KTR: రేవంత్ ఎల్లకాలం సీఎం సీట్లో ఉండరు

by Gantepaka Srikanth |

రేవంత్‌రెడ్డి ప్రభుత్వం పిచ్చోడి చేతిలో రాయిలా మారిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు.

KTR: రేవంత్ ఎల్లకాలం సీఎం సీట్లో ఉండరు
X

దిశ, తెలంగాణ బ్యూరో: రేవంత్‌రెడ్డి ప్రభుత్వం పిచ్చోడి చేతిలో రాయిలా మారిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆరు గ్యారెంటీలు 420 హామీల పేరు చెప్పి అధికారంలోకి వచ్చారని.. హామీల అమలును పక్కనపెట్టి కేవలం పేర్లు మార్చడంపైనే ఫోకస్ పెట్టారని అన్నారు. హైదరాబాద్-సికింద్రాబాద్ జంట నగరాలుగా పెద్ద నగరంగా విస్తరించాయని.. ఈ రెండు నగరాలు ప్రపంచవ్యాప్తంగా జంట నగరాలుగా పేరుపొందాయని తెలిపారు. గతంలో పుస్తకాల్లో చదువుకున్న తుగ్లక్ గురించి ఈరోజు అందరికీ కనిపిస్తున్నదని.. తుగ్లక్ అంటే ఎట్లా ఉంటాడో రేవంత్‌రెడ్డిని చూసి అర్థం చేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. మొదట టీఎస్ తీసేసి టీజీ పెట్టారని.. ఆ తర్వాత తెలంగాణ తల్లిని మార్చారని.. తెలంగాణ తల్లి నుంచి బతుకమ్మను తీసేశారని.. అధికార చిహ్నం నుంచి కాకతీయ కళా తోరణాన్ని, చార్మినార్‌ను తొలగించారని తెలిపారు. వీటితో ప్రజలకు ఏమాత్రం లాభం జరిగిందో ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్-సికింద్రాబాద్ అనేది తెలంగాణ ప్రజల అస్తిత్వం చిహ్నాలని.. రేవంత్‌రెడ్డి తీసుకున్న తుగ్లక్ నిర్ణయం వలన సికింద్రాబాద్‌కు చారిత్రక గుర్తింపు పూర్తిగా పోయేలా ఉన్నదని ఆందోళన వ్యక్తం చేశారు. సికింద్రాబాద్‌లోని అన్నివర్గాల ప్రజలు ఒక్కటై.. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారని అన్నారు. ప్రజలంతా సంఘటితమై తమ పార్టీని ఆహ్వానించారని అన్నారు.

ఇంత అరాచకమా?

అధికారం ఇచ్చింది పట్టణాల అస్తిత్వాలను గుర్తులేకుండా చెరిపేయడం కోసం కాదని సూచించారు. హైదరాబాద్ నగరంలో రెండేళ్లుగా ఒక్క ఇటుక కూడా పెట్టలేదని.. ఒక్క రోడ్డు వేయలేదని.. ఒక ఇల్లు కట్టలేదని.. కానీ నగరం మొత్తం తన విధ్వంసం ప్రణాళికలతోని ముందుకు పోతున్నారని అన్నారు. శాంతి ర్యాలీకి అనుమతి ఉందని చెప్పి వేలాది మందిని కార్పొరేటర్లను, మాజీ కార్పొరేటర్లను, పార్టీ సీనియర్ నాయకులను సాధారణ ప్రజలను ఎక్కడికి అక్కడ అరెస్టు చేశారన్నారు. ఇంత అరాచకంగా అక్రమంగా పనిచేస్తున్న ప్రభుత్వం అధికార శాశ్వతం కాదని గుర్తుపెట్టుకోవాలన్నారు. ఇప్పుడున్న పదవిలో ఎల్లకాలం రేవంత్‌రెడ్డి కొనసాగరన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. ఇప్పటికైనా సికింద్రాబాద్ అస్తిత్వాన్ని చేరిపి వేసే ప్రయత్నం మానుకోవాలని డిమాండ్ చేశారు. శాంతి ర్యాలీని భగ్నం చేశామని చెప్పి రేవంత్, ఆయన ప్రభుత్వం పైశాచిక ఆనందం పొందినా.. అది తాత్కాలికమేనని.. మరోసారి కోర్టుకు వెళ్లి ర్యాలీని నిర్వహించుకుంటామని స్పష్టం చేశారు. ర్యాలీ మాత్రమే కాకుండా ఇతర కార్యక్రమాలతో సికింద్రాబాద్ ప్రజల పోరాటానికి అండగా ఉంటామన్నారు. మరోసారి ప్రజల ఆశీర్వాదంతో తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సికింద్రాబాద్‌ను మరో జిల్లాగా మారుస్తామని హామీ ఇచ్చారు. ఫ్యూచర్ లేని సీఎం ఫ్యూచర్ సిటీ కడతామని అంటున్నారని.. పదేళ్ల తర్వాత ఉన్న జిల్లాలను తీసివేస్తామని అంటున్నారని.. చిన్న జిల్లాలతో ప్రజల దగ్గరకు అధికారులు వస్తే రేవంత్‌కి ఉన్న నొప్పి ఏంటో అర్థం కావడం లేదన్నారు. అరెస్ట్ చేసిన వారందరినీ బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఇంత దారుణంగా అన్యాయంగా వ్యవహరించడమే రాజ్యాంగ స్ఫూర్తినా అనేది రాహుల్‌గాంధీ చెప్పాలన్నారు.

ప్రజలకు ఫలాలు అందకుండా రేవంత్ జిల్లాల రద్దు కుట్ర

జిల్లాల పునర్విభజన పేరుతో గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొత్త జిల్లాల రద్దు పేరిట రేవంత్‌రెడ్డి కుట్ర చేస్తున్నారని, ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని కేటీఆర్ పిలుపునిచ్చారు. ప్రజలకు పాలకుల ఫలాలు అందకుండా ఈ చర్యలకు దిగుతున్నారని ఆరోపించారు. శనివారం ఉమ్మడి నల్లగొండ, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాల అధ్యక్షులు, ప్రజాప్రతినిధులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, ముఖ్య నేతలతో పార్టీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. పాలమూరు జిల్లాలో ఉన్న ప్రత్యేక పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని అక్కడి ప్రజలకు ప్రభుత్వం సేవలు, అభివృద్ధి అందాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తూ, కేసీఆర్ పాలమూరును అనేక జిల్లాలుగా మార్చిన విషయాన్ని గుర్తు చేశారు. కానీ పాలమూరు జిల్లా బిడ్డను అని చెప్పుకుంటున్న రేవంత్‌రెడ్డి ఆ ఉమ్మడి జిల్లాపై కుట్రతో జిల్లాలను రద్దు చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. దీంతోపాటు పాలమూరు, నల్గొండ జిల్లాలకు సంబంధించిన అత్యంత కీలకమైన పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రాజెక్టు పనుల్లో జరుగుతున్న ఆలస్యం, కృష్ణా జలాల వాటా వంటి కీలక అంశాలను ప్రజల్లోకి తీసుకుపోవాలని సూచించారు. ఈ రెండు అంశాలపై ఎక్కడికక్కడ ప్రజలను సమీకరించే విధంగా చైతన్యపరిచేలా వివిధ కార్యక్రమాలు చేపట్టాలన్నారు. రానున్న మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ప్రతి మున్సిపాలిటీ వారీగా ప్రత్యేక కార్యాచరణతో, స్థానిక పరిస్థితులకు అనుగుణంగా సమష్టిగా ముందుకు పోవాలని సూచించారు. ఒకప్పుడు తీవ్రంగా వెనుకబడిన నల్లగొండ జిల్లాను ఏ విధంగా అన్నిరంగాల్లో అభివృద్ధి చేశామో ప్రజలకు వివరించాలని సూచించారు.

Next Story