- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బీఆర్ఎస్ శ్రేణులకు కేటీఆర్ కీలక పిలుపు
మున్సిపల్ ఎన్నికల్లో సత్తాచాటాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. శుక్రవారం హైదరాబాద్‌లో ఉమ్మడి కరీంనగర్ జిల్లా మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు.

దిశ, తెలంగాణ బ్యూరో: మున్సిపల్ ఎన్నికల్లో సత్తాచాటాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. శుక్రవారం హైదరాబాద్‌లో ఉమ్మడి కరీంనగర్ జిల్లా మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. కరీంనగర్ బీఆర్ఎస్ పార్టీ కోట అని, రెండున్నర దశాబ్దాలుగా అన్ని ఎన్నికల్లో పార్టీ వెంట కరీంనగర్ ప్రజానీకం నిలబడ్డారన్నారని అన్నారు. ఈ ఎన్నికల్లోనూ పార్టీని గెలిపించి మరోసారి కరీంనగర్ గడ్డ సత్తా చాటాలని అన్నారు. ఈ సందర్భంగా పార్టీ నేతలు తమ పరిధిలో ఉన్న మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో పార్టీపరంగా సన్నద్ధతను తెలియజేశారు. ఇప్పటికే ప్రతి వార్డు, డివిజన్ వారీగా మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు నేతలు కేటీఆర్‌కు తెలిపారు. ఈ సందర్భంగా కరీంనగర్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన పలు అంశాలపై కేటీఆర్ నేతలకు దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశానికి ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, జిల్లా అధ్యక్షులు, ముఖ్యనేతలు హాజరయ్యారు.
మున్సిపల్ ఎన్నికలకు సన్నద్ధం
మరోవైపు.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దిశానిర్దేశం మేరకు వచ్చే మున్సిపల్ ఎన్నికలకు పార్టీని సన్నద్ధం చేసే ప్రక్రియకు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శుక్రవారం శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా వరుసగా జిల్లాల వారీగా మున్సిపల్ ఎన్నికల సమావేశాలను నిర్వహిస్తున్నారు. వరంగల్ జిల్లాతో పాటు కరీంనగర్ జిల్లాకు సంబంధించిన జిల్లా అధ్యక్షులు, ప్రజాప్రతినిధులతో ముఖ్యనేతలతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. వచ్చే పురపోరులో పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై విస్తృతంగా చర్చించారు. ఇటీవల పంచాయతీ ఎన్నికల్లో అధికార పార్టీ ఎన్ని ప్రలోభాలకు గురిచేసినా, అడ్డదారులు తొక్కినా 4,000 పైచిలుకు గ్రామ పంచాయతీలు బీఆర్ఎస్ గెలవడం రాష్ట్రంలో మారుతున్న రాజకీయ ముఖచిత్రానికి స్పష్టమైన సంకేతమని కేటీఆర్ అన్నారు. 24 నెలల కాంగ్రెస్ ప్రభుత్వ మోసాన్ని, అన్ని రంగాల్లో కుప్పకూలిన పరిపాలనకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రజానీకం కాంగ్రెస్ పార్టీపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నదని చెప్పారు. రేవంత్ చేతకాని పాలనతో ప్రజలు పూర్తిగా విసిగిపోయారని చెప్పడానికి ఈ ఫలితాలే ప్రత్యక్ష సాక్షమని, వచ్చే మున్సిపల్ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీకి ఇంతకన్నా పెద్ద ఎదురుదెబ్బ తప్పదని స్పష్టం చేశారు. కేవలం రెండేళ్లలోనే అధికార పక్షంపై ఇంత తీవ్రమైన వ్యతిరేకత రావడం ఎప్పుడూ చూడలేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ పాలనతో విసిగిపోయిన ప్రజలు బీఆర్ఎస్ వైపు చూస్తున్నారన్నారు.
ఎన్నికలకు సన్నద్ధం కండి..
పంచాయతీ ఎన్నికల ఫలితాలు ఇచ్చిన స్ఫూర్తితో మున్సిపల్ ఎన్నికలకు సన్నద్ధం కావాల్సిన సమయం ఆసన్నమైందని కేటీఆర్ పిలుపునిచ్చారు. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా 24 నెలలుగా పట్టణాల్లో నెలకొన్న సమస్యలను ప్రజల ముందు ఉంచాలని కేటీఆర్ పార్టీ నేతలను కోరారు. పారిశుధ్యం నుంచి మొదలుకొని వీధి దీపాల వరకు అన్ని అంశాల్లో కాంగ్రెస్ పార్టీ చేతులెత్తేసిందని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, రేవంత్ పాలనలో పట్టణాల్లో కొత్తగా ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదని.. మున్సిపాలిటీలు సమస్యలకు కేరాఫ్‌గా మారాయని మండిపడ్డారు. గతంలో బీఆర్ఎస్ హయాంలో ఇచ్చిన నిధులకు పనులకు తిరిగి శిలాఫలకాలు వేయడం తప్పించి రెండేళ్లుగా కాంగ్రెస్ పార్టీ చేసిన ఒక్క పని కూడా లేదన్నారు. సుమారు దశాబ్ద కాలంపాటు బీఆర్ఎస్ హయంలో పట్టణ ప్రగతితో పురపాలికల రూపురేఖలు మారిపోయాయని, ప్రతి మున్సిపాలిటీని గ్రోత్ ఇంజన్లుగా తీర్చిదిద్దామని గుర్తుచేశారు. పట్టణ ప్రగతితోపాటు ప్రతి మునిసిపాలిటీలో అవసరమైన అనేక అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేశామని, వీటిని ప్రజలకు గుర్తు చేయాలని సూచించారు.






