- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
CM రేవంత్‌లో నిజాయతీ ఉంది: కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు
రాష్ట్రంలో బీజేపీ ఏనాటికీ కాంగ్రెస్ పార్టీ దుర్మార్గ పాలనకు ప్రత్యామ్నాయం కాబోదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో బీజేపీ ఏనాటికీ కాంగ్రెస్ పార్టీ దుర్మార్గ పాలనకు ప్రత్యామ్నాయం కాబోదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. 24 నెలల కాంగ్రెస్ పార్టీ అసమర్థ పాలనకు, పదేళ్లలో జరిగిన అద్భుతమైన అభివృద్ధిని ప్రజలు బేరీజు వేసుకుంటున్నారని, కచ్చితంగా మరోసారి బీఆర్ఎస్ వైపు నిలిచేందుకు సంసిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఆదివారం ఆదిలాబాద్, మెదక్ జిల్లాల మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రెండు జిల్లాల్లో పార్టీ అనుసరించాల్సిన మున్సిపల్ ఎన్నికల వ్యూహాన్ని, ఇతర అంశాలపైన కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. అనంతరం మాట్లాడుతూ.. జూబ్లీహిల్స్ ఎన్నికల నుంచి మొదలుకొని సర్పంచుల వరకు ప్రతి ఎన్నికల్లో బీఆర్ఎస్ వైపు ప్రజలు నిలబడ్డారన్నారు. రాష్ట్రంలో రెండేళ్ల కింద జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ సాధించిన విజయం గాలివాటమే అని, ఎన్నడూ లేని ఒక విభిన్నమైన పరిస్థితి వలన బీజేపీ గెలిచిందన్నారు. గతంలో కానీ.. భవిష్యత్తులో కానీ బీజేపీకి రాష్ట్రంలో క్షేత్రస్థాయిలో బలం లేదన్నారు. అసెంబ్లీలో పోటీ చేసిన ప్రతి ఒక్క బీజేపీ సీనియర్ నేత ఘోరమైన ఓటమి పాలయ్యారని, పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం గాలివాటంగా గెలిచారన్నారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయం కాబోదని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అరాచకాలపై, అవినీతిపై, అక్రమాలపై 24 నెలలుగా ప్రజల పక్షాన కొట్లాడుతున్న పార్టీ బీఆర్ఎస్ అని స్పష్టం చేశారు.
ఆ రెండు పార్టీలకు ప్రజలు బుద్ధి చెప్తారు
కాంగ్రెస్ పార్టీ మొన్నటి పంచాయతీ ఎన్నికల్లో చేసిన అధికార దుర్వినియోగం, చెప్పిన తప్పుడు లెక్కలు అన్నీ రానున్న మున్సిపల్ ఎన్నికల్లో తేలిపోతాయని కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ అన్నివర్గాలను మోసం చేసిందని.. కృష్ణా జలాల నుంచి మొదలుకొని అంతర్రాష్ట్ర వ్యవహారాల్లో తెలంగాణ ప్రయోజనాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నదని అన్నారు. అయినా.. బీజేపీ ఒక్క మాట కూడా మాట్లాడడం లేదని అన్నారు. రాష్ట్ర ప్రయోజనాలకు, భవిష్యత్తుకు వ్యతిరేకులైన ఈ రెండు జాతీయ పార్టీలను, వారి తెలంగాణ వ్యతిరేక ఎజెండాలను ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. అందుకే ఈ రెండు పార్టీలకు భవిష్యత్తులో ప్రజలు తగిన బుద్ధి చెబుతారన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. పురపాలక ఎన్నికల్లో సమష్టిగా కొట్లాడి కాంగ్రెస్‌పై ఘనమైన విజయం సాధించాలన్నారు. ఎక్కడికక్కడ ప్రభుత్వం వైఫల్యాలను, హామీల మోసాన్ని ప్రజల్లోకి తీసుకుపోవాలని సూచించారు. ఈ సందర్భంగా ఆదిలాబాద్, మెదక్ జిల్లాల్లోని మున్సిపాలిటీలలో ఉన్న స్థానిక పరిస్థితులపై అడిగి తెలుసుకున్నారు. కేటీఆర్‌తోపాటు పార్టీ సీనియర్ నేత, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు పాల్గొని అనేక అంశాలపై పార్టీ శ్రేణులకు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. పార్లమెంట్ ఎన్నికల నాటికి ఇప్పటికి బీజేపీ గ్రాఫ్ దాదాపుగా పడిపోయిందని, రానున్న ఎన్నికల్లో పోటీ ముమ్మాటికీ కాంగ్రెస్-బీఆర్ఎస్ పార్టీ మధ్యలోనే ఉంటుందని తెలియజేశారు.
రేవంత్ నిజాయతీ గల మోసగాడు
సీఎం రేవంత్‌రెడ్డి నిజాయతీ కలిగిన మోసగాడు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. రాష్ట్రంలో వెనుకటి రోజులు తెస్తానని ముందే చెప్పి అధికారంలోకి వచ్చిన ఆయన.. చెప్పినట్లుగానే అన్నివర్గాల ప్రజలను మోసం చేస్తున్నారని అన్నారు. ఆదివారం తెలంగాణ భవన్లో రాజేంద్రనగర్ నియోజకవర్గం బండ్లగూడ మాజీ మేయర్ శ్రీలత ప్రేమ్‌గౌడ్, వారి అనుచరులు కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి నాడు రెట్టింపు పెన్షన్లు, రైతుబంధు, దళిత బంధు, రెండు లక్షల ఉద్యోగాలు, పీఆర్సీ ఇలా అనేక కార్యక్రమాలను ప్రకటించి ఒక్కదానిని అమలు చేయకుండా విజయవంతంగా తెలంగాణ ప్రజలను 24 నెలలుగా మోసం చేస్తున్నారన్నారు. తాజాగా నిరుద్యోగులు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేస్తున్నారని, వారు చేస్తున్న ఆందోళనను గౌరవించి వారిని పిలుచుకొని, ఉద్యోగాలు ఇస్తామని భరోసా ఇవ్వాలన్నారు. ఆర్టీసీ క్రాస్ రోడ్‌లో బట్టల షాపు ప్రారంభోత్సవానికి పోయిన రేవంత్‌రెడ్డి పక్కనే ఉన్న గాంధీనగర్‌కు పోలేక పోయిండని అన్నారు. ఫిరాయింపు ఎమ్మెల్యేల పరిస్థితి చాలా దయనీయంగా ఉన్నదని, నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలమని చెప్పుకుంటూ స్పీకర్ దగ్గర మాత్రం బీఆర్ఎస్ పార్టీ అని అంటున్నారని తెలిపారు. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ ఏం అభివృద్ధి చూసి కాంగ్రెస్‌లో చేరారో నియోజకవర్గ ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. రాజేంద్రనగర్‌కు వచ్చే మెట్రో ఎక్స్‌ప్రెస్ రద్దు చేసినందుకు సీఎంతో కలిసిపోయారా అని ప్రశ్నించారు. ఈ సమావేశంలో మాజీమంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, పార్టీ నేత కార్తీక్‌రెడ్డి పాల్గొన్నారు.






