- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కేసీఆర్ చేసి చూపించారు.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
మహబూబ్‌నగర్, నారాయణపేట జిల్లాలో బీఆర్‌ఎస్ తరపున గెలిచిన సర్పంచ్‌లు, వార్డు సభ్యులతో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు.

దిశ, వెబ్‌డెస్క్: మహబూబ్‌నగర్, నారాయణపేట జిల్లాలో బీఆర్‌ఎస్ తరపున గెలిచిన సర్పంచ్‌లు, వార్డు సభ్యులతో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గెలిచిన సర్పంచ్‌లు, వార్డు సభ్యులకు కేటీఆర్ అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా మాట్లాడారు. ‘గతంలో నేను మున్సిపల్ మంత్రిగా పనిచేశాను. 2014 కంటే ముందు మహబూబ్ నగర్ పట్టణం ఎట్లుండే ఇయ్యాల ఎట్లున్నది.. అనేది చూస్తున్న మీ అందరికీ తెలుసు. ఒక్క మహబూబ్‌నగరే కాదు, నారాయణపేట, వనపర్తి, నాగర్‌కర్నూల్, గద్వాల్ ఇలా ఈ జిల్లాలో ఏ పట్టణం చూసినా ఎట్ల అభివృద్ది చెందినయో మీరందరూ చూశారు. ఈ పట్టణాలు 2014కు ముందు ఎట్టుండే, ఇప్పుడు ఎట్టున్నయో మీరు గమనించండి. కేసీఆర్ నాయకత్వంలో ఒకట్రెండు కాదు, అన్ని పట్టణాలను అభివృద్ధి చేసుకున్నం. అన్ని పల్లెలను అభివృద్ధి చేసుకున్నాం’ అని అన్నారు.
కేసీఆర్ చేసి చూపించారు
‘పట్టణ ప్రగతి, పల్లె ప్రగతి కార్యక్రమాల కింద.. పల్లె, పట్టణం అన్న తేడా లేకుండా బ్రహ్మాండంగా అభివృద్ధి చేశాం. అసెంబ్లీ ఎన్నికల్లో మనం కొద్ది తేడాతో ఓడిపోయాం. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేళ్లయ్యింది. ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్లు ఒక్క పని కూడా కొత్తగా చేసింది లేదు. పల్లెల్లో కేసీఆర్ నాయకత్వంలో ట్రాక్టర్‌లు పెట్టి, నీటి ట్యాంకర్‌లు పెట్టి, చెట్లు పెట్టి, ఇంటింటికి నల్లా పెట్టి, ప్రతి పల్లె వీధుల్లో స్ట్రీట్ లైట్‌లు పెట్టి, డంపింగ్ యార్డులు పెట్టి, వైకుంఠధామాలు కట్టి, పల్లె ప్రకృతి వనాలు కట్టి బ్రహ్మాండమైన అభివృద్ధిని కేసీఆర్ చూపించారు. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఈ రెండేళ్లలో ట్యాంకర్లలో నీళ్లు లేవు, ట్రాక్టర్‌లో డీజిల్ లేదు. వీధుల్లో లైట్లు వెలుగుతలేవ్’ అని విమర్శించారు.
జిల్లాలను రద్దు చేస్తామంటే అగ్గి రాజేస్తాం
ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని తమ హయాంలో ఏర్పాటుచేసిన కొత్త జిల్లాలను రద్దు చేస్తామంటే అగ్గిరాజేస్తామని కేటీఆర్ హెచ్చరించారు. ప్రజలకు ప్రభుత్వ పాలన అందుబాటులో ఉండాలన్న ఉద్దేశంతో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేసీఆర్ కొత్త జిల్లాలు, కొత్త మండలాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఇబ్బందులు లేనివిధంగా ఏర్పాటుచేసిన జిల్లాలను రద్దు చేయడం కానీ, కుదిరించడం కానీ చేస్తే ఊరుకునేది లేదన్నారు. రేవంత్ రెడ్డి అడ్డిమార్ గుడ్డిలో సీఎం అయ్యారని విమర్శించారు. ఈ రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో ముఖ్యమంత్రి ఇచ్చిన 420 హామీల్లో ఏ మాత్రం అమలు చేశారన్నది అందరికీ తెలిసిందేనని అన్నారు. పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టి 90 శాతం పనులు పూర్తి చేశామని, మిగతా పది శాతం పనులను పూర్తి చేయకుండా ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు. పనులు పూర్తి చేస్తే తన పాత బాసు చంద్రబాబుకు కోపం వస్తుందని, మాజీ సీఎం కేసీఆర్‌కు పేరు వస్తుంది అన్న ఉద్దేశంతోనే ఈ ప్రాజెక్టు పనులు పూర్తి చేయడం లేదని ధ్వజమెత్తారు.






