- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సీబీఐకి ఇస్తారా? సిట్టింగ్ జడ్జికి ఇస్తారా? ఎవరికి ఇస్తారో ఇవ్వండి: కేటీఆర్
సీఎం అంటే తెలంగాణలో చీఫ్ మినిస్టర్ కాదని.. కోల్ మాఫియాకి నాయకుడిగా రాష్ట్ర ప్రజలు, సింగరేణి కార్మికులు భావించే పరిస్థితి వచ్చిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు.

దిశ, తెలంగాణ బ్యూరో: సీఎం అంటే తెలంగాణలో చీఫ్ మినిస్టర్ కాదని.. కోల్ మాఫియాకి నాయకుడిగా రాష్ట్ర ప్రజలు, సింగరేణి కార్మికులు భావించే పరిస్థితి వచ్చిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. మంగళవారం రాష్ట్ర గవర్నర్‌ను కలిసిన అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. తమ పార్టీ తరఫున శాసనమండలి సభ్యులు, పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యుల బృందం, సీనియర్ నాయకుల బృందం అందరం గవర్నర్‌కు వివరమైన విజ్ఞాపన పత్రాన్ని ఇచ్చామని తెలిపారు. రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి, ముఖ్యంగా సింగరేణిలో జరుగుతున్న దోపిడీ విషయంలో వారికి విన్నవించినట్లు చెప్పారు. సింగరేణిలో అవినీతి జరుగుతున్నదని ఆధారాలతో సహా తమ శాసనసభాపక్ష ఉపనాయకుడు, మాజీ మంత్రి హరీశ్‌రావు ఆధారాలతో సహా బయటపెట్టారని.. అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీలో వణుకు మొదలైందని అన్నారు. కుంభకోణాన్ని పూర్తిస్థాయిలో బట్టబయలు చేసేసరికి పాలకుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని అన్నారు. ఆధారాలతో సహా పూర్తిస్థాయిలో ఈ కుంభకోణాన్ని బట్టబయలు చేశామన్నారు. దాన్ని డైవర్ట్ చేయడానికి, ప్రజల అటెన్షన్‌ను దృష్టి మళ్లించడానికి విచారణ పేరిట ఒకరి తర్వాత ఒకరిని పిలవడం చూస్తున్నామని అన్నారు.
విదేశాల్లో సీఎం ఫోజులు..
ఈ కుంభకోణాన్ని చాలా స్పష్టంగా ఆధారాలతో సహా తాము బయటపెట్టిన తర్వాత కూడా ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి ఒక్క సమాధానం రావడం లేదని కేటీఆర్ ఆరోపించారు. ఈ విషయంలో స్పందించాల్సిన సీఎం రేవంత్ అప్పుడప్పుడు సింగరేణితో ఫుట్‌బాల్ ఆడుతున్నారని.. ఇవాళ విదేశాల్లో తిరుగుతూ ఏదో పాఠాలు నేర్చుకుంటున్నట్లు ఫోజులు కొడుతున్నారని ఎద్దేవా చేశారు. చదువుకోవాల్సిన టైంలో చదువుకోక ఇప్పుడు చదువుకుంటానంటే ఏం వస్తదో ఒకసారి వారు కూడా ఆలోచించుకోవాలన్నారు. పది కోట్ల రూపాయల సింగరేణి సంస్థకు సంబంధించిన నిధులు దుర్వినియోగం చేసి ఫుట్‌బాల్ ఆటకు వినియోగించారని ఆరోపించారు. టెండర్ల విషయంలో గతంలో ఎన్నడూ లేని విధంగా పారదర్శకతకు పాతరేసి సైట్ విజిట్ సర్టిఫికేషన్ ఎందుకు పెట్టారని ప్రశ్నించారు. దేశంలో ఏ కోల్ గనిలో లేని, ఏ బొగ్గు గనిలో లేని నిబంధన ఇక్కడనే ఎందుకు పెట్టారని అడిగితే పాలకుల నుంచి సమాధానం లేదన్నారు. అలాగే.. నిజంగానే 2018 నుంచి 2024 వరకు ఈ నిబంధన గనుక కేంద్ర ప్రభుత్వం ఒకవేళ సిఫారసు చేసి ఉంటే బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేయలేదని వెల్లడించారు. అన్ని టెండర్లను కూడా ట్రాన్స్పరెంట్‌గా నాడు పిలిచామన్నారు. అందుకే నాడు మైనస్ టెండర్లు వచ్చాయని తెలిపారు.
నిబంధన తెచ్చిన ఈ తొమ్మిది నెలల్లో ఎన్ని సంస్థలు ఎంతమంది కాంట్రాక్టర్లు సైట్ సందర్శించారు? మీకు ఎన్ని ఈ మెయిల్స్ వచ్చాయి? ఎన్ని లేఖలు వచ్చాయి? ఎన్ని సర్టిఫికేట్లు సింగరేణి సంస్థ జారీ చేసింది? శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఇందులో రింగ్ మాస్టర్ సృజన్‌రెడ్డి అనే వ్యక్తి ముఖ్యమంత్రి బావమరిది అవునా? కాదా? అని తాము అడిగితే ఇంతవరకు సమాధానం రాలేదన్నారు. ఒక నైనీ టెండర్లే కాకుండా అన్ని టెండర్లు పారదర్శకతతో ఉండాలన్నారు. సోలార్ పవర్ స్కామ్‌ను సైతం బయట పెట్టామని.. దేశంలో ఎక్కడైనా మెగావాట్‌కు రెండున్నర నుంచి మూడు కోట్లతో సోలార్ నిర్మాణం జరుగుతున్నదా అని నిలదీశారు. కానీ.. తెలంగాణలో మాత్రం సింగరేణి పిలిచిన సోలార్ టెండర్లలో ఏడు కోట్లతో చేపడుతున్నారని అన్నారు. రెండున్నర మూడు కోట్లలో అయ్యే పనికి ఏడు కోట్లు ఎందుకు అవుతుందని ప్రశ్నించారు. అలాగే.. ఎక్స్‌ప్లోజివ్స్, జిలెటిన్ స్టిక్స్ 30 శాతం అదనంగా రేటు పెంచారని.. డైరెక్టర్లు నిలదీస్తే బోర్డులో, వారి మీద యాక్షన్ తీసుకున్నారు తప్ప కాంట్రాక్టర్లకు లాభం చేసే పనిలో మాత్రం కాంగ్రెస్ పార్టీ వెనకకు తగ్గలేదని ఆరోపించారు. అన్ని విషయాలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. కాంట్రాక్టర్లను బెదిరించి, కాంట్రాక్టర్లను రింగు చేసి ప్రజా ధనాన్ని దోచుకుంటున్న తీరును సైతం వివరించామన్నారు. గవర్నర్ ఇన్వాల్వ్ కావాలని.. కేంద్రం మంత్రి కిషన్‌రెడ్డికి ఆదేశం ఇవ్వాలని కోరామని చెప్పారు. ‘సీబీఐకి ఇస్తారా? సిట్టింగ్ జడ్జికి ఇస్తారా? మీ ఇష్టం ఎవరికి ఇస్తారో ఇవ్వండి. కానీ ప్రజా ధనాన్ని కొల్లగొట్టే ఈ దుర్మార్గపు వ్యవస్థను, అటు సోలార్ పవర్‌లో, ఇటు సింగరేణి ఓబీ గనుల్లో కుంభకోణం.. దీన్ని అడ్డుకోండి’ అని విన్నవించినట్లు చెప్పారు.






