బొగ్గు కుంభకోణంలో కిషన్‌రెడ్డి భాగస్వామ్యం ఉన్నదా..?

by Gantepaka Srikanth |

అడ్డగోలు సిట్ విచారణల పేరుతో తమాషాలు చేస్తున్నారని.. అయినా కాంగ్రెస్ పార్టీ హామీల విఫలం, పరిపాలన వైఫల్యంపై ప్రశ్నిస్తూనే ఉంటామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు.

బొగ్గు కుంభకోణంలో కిషన్‌రెడ్డి భాగస్వామ్యం ఉన్నదా..?
X

దిశ, తెలంగాణ బ్యూరో: అడ్డగోలు సిట్ విచారణల పేరుతో తమాషాలు చేస్తున్నారని.. అయినా కాంగ్రెస్ పార్టీ హామీల విఫలం, పరిపాలన వైఫల్యంపై ప్రశ్నిస్తూనే ఉంటామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. మంగళవారం ఆయన తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. అది సిట్ విచారణ కాదు.. పిచ్చి విచారణ అని.. ఇది సిట్ విచారణ కాదు.. చిట్టినాయుడి విచారణ అని విమర్శించారు. ప్రభుత్వం ఇచ్చిన నోటీసులకు బాధ్యతాయుతమైన నాయకుడిగా హరీశ్‌రావు విచారణకు హాజరయ్యారని.. రేవంత్‌రెడ్డికి డబ్బుల కట్టలతో దొరికిన నేరచరిత్ర ఉన్నదని.. అది అందరికీ అంటించాలని చూస్తున్నారని ఆరోపించారు. అధికారం అందలం ఎక్కించ్చినా రేవంత్‌రెడ్డికి బుద్ధి మాత్రం బురదలోనే ఉన్నదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే స్కామ్‌గ్రేస్ అని.. ఒక మంత్రి 20 శాతం.. ఇంకో మంత్రి బ్యాగ్ మాన్ అని అన్నారు. ఫోన్ ట్యాపింగ్ అంశంలో ఒక్క అధికారి కూడా ఇప్పటిదాకా ఎందుకు బయటకు మాట్లాడలేదని.. కేవలం లీకులు ఇచ్చి ఎన్ని రోజులు ఇలా బతుకుతావు రేవంత్ అని ప్రశ్నించారు. ఎలాంటి ఆధారాలు లేకుండా, అధికారిక సమాచారం లేకుండా ఎన్ని రోజులు ఈ తమాషాలు నడిపిస్తారని నిలదీశారు. ఫోన్ ట్యాపింగ్ అంశంలో ఒక్క అధికారిక ప్రకటన రాలేదన్నారు. గతంలో హరీశ్‌రావుపై నమోదైన అక్రమ ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని సుప్రీంకోర్టు కొట్టివేసిందని.. సీఎం బావమరిది బొగ్గు కుంభకోణాన్ని బయటపెట్టినందుకే సాయంత్రం నోటీసులు ఇవ్వడం జరిగిందని అన్నారు.

ఆ సమాచారం తప్పు అయితే సంబంధిత మంత్రి, సింగరేణి అధికారులు ఇప్పటిదాకా ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ కుంభకోణాలను బయటపెట్టిన ప్రతిసారి రాష్ట్ర ప్రభుత్వం అటెన్షన్ డైవర్షన్ పనులు చేస్తున్నదని ఆరోపించారు. రేవంత్‌రెడ్డి బావమరిది సుజన్‌రెడ్డి కేంద్రంగా సింగరేణి టెండర్లను రిగ్గింగ్ చేయడం జరిగిందని.. ఇప్పటిదాకా తొమ్మిది సింగరేణి టెండర్లను సీఎం కుటుంబం నియంత్రించిందని ఆరోపించారు. గతంలో ఎప్పుడూ లేనివిధంగా మైనస్ టెండర్లు పడే చోట అంచనా విలువకన్నా అధికంగా టెండర్లు వేశారని అన్నారు. సింగరేణిని ఒక బంగారు బాతు లాగా చూసి దీని నుంచి నిధులు, డబ్బులు కొల్లగొట్టేందుకు ఒక నిబంధన తీసుకువచ్చారని ఆరోపించారు. సైట్ విజిట్‌కు వచ్చిన ప్రతి ఒక్కరి దగ్గర నుంచి కంపెనీ సమాచారం, ఆ కంపెనీ డైరెక్టర్ల సమాచారం తీసుకుని బెదిరింపులకు దిగారని.. సీఎం బావమరిది స్వయంగా అందరినీ బెదిరిస్తున్నారని అన్నారు. సర్టిఫికెట్ కోసం ఎవరైనా బెదిరింపులకు లొంగకుంటే, సైట్ విజిట్ సర్టిఫికెట్ అర్హులైన కంపెనీలకు ఇవ్వడం లేదని పేర్కొన్నారు. భట్టి విక్రమార్క రద్దు చేశామని చెప్తున్న నైనీ కోల్ బ్లాక్స్ వెనుక కూడా ఇదే అక్రమ దందా నడుస్తున్నదని.. ఇతర కంపెనీలను అందరినీ బెదిరించి ఎక్కువ అంచనా విలువకు టెండర్లు వేశారని ఆరోపించారు. అందుకే సుజన్‌రెడ్డి కంపెనీకి సైతం అధిక విలువకు టెండర్లు దక్కించుకున్నారని పేర్కొన్నారు. ఈ మొత్తం సింగరేణి అంశంలో ప్రధాన ముద్దాయి సుజన్‌రెడ్డి అని అని పేర్కొన్నారు.

కిషన్‌రెడ్డికి ఏమైనా వాటాలున్నాయా?

ఈ సింగరేణి దొంగతనంలో బీజేపీకి వాటాలు లేకుంటే ఎందుకు స్పందించడం లేదని కేటీఆర్ ప్రశ్నించారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి స్వయంగా బాధ్యత తీసుకోవాలని.. కేంద్ర, రాష్ట్రం భాగస్వాములుగా ఉన్న సింగరేణికి తీవ్రమైన ఆర్థిక నష్టం జరుగుతున్నప్పుడు ఎందుకు మౌనంగా కిషన్ రెడ్డి ఉన్నారని నిలదీశారు. కేంద్ర కోల్‌శాఖ మంత్రికి సైతం ఇందులో వాటాలు ఉన్నాయని అనుకోవాల్సి వస్తుందన్నారు. వెంటనే ఈ అంశంపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ వేయాలని డిమాండ్ చేశారు. సైట్ విజిటేషన్ సర్టిఫికెట్ వంటి అడ్డగోలు నిబంధన పెట్టిన విషయంపై విచారణ జరగాలన్నారు. నైనీ గనులతోపాటు మిగిలిన 9 కాంట్రాక్టులను రద్దు చేస్తారా లేదా అని హరీశ్‌రావు ప్రశ్నించారని.. అందుకే అటెన్షన్ డైవర్షన్ కోసం నోటీసులు ఇచ్చారని తెలిపారు. గతంలో కూడా ఇదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అమృత్ టెండర్ల స్కాం, రేషన్ బియ్యం స్కాం, లగచర్ల, మూసీ అంశాలను తెరపైకి తీసుకొచ్చినప్పుడు, సాక్షాధారాలు చూపించినప్పుడు ఇదే అటెన్షన్ డైవర్షన్ చేశారన్నారు.

8 మంది మంత్రులను ఎదుర్కొన్న హరీశ్‌

అసెంబ్లీలోనే 8 మంది మంత్రులను ఎదుర్కొన్న హరీశ్‌రావును నలుగురు పోలీస్ అధికారుల ముందు కూర్చోబెడితే ఏమవుతుందని కేటీఆర్ ప్రశ్నించారు. ఇచ్చిన హామీలు అమలు చేయడం చేతకాక రెండేళ్లుగా డైవర్షన్లకు పాల్పడుతున్నారన్నారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి చట్టంపై, రాజ్యాంగంపై ఏ మాత్రం గౌరవం లేదని.. సుప్రీంకోర్టు స్వయంగా తెలంగాణలో టెలిఫోన్ ట్యాపింగ్ జరగలేదని చెప్పినా నోటీసులు ఇచ్చిందని అన్నారు. ఇలాంటి నోటీసులు వెయ్యి ఇచ్చినా, మరో వంద సిట్లు వేసినా ప్రభుత్వాన్ని నిలదీస్తూనే ఉంటామని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ చిహ్నం, తెలంగాణ బలం, తెలంగాణ గళం బీఆర్ఎస్ పార్టీ అని అన్నారు. కేసీఆర్‌కు నోటీసులు ఇచ్చినా భయపడేది లేదని అన్నారు. నిజంగానే సిట్ వేయాల్సి వస్తే మంత్రుల రాచకాలు, అవినీతి, అక్రమాలపై వేయాల్సి ఉంటుందన్నారు. మరో రెండేళ్ల తరువాత తమ ప్రభుత్వం వస్తుందనే విషయాన్ని రేవంత్‌రెడ్డి గుర్తుంచుకోవాలని సూచించారు.

అధికారులను వదిలిపెట్టేది లేదు..

రేవంత్‌రెడ్డి రాజకీయ క్రీడలో పోలీస్ అధికారులు కచ్చితంగా భవిష్యత్తులో బలి అవుతారని కేటీఆర్ హెచ్చరించారు. రిటైర్ అయిన తర్వాత కూడా ఇప్పుడు రెచ్చిపోయే పోలీస్ అధికారులను వదిలిపెట్టేది లేదన్నారు. అక్రమం అని తెలిసి కేసులు పెడుతున్న వారిని వదిలిపెట్టబోమన్నారు. ‘ఎమర్జెన్సీ ఉంటే మీరంతా లోపల ఉండేవారు’ అంటూ ఎక్కువ మాట్లాడుతున్న అధికారులు సైతం ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు. రేవంత్‌రెడ్డి హార్వర్డ్ వెళ్లి ఏం చేస్తాడో అర్థమవుతలేదని.. ఇంగ్లిష్ మాట్లాడే వాళ్లని తిడతారేమోనని అన్నారు. రేవంత్‌రెడ్డి హార్వాడ్‌లో చదువుకున్న తర్వాత కొత్త మంచిగా వస్తారని ఆశిస్తున్నానని చెప్పారు. ‘మా పార్టీ జెండా గద్దెలను దమ్ముంటే ముట్టుకోండి. మా జండా గద్దెలను ముట్టుకుంటే మీ గద్దెలు పోతాయి’ అని హెచ్చరించారు. కేవలం తనను ఎవరూ గుర్తుపట్టడం లేదన్న ఉద్దేశంతోనే పదేపదే పిచ్చి వ్యాఖ్యలు చేస్తున్నారని.. పదేళ్లలో తాము సైతం ప్రతిపక్షాలపైన కాంగ్రెస్ మాదిరి మాట్లాడి దాడులు చేసి ఉంటే ఒక్కరు కూడా మిగలకుండా పోయేదని అన్నారు.

Next Story