) ద్వారా రూ .8 లక్షలు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి వెల్ఫేర్ శాఖ ద్వారా మరో రూ.4 లక్షలు చెల్లించాల్సి ఉంది. అయితే ఈజీఎస్ సంబంధించిన నిధులు మాత్రమే కాంట్రాక్టర్కు చెల్లించగా మిగిలిన నాలుగు లక్షల నిధులు చెల్లించడంలో జాప్యం జరుగుతుండడం, అధికారుల నుంచి సరైన సమాచారం లేకపోవడంతో గుత్తేదారులు నిర్మాణ పనులు నిలిపి వేసినట్టు తెలిసింది. దీంతో కొత్త భవనాలు పూర్తికాకపోవడంతో కొన్ని అంగన్‌వాడీ కేంద్రాలు ఇప్పటికీ అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. మరికొన్ని శిధిలమైన పాత భవనాల్లో ఇరుకైన ప్రభుత్వ పాఠశాల భవనాలు కొనసాగుతున్నాయి. దీంతో కనీస సౌకర్యాలు లేకపోవడంతో లబ్ధిదారులు అనేక అవస్థలు ఎదుర్కొంటున్నారు. కొన్ని గ్రామపంచాయతీలు శిధిలావస్థలో గల పాత, ఇరుకైన భవనాల్లోనే కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి.

ఏజెన్సీల ఎంపిక జరుగుతుంది: లావణ్య (పంచాయతీరాజ్ ఏఈ నడిగూడెం)

ప్రభుత్వం మంజూరు చేసిన భవన నిర్మాణాలను త్వరగా పూర్తిచేసే విధంగా గుత్తేదారులను ఆదేశిస్తాం. బిల్లుల చెల్లింపు అంశం ఉన్నతాధికారులు నివేదించాం. కొత్తగా మంజూరైన భవన నిర్మాణాల కొరకు ఏజెన్సీలు ఎంపిక జరుగుతుంది. ఎంపిక పూర్తి అవగానే వాటి పనులు ప్రారంభిస్తాం.

Next Story